రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది

రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది

Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012

ఈ ఫలితాల ఉత్తేజంతో 2014లో అఖండ విజయం సాధిస్తాం
మాకు అండగా ప్రభుత్వముందని పేదలు
గుండెలపై చెయ్యేసి చెప్పుకునేలా పాలిస్తాం
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లిష్ మీడియం కూడా పెడతాం
తద్వారా బీఈడీ వారికి ఉద్యోగాలు కల్పిస్తాం

రామచంద్రపురం(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది పలుకుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆ ఫలితాలిచ్చే ఉత్తేజంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పేదల పక్షాన నిలిచి అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి ఎమ్మెల్యే పదవిని వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గం రామచంద్రపురంలో(తూర్పుగోదావరి జిల్లా) జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రెండో రోజు రోడ్‌షో నిర్వహించారు. కూనమిల్లిపాడు, బాలాంత్రం, మసకపల్లిలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పర్యటనకు ముందు జగన్ మండల కేంద్రం కె.గంగవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ అభ్యర్థులు తమ సమస్యలను జగన్‌కు మొరపెట్టుకోగా రానున్న సువర్ణయుగంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. జగన్ ప్ర సంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రభుత్వమంటే ప్రజలకు అండగా ఉండాలి: రాబోయే ఉప ఎన్నికల్లో సాధించబోయే విజయాలు పార్టీకి 2014 ఎన్నికలకు బూస్ట్, టానిక్‌లా పనిచేయాలి. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి రైతులకు, పేదలకు అండగా నిలిచిన 17 మంది ఎమ్మెల్యేలకు శాల్యూట్ చేస్తున్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫలానా నేత తమ నాయకుడని ప్రతీ కార్యకర్త చెప్పుకునేలా, ఫలానా పార్టీ తమ పార్టీ అని గర్వపడేలా ఉండాలి. త్వరలోనే రాష్ట్రంలో సువర్ణయుగం వస్తుంది. అందులో పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు తమకు అండగా ప్రభుత్వం ఉందని గుండెలపై చెయ్యేసి చెప్పుకునేలా పాలన ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెడతాం. తద్వారా బీఈడీ వారికి ఉద్యోగాలు కల్పిస్తాం. అంతేకాదు, కూలి పనులు చేసుకునే తల్లులు తమ పిల్లలను బడికి పంపిస్తే ఒక్కో చిన్నారి పేరు మీద రూ.500 చొప్పున తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో వేస్తాం. ప్రతి విద్యార్థీ ఇంజనీరింగ్ పూర్తిచేసే బాధ్యతను ప్రభుత్వమే భరించే విధానాన్ని తీసుకొస్తాం. వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.700కు పెంచుతాం.

పరిష్కారం ప్రజలే ఆలోచించాలి: రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలనుకునే పరిస్థితినిప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపాధి లేక వలసలు పెరిగిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీటన్నింటికీ పరిష్కారం ప్రజలే ఆలోచించాలి.

బోస్ ఓటమికి బాబు, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు

ఎంపీ, ఎమ్మెల్యే పదవులను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందులోనూ పేదోడి కోసమో, రైతుల కోసమో ఆ పని చేయాలంటే మరీమరీ బాధపడతారు. అధికార పక్షంతో తలపడడం ఆషామాషీ కాదు. ఎక్కడికక్కడ మంత్రులు మోహరిస్తారు. మూటలకొద్దీ నోట్ల కట్టలు కుమ్మరిస్తారు. చెప్పుచేతల్లో లేనివారిని, నచ్చనివారిని పోలీసు కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులకు గురిచేస్తారు. ఆప్యాయత, అనురాగాలను వేలం వేసి కొనడానికి కూడా వెనుకాడరు. ఇవన్నీ ఉంటాయని తెలిసినా నిజాయతీగా నిలబడడం కోసం పదవీత్యాగం చేసిన ఘనత బోస్ అన్నదే(పిల్లి సుభాష్ చంద్రబోస్). వచ్చే ఉప ఎన్నికల్లో బోస్‌ను ఓడించడానికి చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలు ఏ రెండు పార్టీల మధ్యో, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యో కాదు.. ఆ ఎన్నికల్లో రైతులు, పేదలు ఓ వైపు ఉంటే, రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యే పోటీ. ప్రజల ఓటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించాలి.

వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే ‘రౌతు’ సోదరుడు

రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సోదరుడు, వ్యాపారవేత్త రౌతు వెంకటేశ్వరరావు శుక్రవారం జగన్‌మోన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కె.గంగవరంలో జగన్‌ను కలిసిన రౌతు పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: