నిజం చెబితే తల వెయ్యి ముక్కలు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజం చెబితే తల వెయ్యి ముక్కలు..

నిజం చెబితే తల వెయ్యి ముక్కలు..

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

వైఎస్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే యత్నం 
వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బాబు, ఎల్లో మీడియా విషం 
జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని మంగలి కృష్ణ కోసం చేసినట్లుగా వక్రభాష్యం 
తప్పుచేసి ఉంటే తన కుమారుడిని ఉరి తీయాలని పేర్కొన్న వైఎస్ 
సీబీఐ విచారణకు ఆదేశించనందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా 
అవన్నీ దాచేసిన బాబు.. కృష్ణను వైఎస్ వెనకేసుకొచ్చారంటూ వక్రభాష్యం 
నిజాలు వదిలి బాబు ఎల్లో మీడియా మిత్రుల తందాన
అసెంబ్లీ రికార్డుల సాక్షిగా బయటపడ్డ బాబు అబద్ధాలు

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇదిగో ఆనాడు మంగలి కృష్ణను వెనకేసుకొస్తూ అసెంబ్లీలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు. కావాలంటే మీరే చూడండి. అమాయకుడని, ముక్కుపచ్చలారని పిల్లాడని ఎలా వెనకేసుకొచ్చారో...?’’ - అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిస్పృహతో రగిలిపోతూ బుధవారం విలేకరుల సమావేశంలో రెండు పేజీల పత్రాలను విలేకరులకు అందజేశారు. ఇక మర్నాడు షరా మామూలే! బాబు మాటల్ని బాక్సులు కట్టి పతాక శీర్షికల్లో పెట్టి మరీ ఎల్లో పత్రికలు పండుగ చేసుకున్నాయి. బాబు తరఫున, తమ తరఫున కావాల్సినంత విషం కక్కేసి సంబరపడిపోయాయి. వై.ఎస్.జగన్ గురించి ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పిన మాటల్ని.. మంగలి కృష్ణ కోసం చెప్పినట్లుగా వక్రీకరించేంత దిగజారుడుతనం చంద్రబాబుది. అసలు అసెంబ్లీలో ఆనాడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పిందేంటి? ఆయన మరణించారు కాబట్టి.. ఎలాగూ సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్లు బరితెగించేయవచ్చా? జనాన్ని తప్పుదోవ పట్టించొచ్చా? ఈ స్థాయి బరితెగింపు చంద్రబాబుకు తప్ప వేరెవ్వరికైనా సాధ్యమా? ఈ వంచనకిక హద్దూ పద్దూ ఉండదా? ఈ అబద్ధాలకిక అంతూ పొంతూ ఉండదా? అబద్ధాలు పోగేస్తూ.. అధికారంలో ఉండగా తాము నియమించుకున్న వాళ్ల ద్వారా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఎన్నాళ్లిలా? దీన్నేమనుకోవాలి? ఎవరైనా దీన్నెందుకు సహించాలి? వరుస ఓటముల్ని తట్టుకోలేక, మున్ముందు ఎదురుకాబోయే పరాజయాల్ని తలచుకోలేక అంతులేని నైరాశ్యంలో కూరుకుపోయిన చంద్రబాబునాయుడు.. దిగజారలేనంత నైచ్యానికి దిగజారిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. మరి దాన్ని పనిగట్టుకుని, సొంత కథనాల్లోనూ చొప్పించేస్తున్న ఈ ఎల్లో మీడియాకేమైంది? పాఠకులంటే ఎందుకంత చులకన? తాము చెప్పింది జనం నమ్మటం లేదని రోజు రోజుకూ రుజువవుతున్నా వాస్తవాన్ని గ్రహించటం లేదెందుకు?

చంద్రబాబు మాటలు.. దానికి వంతగా ఎల్లో మీడియా ప్రచురించిన కథనంలోని నిజానిజాలేంటో మీరే చూడండి... 

అనంతపురంలో 2001లో నాటి అధికార టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని హతమార్చటానికి సూట్ కేసు బాంబు అమర్చారనే కేసుపై అదే ఏడాది మార్చిలో అసెంబ్లీలో చర్చ జరిగింది. నాటి హోంమంత్రి దేవేందర్‌గౌడ్ మార్చి 19న ఒక ప్రకటన చేయగా.. దానిపై పలువురు నేతలు మాట్లాడారు. మంగలి కృష్ణ పాత్ర లేదని తనకు కింది స్థాయి పోలీసు అధికారులు చెప్పినట్లుగా పేర్కొన్న వైఎస్.. తన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురించి చెప్తూ.. ‘‘ఒక తండ్రిగా ఈ ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నదొక్కటే. నా కుమారుడు తప్పు చేసినట్లయితే శిక్ష వేయండి. మామూలు శిక్ష కాదు. ఉరి తీయండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ తప్పుడు అభియోగాలు మాత్రం చెప్పొద్దు. ముక్కుపచ్చలారని పిల్లవాడు. 26, 27 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని వాడు. వ్యాపారంలో ఎంతో కొంత పైకి వద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు ఒక ముద్దాయిగా, ఫ్యాక్షనిస్ట్‌గా చిన్న వయసున్న అతన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయటం చాలా తప్పని మనవి చేస్తున్నాను.’’ ఇదీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో యథాతథంగా కొంత భాగం. పలు అంతరాయాల మధ్య ఈ వ్యవహారంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఇంకా విశేషమేంటంటే దీనిపై చర్చ అనంతరం ఆయన వాకౌట్ కూడా చేశారు. అది కూడా ఎందుకంటే.. ‘‘చంద్రబాబునాయుడు గారూ! కేంద్రంలో మీరు చక్రం తిప్పుతున్న ప్రభుత్వమే ఉంది. రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. నిజంగా నా తనయుడు తప్పు చేసి ఉంటే శిక్షించండి. నిజానిజాలు తేల్చటానికి దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ విచారణ జరిగితే మీ బండారం బయటపడుతుందన్న కారణంతో దానికి అంగీకరించనందుకు.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ అంటూ సభ వెలుపలికి వెళ్లిపోయారాయన. అదీ జరిగిన విషయం.

మరి దీనిపై చంద్రబాబు, ఆయన మీడియా చెప్పిన వక్రభాష్యం ఏమిటో తెలుసా?
‘సూట్‌కేసు బాంబుపై అసెంబ్లీలో చర్చ’ శీర్షికతో 2001 మార్చి 19న జరిగిన వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రెండు పేజీల డాక్యుమెంట్‌ను బుధవారం చంద్రబాబు విలేకరుల సమావేశం సందర్భంగా విడుదల చేశారు. దీన్లో దెందులూరు కృష్ణతో జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ముడి పెడుతున్నారో తనకు తెలుసునంటూ వైఎస్ చేసిన వ్యాఖ్యల్ని తొలగించేసి.. ఆ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని, దెందులూరు కృష్ణ గురించే చేశారని వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అన్నిటికన్నా ఘోరమేమిటంటే.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతూ... ‘‘ఆయన తప్పు చేసి ఉంటే ఉరితీయండి’’ అన్న వ్యాఖ్యల్ని కావాలని, ఉద్దేశపూర్వకంగా తొలగించి.. తన కుమారుడికి ఏమీ తెలియదని, వ్యాపారంలో ఇపుడిపుడే పైకి వస్తున్నాడని చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఉంచటం. వీటన్నిటితో పాటు చర్చలో భాగంగా నోముల నర్సింహయ్య చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని తొలగించి.. 

‘‘హోంమంత్రి చెప్పిన దాని ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అనుమానాస్పద నిందితుడు’’ అని అన్నట్లుగా మాత్రమే పేర్కొన్నారు. దీన్నేమనాలి? బాబు కుట్రకు, దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట కాదా? అసలు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని.. అలా తమకు నచ్చినట్లుగా మార్చుకుని బయటపెట్టే హక్కు చంద్రబాబుకు ఉందా? ఇది అసెంబ్లీని అవమానపరచటం, సభా హక్కుల్ని ఉల్లంఘించటం కాదా? వీటన్నిటికీ జవాబు చెప్పాల్సింది బాబు, ఆయన ఎల్లో మిత్రులే.
Share this article :

0 comments: