వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గ్రంథి శ్రీనివాస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గ్రంథి శ్రీనివాస్

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గ్రంథి శ్రీనివాస్

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012


భీమవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన మెడలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దివంగత నేత రాజశేఖర రెడ్డి సువర్ణయుగంలో గ్రంథి శ్రీనన్న ఎంతో ఆత్మవిశ్వాసంతో పనిచేశాడని అన్నారు. ఈ రోజు నుంచి ఆయన భీమవరం నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా ఉంటాడని ప్రకటించారు. నర్సాపురం ఉప ఎన్నికల్లో గ్రంథి శ్రీను, తోట గోపి(తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి) క్రియాశీలంగా పనిచేస్తారని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇది మూడో జన్మని, తాను ఉన్నంతకాలం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటానని ప్రమాణం చేశారు. 

ఆయనతోపాటు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. సభ తర్వాత కృష్ణా జిల్లాకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం చౌక్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్ష రైతు సంఘాల నాయకులను పరామర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆకివీడులో ఆందోళన చేస్తున్న ఐకేపీ యానిమేటర్లతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని యానిమేటర్లు వాపోయారు. యానిమేటర్లకు రూ.3 వేల వేతనం అందించేలా మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: