సిబిఐ చార్జిషీట్ అసంపూర్ణం.. తిరస్కరించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ చార్జిషీట్ అసంపూర్ణం.. తిరస్కరించండి

సిబిఐ చార్జిషీట్ అసంపూర్ణం.. తిరస్కరించండి

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

సాయిరెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తి
బెయిల్‌ను అడ్డుకునేందుకే అసంపూర్ణ చార్జ్‌షీట్ దాఖలు చేశారు 
దర్యాప్తు పేరుతో ఎన్నేళ్లు జైల్లో పెడతారు? 
వైఎస్, జగన్ కుట్రపన్నారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.. అలాంటప్పుడు సాయిరెడ్డిని ఎందుకు జైల్లో ఉంచాలి?
జీవోలిచ్చిన మంత్రులు, కార్యదర్శులను సీబీఐ విచారించిందా?
చార్జిషీట్ దాఖలు చేశారు.. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయండి 
సాయిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్ వాదనలు 
మంత్రులు, ఐఏఎస్ అధికారులనూ విచారిస్తామన్న సీబీఐ 
బెయిల్‌పై నిర్ణయాన్ని 12వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సీబీఐ అసంపూర్తిగా చార్జిషీట్‌ను దాఖలు చేసిందని, దానిని తిరస్కరించాలని సాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతిశర్మ సోమవారం విచారించారు. జగన్ కంపెనీల్లో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సాయిరెడ్డి ప్రస్తావనే లేదని, ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం సాయిరెడ్డిని రెండో నిందితునిగా చేర్చారని.. ఎవరి ప్రేరణతోనే సీబీఐ ఆయన్ను నిందితునిగా చేర్చిందని తెలిపారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కలిసి కుట్రపన్నారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొందని.. అలాంటప్పుడు సాయిరెడ్డిని ఎందుకు జైల్లో ఉంచాలని ప్రశ్నించారు. 2007 తర్వాత జగన్ కంపెనీలతో సాయిరెడ్డికి సంబంధమే లేదని, పెట్టుబడుల వ్యవహారాల్లో ఆయన పాత్ర లేదని నివేదించారు. ఈ కేసులో సాయిరెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ ఎటువంటి సాక్ష్యాలను సేకరించిందో తమకు తెలియదని, కీలక సాక్ష్యాలు ఉన్నాయని మాత్రమే ప్రతి సందర్భంలో సీబీఐ వాదిస్తోందని చెప్పారు. విచారణ పేరుతో ఎంత కాలం ఆయన్ను జైల్లో పెడతారని, దర్యాప్తు పూర్తి కావటానికి రెండేళ్లు పడితే అంత కాలం ఆయన్ను జైల్లో ఉంచాల్సిందేనా అని ప్రశ్నించారు. 

మంత్రులు, ఐఏఎస్‌ల సంగతేంటి? 

‘‘ఈ కేసును ఏడు నెలలుగా విచారిస్తున్న సీబీఐ.. సాయిరెడ్డిని మినహా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఆరుగురు మంత్రులు, 14 మంది ఐఏఎస్‌లకు ఇందులో పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. కంపెనీలకు లబ్ధి చేకూరుస్తూ జీవోలు జారీచేసిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సీబీఐ విచారించిందా? లేదా? ప్రస్తుత ప్రభుత్వంలో ఆ మంత్రులు, కార్యదర్శులు కొనసాగుతూనే ఉన్నారు. అసలు సీబీఐ స్టాండ్ ఏంటి? వారిని విచారిస్తుందా లేదా? వారిని విచారించి వారు నిర్దోషులని స్పష్టం చేస్తే పెట్టుబడులు చట్టవిరుద్ధం కాదని తేలినట్లే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 11, 12లను జగన్‌పై ఎలా పెడతారు? నేరం జరిగిందని చెప్పేనాటికి జగన్ పబ్లిక్ సర్వెంట్ కాదు. ఎటువంటి పదవిలో లేరు. ఆయనకు ఈ సెక్షన్లు వర్తించవు. కుట్ర జరిగిందనే పేరుతో అందరిపై 120(బి) సెక్షన్‌ను మోపుతున్నారు. సాయిరెడ్డి తమ నుంచి బలవంతంగా డబ్బు తీసుకున్నారని ఎవరైనా సీబీఐకి ఫిర్యాదు చేశారా? కంపెనీల నుంచి వచ్చిన డబ్బును జగన్ కంపెనీల్లో పెట్టించారని మాత్రమే సాయిరెడ్డిపై సీబీఐ ఆరోపించింది. కుట్రతో సంబంధమేలేని సాయిరెడ్డి ఎంత కాలం జైల్లో ఉండాలి? అవసరం లేకపోయినా ఆయన్ను జైల్లో ఉంచి ఆయన హక్కులను హరిస్తున్నారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి ఇప్పటికి 100 రోజులు పూర్తయ్యింది. ఇప్పటి వరకు సాయిరెడ్డిని మినహా సీబీఐ ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు’’ అని సుశీల్ వివరించారు. 

దర్యాప్తు ఎలా కొనసాగిస్తారు? 

విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఇంకా దర్యాప్తు కొనసాగిస్తామనటం హాస్యాస్పదమని సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ ఎస్పీ ఎఫ్‌ఐఆర్ జారీచేసే నాటికి 74 మందిని నిందితులుగా పేర్కొన్నారని తెలిపారు. నిందితుల పాత్రకు సంబంధించి కూడా ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారని చెప్పారు. రూ. 1,246 కోట్లు పెట్టుబడుల రూపంలో జగన్ కంపెనీల్లో వచ్చాయని పేర్కొన్న సీబీఐ.. చార్జిషీట్‌లో కేవలం రూ. 19 కోట్లకు సంబంధించి మాత్రమే ప్రస్తావించిందని పేర్కొన్నారు. ఇలా చూస్తే రూ. 1,246 కోట్లకు సంబంధించిన దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయటానికి సీబీఐకి ఏళ్ల సమయం పడుతుందన్నారు. అయితే దర్యాప్తులో కొత్త విషయాలు, కొత్త వ్యక్తులకు సంబంధించిన పాత్ర ఉన్నప్పుడే దర్యాప్తు కొనసాగించేందుకు కోర్టు అనుమతించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుశీల్‌కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దురుద్దేశపూరితంగా సీబీఐ అసంపూర్తి చార్జిషీట్ దాఖలు చేసిందని, దీనిపై ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పులు వస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న చార్జిషీట్‌ను తిరస్కరించాలని.. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు సీబీఐకి భారీగా జరిమానా విధించాలని విజ్ఞప్తి చేశారు. 

మంత్రులనూ విచారిస్తాం... 

ఈ వ్యవహారంలో సంబంధమున్న మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారిస్తామని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి వేర్వేరుగా కుట్రకు పాల్పడ్డారని, దర్యాప్తు ఆధారంగా జగన్, సాయిరెడ్డిని నిందితులుగా చేరుస్తూ వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేస్తామని పేర్కొన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడని, అందుకే రాజశేఖరరెడ్డి ఆయన్ను టీటీడీ బోర్డు సభ్యుడు, ఓబీసీ డెరైక్టర్‌గా నియమించారని వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి జగన్ కంపెనీల్లోకి డబ్బు వచ్చిందని, దీనిపై దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని ఆరు దేశాలకు లెటర్ ఆఫ్ రొగెటరీ (ఎల్‌ఆర్)లను పంపామని, సాయిరెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుకు విఘాతం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా.. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో అని చెప్పేందుకు సీబీఐ తరఫు న్యాయవాది ఒక చార్టును కోర్టుకు చూపించింది. అయితే.. ఈ చార్టును తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో గత నాలుగు నెలలుగా ప్రదర్శిస్తున్నారని, అదే చార్టును సీబీఐ కోర్టు ముందుకు తెచ్చిందని సాయిరెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ ఆరోపించారు. ఇరువరి వాదనలు విన్న న్యాయమూర్తి.. తన నిర్ణయాన్ని ఈ నెల 12కు వాయిదా వేశారు.
Share this article :

0 comments: