వంటగ్యాస్ సిలిండర్‌కు బ్లాక్‌మార్కెట్టే దిక్కు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వంటగ్యాస్ సిలిండర్‌కు బ్లాక్‌మార్కెట్టే దిక్కు...

వంటగ్యాస్ సిలిండర్‌కు బ్లాక్‌మార్కెట్టే దిక్కు...

Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012


డీలర్ దగ్గర బుక్ చేస్తే 20 నుంచి 30 రోజులదాకా ఎదురుచూపులే
బ్లాక్‌లో కొంటే మాత్రం క్షణాల్లో ప్రత్యక్షం
అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ దోచుకుంటున్న ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది
రూ. 402 సిలిండర్ కు బ్లాక్ మార్కెట్‌లో రూ. 500 నుంచి రూ. 1000 
పక్కదారి పడుతున్న దీపం పథకం సిలిండర్లు
విద్యా సంస్థలు, హోటళ్లకు అక్రమంగా సరఫరా చేస్తున్న వైనం
చోద్యం చూస్తున్న అధికారులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? అయితే మీరు ‘బుక్’ అయినట్టే! వారం.. 15 రోజులు.. 20 రోజులు.. నెల కూడా గడిచిపోయింది! కళ్లు కాయలు కాస్తున్నా.. బండ రాలేదు.. బాధ తీరలేదు!! వంటింటి కష్టాలు భరించలేక బ్లాక్‌లో కొనాలనుకుంటే మాత్రం క్షణాల్లో సిలిండర్ మీ ముందు ప్రత్యక్షం!! గ్యాస్ ఏజెన్సీల లాలూచీ, డెలివరీ బాయ్‌ల కక్కుర్తి, పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం.. వెరసి గ్యాస్ వినియోగదారుడి జేబుకు చిల్లుపడుతోంది. రూ.402 సిలిండర్‌కు గత్యంతరంలేని పరిస్థితిలో బ్లాక్‌లో రూ.500-రూ. 1000దాకా ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ దాకా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్లెల్లో అయితే మరీ దారుణం. పనులు మానుకొని మరీ సిలిండర్లు తెచ్చే వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గ్యాస్ బండలు తెచ్చినందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో సిబ్బంది అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. పొరపాటున సిలిండర్ బండి వచ్చినప్పుడు లేకపోయారో.. అంతే! మళ్లీ సమీపంలోని పట్టణానికి వెళ్లి ఏజెన్సీలు, గోదాముల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో కొందరు కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తుండగా... ఇంకొందరు కిరోసిన్ స్టౌలను నమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల సహనం నశించిన కొందరు వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ కార్యాలయాలను ముట్టడి స్తున్నారు. మరోవైపు కంపెనీల నుంచి గ్యాస్ పంపిణీ సరిగా లేకపోవడం వల్లే సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

‘దీపం’ ఉండగానే...

రాష్ర్టంలో మొత్తం రెండు కోట్లకుపైగా కుటుంబాలు ఉండగా.. ఒక కోటీ 47 లక్షల గ్యాస్ కనెక్షన్లు (సాధారణ, దీపం పథకం కలుపుకుని) ఉన్నాయి. వీటిలో దీపం పథకం కింద 37.36 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. చాలా జిల్లాల్లో డ్వాక్రా, స్వయం సహాయక సంఘాలకు ఉద్దేశించిన దీపం పథకం పక్కదోవ పడుతోంది. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రముఖ విద్యా సంస్థలు.. ఏజెన్సీలు, డెలివరీ సిబ్బందితో కుమ్మక్కై పథకం సిలిండర్లను తన్నుకుపోతున్నాయి. నిబంధనల ప్రకారం వారు వాణిజ్య అవసరాల సిలిండర్లను వినియోగించాలి. అయితే వీటి ధర గృహావసరాల సిలిండర్ల కన్నా మూడు రెట్లు అధికం ఉండటంతో ఏజెన్సీలకు, డెలివరీ సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెప్పి బ్లాక్‌లో దీపం సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. దీపం కనెక్షన్లు ఏజెన్సీలకు కాసుల పంట పండిస్తున్నాయనేందుకు ఇటీవల నిజామాబాద్‌లో చోటుచేసుకున్న ఉదంతమే నిదర్శనం. ఫిబ్రవరిలో ఇక్కడ దీపం కనెక్షన్లను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు పక్కదారి పట్టించాయి. ఒక ఏజెన్సీ సుమారు 800 దీపం కనెక్షన్లను బోగస్ డ్వాక్రా మహిళలకు కట్టబెట్టి సుమారు రూ.2.5 కోట్లు దండుకుంది. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఏజెన్సీలు చెలరేగిపోతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ను.. ఆటోలు, కార్లు (ఎల్‌పీజీతో నడిచేవి) తదితర వాహనాలకు అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. వంట సిలిండర్ల నుంచి చిన్న (మినీ) సిలిండర్లలోకి గ్యాస్ నింపి డిమాండ్‌ను బట్టి దాన్ని రూ.500, ఆపై ధరలకు అమ్ముకుంటున్నారు. ఇలా వంటగ్యాస్ అనేక మార్గాల్లో పక్కదారి పడుతుండటంతో సకాలంలో సిలిండర్లు అందక వినియోగదారులు అల్లాడిపోతున్నారు.

జిల్లాల వెతలు ఇవీ..

జిల్లాల్లో గ్యాస్ సరఫరా తీరుతెన్నులపై ‘సాక్షి’ తాజాగా జరిపిన పరిశీలనల్లో ఏజెన్సీల ఆగడాలు, బ్లాక్ బాగోతాలు వెలుగుచూశాయి. చాలా జిల్లాల్లో గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 15-20 రోజులకుగానీ సిలిండర్ రావడం లేదు. బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ రూ.500 నుంచి రూ.1000 దాకా పలుకుతున్నట్టు తేలింది. అనంతపురం జిల్లాలో నెలరోజుల దాకా వేచిచూడాల్సిన వస్తోంది. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ రూ.750 దాకా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సిలిండర్లు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ రూ.600 నుంచి 1000 వరకు పలుకుతోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. బుక్‌చేసిన 35 రోజులకుగానీ హెచ్‌పీ సిలిండర్ రావడం లేదు. అన్ని పట్టణాల్లో టీ బంకులు, హోటళ్లలో ఎక్కువగా గృహావసర సిలిండర్లనే వినియోగిస్తున్నారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి బుక్ చేసిన 25 రోజుల నుంచి 30 రోజులు ఆగాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా విజయవాడలో బుక్ చేశాక సిలిండర్ రావడానికి 16 రోజులదాకా పడుతోంది. డిమాండును బట్టి బ్లాక్‌లో సిలిండర్‌పై రూ.100-150 అధికంగా వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో బుక్ చేసిన 20 రోజులు తర్వాత గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్‌లతో పాటు అమలాపురం, పెద్దాపురం, మండపేట, సామర్లకోట తదితర పట్టణాల్లో గ్యాస్ సకాలంలో అందడంలేదు. గుంటూరు జిల్లాలో 20 ఇరవై రోజుల తర్వాత కాని వినియోగదారులకు సిలిండర్లు అందడం లేదు. గుంటూరులోని ప్రముఖ విద్యాసంస్థల హాస్టళ్లలో ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్లనే వాడుతున్నారు. ఇటీవల ఓ నర్సింగ్ శిక్షణ సంస్థలో 80కి పైగా గృహవినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే బుక్ చేసిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల వరకు సరఫరా చేయలేమని డీలర్లే చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కోసం ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే కనిష్టంగా 15 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బుక్ చేసిన తర్వాత 15-20 రోజులకు సిలిండర్లు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్త్తంగా సువూరు 100 వరకు అక్రవు రీఫిల్లింగ్ కేంద్రాలున్నాయి.

హైదరాబాద్‌లో గ్యాస్ దందా!

హైదరాబాద్‌లో కొన్ని ఏజెన్సీల కక్కుర్తి కారణంగా వంటగ్యాస్‌కు కృత్రిమ కొరత ఏర్పడుతోంది. వాణిజ్య గ్యాస్ రేటు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాల నిర్వాహకులు ఏజెన్సీలతో కుమ్మక్కవుతున్నాయి. దీంతో వినియోగదారులకు పడిగాపులు తప్పడం లేదు. గత నెలాఖరులో మూడ్రోజులపాటు పౌరసరఫరాల శాఖ సిబ్బంది నగరంలో దాడులు చేసి 750 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో సుమారు 13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా 12.50 లక్షల సిలిండర్ల అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. బుకింగ్ చేయని వారి పేరిట కూడా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. నగరంలో ఎల్పీజీతో నడిచే ఆటోలు సైతం వంట గ్యాస్‌తోనే నడుస్తున్నాయి. వీటి సంఖ్య అధికంగా ఉండటంతో.. కొంతమంది ముఠాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీల నుంచి భారీగా సిలిండర్లను ఫిల్లింగ్ కేంద్రాలకు తరలించి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. సైదాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలు ఈ వ్యాపారానికి కేంద్రాలుగా ఉన్నాయి.
Share this article :

0 comments: