ఇక ప్రతి ఏటా బాదుడే ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక ప్రతి ఏటా బాదుడే !

ఇక ప్రతి ఏటా బాదుడే !

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012



చార్జీలు పెంచుతామన్న విద్యుత్ సంస్థలు
భవిష్యత్తులో పేదలపై అధిక భారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టుగా.. ప్రస్తుతం మోపిన రూ.4,500 కోట్ల విద్యుత్ చార్జీల భారం సరిపోదని... భవిష్యత్తులో విద్యుత్ చార్జీల షాక్ కొనసాగుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేల్చిచెప్పాయి. ప్రతి ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతూనే ఉంటామని స్పష్టం చేశాయి. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పాటు చార్జీలు పెంచుతామని పేర్కొన్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి విన్నవించాయి.

ఇందుకోసం జాతీయ టారిఫ్ విధానం-2003ను డిస్కంలు తెరపైకి తీసుకొచ్చాయి. దీని ప్రకారం యూనిట్ విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చుకు 20% అధికంగా లేదా తక్కువగా విద్యుత్ చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదలందరికీ యూనిట్‌కు రూపాయి నుంచి 2.15 వరకూ రాబోయే రోజుల్లో చార్జీలను పెంచాల్సి ఉంటుందని డిస్కంలు హెచ్చరిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ప్రధానంగా పేదలకే విద్యుత్ షాక్ కొట్టనుందన్నమాట.

జాతీయ టారిఫ్ విధానం- 2003 ఏం చెబుతోంది?
యూనిట్ విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చుకు 20% అధికంగా లేదా తక్కువగా విద్యుత్ చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ భరిస్తే పెంపు నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదన్న విషయాన్ని డిస్కంలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో టారిఫ్ విధానం ప్రకారం చార్జీలను ప్రతి ఏటా పెంచుతామని ఈఆర్‌సీకి విన్నవించాయి. 2012-13లో రాష్ట్రంలో యూనిట్ విద్యుత్‌ను వినియోగదారుడికి సరఫరా చేసేందుకు (కాస్ట్ టు సర్వ్) అవుతున్న వ్యయం రూ.4.41గా డిస్కంలు పేర్కొంటున్నాయి.

ఈ కాస్ట్ టు సర్వ్‌కు 20% కంటే ఎక్కువగా లేదా తక్కువగా చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. 20% తక్కువ అంటే సుమారు రూ.3.60 అవుతుంది. 20% అధికం అంటే రూ.5.30 అవుతుంది. ఈ లెక్కన 100 యూనిట్లలోపు వినియోగించే పేదలందరికీ చార్జీల బాదుడు భారీగా ఉండనుందన్నమాట. బొగ్గు, గ్యాసు ధరలు పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం పెరగడం వల్ల విద్యుత్ పంపిణీ ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఖర్చు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ చార్జీలను కూడా పెంచుకుంటూ పోతార న్న మాట. 
Share this article :

0 comments: