కరెంటు షాకిచ్చి.. కంటితుడుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరెంటు షాకిచ్చి.. కంటితుడుపు

కరెంటు షాకిచ్చి.. కంటితుడుపు

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

పెంచింది: రూ. 4,442 కోట్లు
తగ్గించింది: రూ. 175 కోట్లు 
మిగతా రూ. 4,267 కోట్ల భారం జనం నెత్తినే
సర్కారు తగ్గించింది బహుస్వల్పం
ఉప ఎన్నికలు, చార్జీల పెంపుపై సొంతపార్టీలో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం
చార్జీల భారం తగ్గించామని 
ప్రచారం చేసుకునేందుకు ఎత్తులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కర్రు కాల్చి వాత పెట్టి.. కాసింత వెన్న పూసినట్టుగా ఉంది సర్కారు తీరు! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరెంటు చార్జీలు పెంచేసి సామాన్యుడిపై అక్షరాలా రూ.4,442 కోట్ల మేర భారం మోపిన ప్రభుత్వం.. ఇప్పుడు అందులో రూ.175 కోట్లను భరిస్తామంటూ ఘనంగా ప్రకటించింది!! అంటే మిగతా రూ.4,267 కోట్ల భారం జనం నెత్తినే పడనుందన్నమాట. పెంచిన కరెంటు చార్జీల్లో ప్రభుత్వం భరించే సబ్సిడీ కేవలం 3.39 శాతం. ఉప ఎన్నికల పోరు, సొంత పార్టీలోనే వ్యతిరేకత, చార్జీలు ఎక్కువగా వస్తే చెల్లించవద్దని కేబినెట్ మంత్రే పిలుపునివ్వడం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కంటితుడుపు చర్యగా ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. తగ్గించిన మొత్తం అతి స్వల్పమే అయినప్పటికీ.. దీనిద్వారా భారీ ప్రచారం పొందేందుకు పక్కా పథకాన్ని అమలు చేసింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ... తాము తగ్గించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. వాస్తవానికి తుది ఆదేశాలు జారీ చేసే ముందు ఈఆర్‌సీ.. ప్రభుత్వ అనుమతి తీసుకుంటుంది. ఈఆర్‌సీ ప్రతిపాదనలకు గతనెలలో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని కప్పిపెట్టి.. ఈఆర్‌సీ చార్జీలు పెంచిన తర్వాత తాము తగ్గించామని ప్రచారం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నాటకం ఆడినట్టు అర్థమవుతోంది. జనంపై మోపిన భారంలో కేవలం 3.39 శాతాన్నే తగ్గించి... 64 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్టు సర్కారు చెబుతుండటం గమనార్హం.

ఒక యూనిట్ ఖరీదు రూ.61.10
గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్టు సీఎం ప్రకటించడం వల్ల కేవలం 100 యూనిట్ల లోపు వారికి మాత్రమే ఊరట కలగనుంది. 100 యూనిట్లు దాటితే చార్జీల మోత మోగనుంది. ప్రస్తుతం కాంట్రాక్టు లోడు 500 వాట్స్ దాటి 100 యూనిట్లు వినియోగిస్తే.. 0-50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ.72.50, 51-100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున రూ.130 బిల్లు వసూలు చేస్తారు. అంటే మొత్తం రూ.202.50 బిల్లు వస్తుంది. అదే 101 యూనిట్లు వాడితే అంటే అదనంగా ఒక్క యూనిట్ వాడితే అదనంగా రూ.61.10 చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే.. మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున రూ.260, ఒక యూనిట్‌కు 3.60 చొప్పున మొత్తం బిల్లు రూ.263.60 అవుతుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వినియోగించడం వల్ల వినియోగదారుడిపై రూ.61.10 అదనపు భారం పడుతుందన్నమాట. 100 యూనిట్లు పైబడినవారికి మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున వసూలు చేస్తారు.

వైఎస్ హామీ గాలికి..

రానున్న మరో ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు, తర్వాత కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన మరణానంతరం 2010-11లో అప్పటి సీఎం రోశయ్య వెయ్యి కోట్ల రూపాయల మేరకు విద్యుత్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ మరో వెయ్యి కోట్లు వడ్డించారు. ఇప్పుడు తాజాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,442 కోట్ల మేరకు చార్జీలను పెంచేశారు. ఇందులో ప్రస్తుతం ప్రభుత్వం భరించనున్న రూ.175 కోట్లను మినహాయిస్తే.. వైఎస్ మరణానంతరం రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6,267 కోట్ల భారం మోపినట్లు స్పష్టమవుతోంది.
Share this article :

0 comments: