మతి భ్రమించిమాట్లాడుతున్న బాబు: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మతి భ్రమించిమాట్లాడుతున్న బాబు: అంబటి

మతి భ్రమించిమాట్లాడుతున్న బాబు: అంబటి

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో గెలవలేమన్న నిరాశా నిసృ్పహలతో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన వందిమాగధులు పనిగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నాయకులు అదే పాట పాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్‌కు సూరి హత్యతో సంబంధం ఉందని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లో కుట్రలకు, కుతంత్రాలు చేసే అలవాటు చంద్రబాబుదేనని ఆయన మండి పడ్డారు. ‘విశ్వాసఘాతుకానికి విశ్వరూపం... అవినీతి అక్రమాలకు నిలువుటద్దం...కుట్రలూ కుతంత్రాలకు దర్పణం లాంటి చంద్రబాబు ప్రస్తుతం తీవ్ర నిరాశ నిసృ్పహలతో తానేం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. మతి భ్రమించి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తన వారిని ఆయనపైకి ఉసి కొల్పుతున్నారు.’ అని విమర్శించారు. ‘సూరిని హత్య చేసిన భానుకు మంగలి కృష్ణకు సంబంధాలున్నాయనీ కృష్ణ జగన్‌కు సన్నిహితుడనీ అందువల్ల ఈ హత్యలో జగన్ ఏఒన్ (ప్రధాన నిందితుడు) అని బాబు వంకర టింకర లింకులు కలుపుతున్నాడు. ఏం మాటలివి. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా...?’ అని అంబటి నిలదీశారు. 

‘బాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినపుడు ఓ వ్యక్తి మరణించిన కేసులో స్వయంగా బాలకృష్ణ నిందితుడుగా ఉన్నారు. బాలకృష్ణ బాబుకు బావమరిది కనుక చంద్రబాబే ఈ కేసులో మొదటి ముద్దాయి అవుతారా! గాలి ముద్దుకృష్ణమనాయుడు వియ్యంకుడు (పుత్రుడికి పిల్లనిచ్చిన మామ) కట్టా సుబ్రమణ్యం నాయుడు భూకబ్జాలకు సంబంధించిన కేసులో 200 రోజులు జైల్లో ఉన్నారు. మరి, వియ్యంకుడితో సంబంధాలున్నందుకు ఈ కేసులో ముద్దు ప్రథమ ముద్దాయి అవుతారా? చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు మతిభ్రమించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ హత్య జరిగినా జగన్‌కే ఆపాదిస్తారా?’ అని అంబటి నిప్పులు చెరిగారు. 

బాబు మతిభ్రమించి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్‌లో వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, వీరశివారెడ్డి వంటి పిచ్చి ముదిరిన నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చిందులేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను మీడియా ఏమీ అనడం లేదు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా విమర్శించడం లేదు అని చంద్రబాబు ఆక్రోశం వెళ్ల గక్కడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘వారికేం పని మీలాగా వంకర టింకరగా లింకులు కలప డానిని వారికేమైనా మీ మాదిరిగా పిచ్చి పట్టిందనుకుంటున్నారా!’ అని అంబటి పేర్కొన్నారు. 

‘విజయవాడలో జరిగిన వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. మల్లెల బాబ్జీని చంపించింది కూడా బాబేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవేంద్రరావు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన వెనుక కూడా ఆయన హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అంతెందుకు హోంమంత్రిగా ఉండిన ఎలిమినేటి మాధవరెడ్డిని చంపించింది కూడా బాబేనన్న ఆరోపణలు వచ్చాయి. వాటిలో నిజం ఉందా లేదా అనేది తరువాత సంగతి, ఎపుడైనా ఈ ఆరోపణలపై చంద్రబాబు విచారణకు సిద్ధపడ్డారా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. తాజాగా సూరి భార్య భానుమతి తన భర్త హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించిది, గతంలో రంగా భార్య కూడా ఇదే విధమైన ఆరోపణలు చేసింది, మరి ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరుపదని ఆయన అన్నారు. 

జగన్ సభలకు తండోపతండాలుగా వస్తున్న జనం బిర్యానీ పొట్లాలకూ మద్యం బాటిళ్లకూ వస్తున్నారని, యువకులు ఈజీమనీ (తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడం) కోసం చుట్టూ చేరారనీ బాబు చెప్పడం ప్రజలను అవమానించడమేనన్నారు. జగన్ సభలకు జనం భారీగా వస్తున్నారనే వాస్తవాన్ని యువకులంతా జగన్ వెంటే ఉన్నారన్న నిజాన్ని బాబు అంగీకరించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బాబుకు ప్రజలంటే ఉన్న చులకన పూరిత అభిప్రాయం దీంతో వెల్లడైందనీ అందుకే తాము తొలి నుంచీ ఆయన మనసులో ఉండేది ఒకటి బయటకు చెప్పేది మరొకటి అని చెబుతూ వచ్చామని ఆయన అన్నారు. 

జగన్‌కు ఓటేస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు దురుద్దేశ్య పూర్వకంగా చేస్తున్న ప్రచారం అర్థం లేనిదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌కూ, వైఎస్సార్ కాంగ్రెస్‌కూడా ఎలాంటి సంబంధాలు లేవని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీకి మరెవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని ఆయన తేల్చి చెప్పారు.
Share this article :

0 comments: