ఇదేనా ‘ప్రణాళిక’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదేనా ‘ప్రణాళిక’!

ఇదేనా ‘ప్రణాళిక’!

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012



మొత్తానికి మన రాష్ట్రం కోరుకున్నట్టే రూ.48,935 కోట్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికకు ప్రణాళికా సంఘం ఆమోదముద్ర వేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 13.8 శాతం ఎక్కువే కాక, అన్ని రాష్ట్రాలకంటే మనదే అత్యధిక కేటాయింపు అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరమ సంతోషంతో చెప్పారు. కానీ, తరచి చూస్తే ఇందులో సగటు మనిషికి సంతోషం కలిగించేదైతే ఏమీ లేదు. వాస్తవిక అవసరాలు, వనరుల లభ్యత వగైరా వివరాల్లోకి వెళ్లి.. ఆ తర్వాత మనకు వచ్చిందెంతో, అందులో ఏఏ రంగాలకు ఎంత పెరిగిందో చూస్తే నీరసం కలగక మానదు.

ఉదాహరణకు నీటి పారుదలకు గత వార్షిక ప్రణాళికలో రూ.14,970 కోట్లు కేటాయించగా, ఈసారికి అది మరో నాలుగు కోట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే రూ.700 కోట్లు పెంచారన్న మాటేగానీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని చూస్తే ఈ పెంపుదల ఏమాత్రం సరిపోదు. గత మూడేళ్లుగా మన రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పడింది. కనీస మద్దతు ధర లభించక, యేటా క్రమంతప్పకుండా పలకరిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతూ రాష్ట్రంలో రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడు. దుర్భర కరువుతోనూ, అకాల వర్షాలతోనూ అల్లాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతు నష్టపోతున్న దానికీ, వాస్తవంగా ప్రకటిస్తున్న పరిహారానికీ పొంతనే ఉండటం లేదు. ఆ పరిహారం కూడా అదునుకు రావడం లేదు.

ఇన్ని సమస్యలతో రైతు సాగు సమ్మెకు దిగితే... దాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం లేదు సరిగదా... అందుకు కూలీలు దొరక్కపోవడమే అసలు కారణమన్నట్టు చిత్రించి చేతులు దులుపుకోవడం మన ముఖ్యమంత్రికే చెల్లింది. సాగు సమ్మెపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అసంతృప్తి వ్యక్తం చేసి, దాన్ని పునరావృతం కానీయొద్దని సూచించారట. దేశ ఆహార భద్రతపైనే అది ప్రభావం చూపుతుందన్నారట! ఇలా పైపైన వ్యాఖ్యానించి ఊరుకోవడం కాక సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించి ఉంటే పరిష్కార మార్గాలు లభ్యమయ్యేవి. అప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన రూ.2,803 కోట్లు సరిపోవని అర్థమయ్యేది. అలాగే, నీటిపారుదలకు కూడా మరింతగా కేటాయించే అవసరాన్ని గుర్తెరిగేవారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగు రంగానికి అగ్ర ప్రాధాన్యమిచ్చి ప్రారంభించిన జలయజ్ఞాన్ని గత మూడేళ్లలో ఓ పథకం ప్రకారం నీరుగారుస్తున్నారు. జలయజ్ఞాన్ని సజావుగా కొనసాగించాలంటే ఈ ఏడాది రూ.31,000 కోట్లు అవసరమని ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు రాగా, అందులో సగం కంటే తక్కువ కేటాయించడం క్షమించరాని నేరం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు ఏ కొంచెమైనా ముందుకు కదులుతాయో, లేదో ఎవరూ చెప్పలేని స్థితి నెలకొంది. ఇలా చేస్తూ కూడా వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యమిచ్చామని మాట్లాడటం వింతల్లో వింత. ఆపన్న హస్తం కరువై, వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో అప్పులపాలైన రైతుల సంఖ్య మన రాష్ట్రంలోనే ఎక్కువ. వాస్తవాలు ఇలావుండగా.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించాలని ప్రణాళికా సంఘం సూచించిందని స్వయంగా కిరణే చెప్పారు. ముందు మీటర్లు బిగించి, ఆనక పరిమితులు విధించి క్రమేపీ ఉచిత విద్యుత్తుకు మంగళం పాడబోతున్నారని చాలాకాలంనుంచి వింటున్నదే. ‘వారు చెప్పినా మేం మీటర్లు పెట్టడం లేద ’ని ఆయన ముక్తాయింపు ఇచ్చినా రైతు దయనీయ స్థితిపై సానుభూతి లేని సర్కారు మాటల్ని ఎవరూ విశ్వసించరు. సాగు సంక్షోభం ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ 12వ పంచవర్ష ప్రణాళికలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు దీటుగా గోడౌన్లు రెడీ చేయమని మాంటెక్‌సింగ్‌కు ముఖ్యమంత్రి చెప్పడం... అరకొర కేటాయింపులు చేస్తూ కూడా సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తన మాటగా మాంటెక్‌సింగ్ చెప్పడం ఎంత దుస్సాహసం!

ఇక మూడేళ్ల క్రితం జాతీయ సగటును మించి వృద్ధి రేటును నమోదు చేసుకున్న రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో పల్టీలు కొడుతోంది. ఇటు వ్యవసాయంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ వృద్ధి రేటు బక్కచిక్కుతోంది. వ్యవసాయ రంగమైతే మరీ దారుణం... అందులో నెగెటివ్ వృద్ధి రేటు నమోదైంది. 2010-11లో 9.96 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది 6.81 శాతానికి పడిపోనున్నదని రెండు నెలలక్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే తెలియజేయగా..ఇప్పటికది ఇంకా క్షీణించి 5.81కి చేరుకుందని ప్రణాళికా సంఘం లెక్కేసిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. 2007-08లో జాతీయ సగటు 9.32 శాతం ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు 12.02 శాతం ఉన్న సంగతి ఇక్కడ గమనార్హం.

ఆ తర్వాత 2008-09లో అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం ప్రభావంతో అది 6.88 శాతానికి చేరుకున్నా జాతీయ సగటు 6.72 కంటే ఎక్కువే. ఒకపక్క వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, మరోపక్క పారిశ్రామిక అశాంతిని నివారించడంలో విఫలమవుతూ, సేవారంగమూ సరిగా లేక ఇక వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? వాస్తవాలు ఇలావుండగా, అంతా బాగుందంటూ మాంటెక్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించడం ఆశ్చర్యకరం. మూడేళ్ల నాటి ఆదాయంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ ఆదాయం రెట్టింపయింది. కానీ, సంక్షేమ పథకాలు మాత్రం కొడిగడుతున్నాయి. ఇది చాలదన్నట్టు రాయితీల ఖర్చును క్రమేపీ తగ్గించుకోమని ప్రణాళికా సంఘం సలహా ఇస్తోంది. ఒకేసారి 22 శాతంమేర విద్యుత్తు చార్జీలు పెంచడాన్ని సమర్ధించింది. అంతేకాదు.. ప్రతియేటా ఇలాగే పెంచాలని సూచిస్తోంది. ప్రణాళికా సంఘమే ఇలా నేల విడిచి సాము చేస్తూ చిత్తం వచ్చిన సూచనలు చేస్తుంటే ఇక ప్రజలకు దిక్కెవరు?!
Share this article :

0 comments: