పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

మలి విడత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు
ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేరుస్తూ నిర్ణయం

న్యూఢిల్లీ: ఇకపై మతాలకు అతీతంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు సామాజిక సమస్యల నుంచి తప్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, సిక్కుల వివాహాలకు ప్రత్యేక చట్టానికి ఆమోదం తెలిపింది. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం-1969కి సవరణ కింద ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్, దీనిని ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. మతాల వారీగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రస్తుత విధానం కొనసాగుతుందని, అయితే, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు కోరుకున్నట్లయితే, వారికి మతాతీతంగా సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందని న్యాయశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని మతాల వారికీ వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు 2006 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన దరిమిలా, కేంద్రం ఈ బిల్లును ముందుకు తెచ్చింది.

స్వావలంబన్ పథకానికి మరో రూ.2,065 కోట్లు

అసంఘటిత రంగంలోని 70 లక్షల కార్మికులకు లబ్ధి కలిగించేలా, ‘స్వావలంబన్’ పింఛను పథకానికి అదనంగా మరో రూ.2,065 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పింఛను పథకం కింద 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాలలో నమోదు చేసుకున్న కార్మికులకు రానున్న ఐదేళ్ల వరకు, అంటే 2016-17 వరకు పింఛన్లు చెల్లించేందుకు అదనంగా ఈ నిధులు కేటాయించినట్లు మంత్రి సిబల్ చెప్పారు. ఈ పథకం నుంచి వైదొలగేందుకు వర్తించే నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారు లేదా కనీసం ఇరవయ్యేళ్లు పథకంలో కొనసాగిన వారు దీని నుంచి వైదొలగే అవకాశం ఉంది. మారిన నిబంధనల ప్రకారం 50 ఏళ్లు నిండిన వారు లేదా ఇరవయ్యేళ్లు పథకంలో కొనసాగిన వారు, ఏ తేదీ చివరిదైతే ఆనాటికి ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. 

లోక్‌పాల్ సవరణలకు ఆమోదం...: లోక్‌సభలో ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు చుక్కెదురైన సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభలో బిల్లును ఆమోదించినప్పుడు ప్రభుత్వం పలు సవరణలకు అంగీకరించింది. ప్రధానిపై విచారణ జరపాలంటే లోక్‌పాల్ సంపూర్ణ ధర్మాసనంలోని మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం ఉండాలనేది ఇందులో ఒకటి. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రధానిపై విచారణ జరిపేందుకు లోక్‌పాల్ సంపూర్ణ ధర్మాసనంలో నాలుగింట మూడొంతుల మెజారిటీ ఆమోదం ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 

లోక్‌పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, దీనికి సమ్మతి తెలిపిన రాష్ట్రాల్లో కూడా ఇది అమలులోకి వస్తుందనే సవరణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. సాయుధ దళాల సిబ్బందిని లోక్‌పాల్ పరిధికి వెలుపల ఉంచడంతో పాటు, మాజీ ఎంపీలకు విచారణ నుంచి మినహాయించే కాలాన్ని ఐదేళ్ల నుంచి ఏడేళ్లకు పొడిగిస్తూ లోక్‌సభలో అంగీకరించిన సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఈ బిల్లును మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా, ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపురలకు చెందిన కొన్ని కులాలను ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సిబల్ చెప్పారు.

పర్యావరణంపై...: పర్యావరణ మార్పులపై యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సచివాలయానికి పంపాల్సిన రెండవ నివేదికను కేబినెట్ ఆమోదించింది. యూఎన్‌ఎఫ్‌సీసీసీ కింద భారత్ చేపడుతున్న చర్యలపై పదేళ్లకు ఒకసారి వెల్లడించాల్సి ఉన్నందున, ఇందుకోసం రూపొందించిన 300 పేజీల నివేదికను కేబినెట్ ఆమోదించింది. 
Share this article :

0 comments: