ఈయనే మా నాయకుడు అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకొనేలా నాయకులుండాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈయనే మా నాయకుడు అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకొనేలా నాయకులుండాలి

ఈయనే మా నాయకుడు అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకొనేలా నాయకులుండాలి

Written By ysrcongress on Friday, April 6, 2012 | 4/06/2012

రైతుల కోసం పదవులు త్యాగం చేసిన వారిని ఆశీర్వదించండి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పర్యటన మొదలు
జననేతను చూడ్డానికి వెల్లువలా తరలివచ్చిన ప్రజానీకం

రామచంద్రపురం నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి: కేంద్రంలో కూర్చుని రిమోట్ కంట్రోల్‌తో రాష్ట్రాన్ని నియంత్రిస్తున్న ఢిల్లీ పెద్దలకు పేదల సమస్యలు పట్టడం లేదని, వారికి కనువిప్పు కలిగేలా ఉప ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉప ఎన్నిక జరగబోయే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం రోడ్‌షో ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ఆయన్ను చూడ్డానికి జనం వెల్లువలా తరలివచ్చారు. కె. గంగవరం, తామరపల్లి ద్రాక్షారామ గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతన్నలకు అండగా పదవిని సైతం త్యాగం చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఉప ఎన్నికల్లో పోటీ రెండు రాజకీయ పార్టీల మధ్యనో, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరుగుతున్నది కాదన్నారు. ఈ సమరంలో రైతులు, పేదలు ఒకవైపు.. కుళ్లు కుతంత్రాలు మరోవైపు పోటీపడుతున్నాయని అభివర్ణించారు. రాజకీయ వ్యవస్థపై విశ్వసనీయత తగ్గిపోతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

మా నాయకుడని చెప్పుకొనేలా ఉండాలి: ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకోవటానికి ఎంతటి వారైనా బాధపడతారు. అందులోనూ అధికార పక్షంతో తలపడాల్సి వస్తే ఇంకా బాధపడతారు. ఇక రైతన్న కోసమో, పేదోడి కోసమో ఆ పదవిని త్యాగం చేయాలంటే మరీ బాధపడతారు. ఐదేళ్లకోసారే కదా వారితో పని అనే అంతా ఆలోచిస్తారు. కానీ పదవి పోతుందని తెలిసినా, ఉప ఎన్నికలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిసినా, అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి ఓడించటానికి కృషి చేస్తున్నాయని తెలిసినా బోస్ అన్న(పిల్లి సుభాష్ చంద్రబోస్) అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. నిజాయతీగా రైతుకు, పేదోడికి అండగా నిలవాలని సంకల్పించారు. 

బోస్ అన్న సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీకి హాజరయ్యే ముందు వారితో మాట్లాడాను. రాజకీయాల్లో పదవులుంటాయి.. పోతాయి. కానీ ఈయనే మా నాయకుడు అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకొనేలా నాయకులుండాలి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితిలేదు. ఏ రైతు మోములోనూ చిరునవ్వులేదు. వ్యవసాయం చేసుకోవటం కన్నా ఉరి వేసుకోవటం మేలని రైతులు అనుకునే పరిస్థితి దాపురించింది. ఆ మహానేత చనిపోయాక ఉపాధిహామీ పథకాన్ని కూడా నీరుగార్చేశారు. క్యూబిక్ మీటరుకు ఇంతని లెక్కగడుతున్నారు. ఆ రూపేణా రోజుకు రూ.45 కూడా కూలీలకు గిట్టడంలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌దీ అదే పరిస్థితి.

ఆరోగ్యశ్రీకి కత్తిరింపు: ఆఖరికి మహానేత సదాశయంతో పేదల ప్రాణాలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నుంచి కూడా 135 రోగాలను తొలగించేశారు. మూగ, చెవుడు నుంచి చిన్న పిల్లల్ని బయటపడేసేందుకు సుమారు రూ.6 లక్షలు ఖర్చయినా ఆపరేషన్ చేయించాలని ఈ పథకం ద్వారా మహానేత తలచారు. దానిని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తోందీ ప్రభుత్వం. రెండేళ్ల వయసులోపు వారికే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతుండటం ఎంతవరకు సమంజసం? రెండేళ్లలోపు పిల్లలకు మూగ, చెవుడు గుర్తించగలరా? తల్లులు ఈ సమస్యలను తెలుసుకోగలరా? మహానేత చనిపోయాక పేదోడి కోసం ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టలేదు. ఇలాంటి ప్రభుత్వానికి, ఢిల్లీలో కూర్చుని రిమోట్‌తో రాష్ట్రాన్ని కంట్రోలు చేస్తున్న పెద్దలకు కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉంది. మీ చల్లని దీవెనలు మనస్ఫూర్తిగా బోస్ అన్నకు అందించాలని విన్నవిస్తున్నా.

వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎంపీ గిరజాల

రాజమండ్రి మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకుడు కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి ఇంటిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గిరజాలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఈయన చేరిక జిల్లాలో ఆ సామాజికవర్గంపై ప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోడ్‌షోలో పలుచోట్ల పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. రోడ్‌షోలో జగన్ వెంట మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, గంపల వెంకటరమణ, కొల్లి నిర్మల కుమారి, తలశిల రఘురాం, ఇందుకూరి రామకృష్ణంరాజు, ఏజేవీబీ మహేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, వడ్డి వీరభద్రరావు, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు.

కిక్కిరిసిన రహదారులు

జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించిన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. మహిళలు రోడ్డుకు అడ్డుగా నిలబడి మరీ జననేతకు హారతులు పట్టి, నుదుట తిలకం దిద్దారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో రాత్రి 10 గంటల వరకు సాగింది. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్ 104వ జయంతిని పురస్కరించుకుని పసలపూడి, యండగండిలలో ఆయన విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కె.గంగవరం, పామర్రు గ్రామాల్లో మహానేత వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. చెల్లూరు సర్వారాయ షుగర్స్‌లో కార్మికులతో ముచ్చటించారు. సంస్థ వ్యవస్థాపకులు సర్వారాయుడు.. విగ్రహానికి పూలమాలలు వేశారు. గొంతు సహకరించకున్నా, ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నా జగన్ లెక్క చేయకుండా గంటల తరబడి మండుటెండలో రోడ్‌షో నిర్వహించారు.
Share this article :

0 comments: