సీఎం, ఆయన సోదరులు అక్రమాలకు తెగబడ్డారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం, ఆయన సోదరులు అక్రమాలకు తెగబడ్డారు

సీఎం, ఆయన సోదరులు అక్రమాలకు తెగబడ్డారు

Written By ysrcongress on Thursday, April 5, 2012 | 4/05/2012

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరులిద్దరూ అక్రమ ధనార్జనకు తలుపులు తెరిచారని, దోచుకున్నవారికి దోచుకున్నంత తరహాలో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. సీఎం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆమెకు వివరించారు. పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పథకాలను సైతం అమలు చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేరని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తిచేశారు. కిరణ్‌పై అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన పెద్దిరెడ్డి బుధవారం మధ్యాహ్నం 12.30కు సోనియాతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. కిరణ్, ఆయన సోదరుల అక్రమ సంపాదనలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఓ నివేదిక అందించినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. సీఎం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నారని సోనియా దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మధ్య అంతరాల కారణంగా క్యాడర్ అయోమయంలో పడిందని, ఈ విషయంలో కిరణ్ వ్యవహార శైలిపైనే అంతా గుర్రుగా ఉన్నారని వివరించినట్లు తెలిసింది. కిరణ్ శైలితో ఆయన్ను కలిసేందుకు సైతం నేతలెవరూ ఆసక్తి చూపడంలేదని చెప్పినట్లు సమాచారం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్ధంగా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని, పథకాల అమలులో చిత్తశుధ్ధి లోపించడం ప్రజల్లో పార్టీపై వ్యతిరేకతను పెంచేందుకు కారణమవుతోందని వివరించినట్లు సమాచారం. రాజీవ్ యువకిరణాలు పథ కం సైతం లక్ష్యాలు చేరలేకపోయిందని చెప్పినట్లు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన కిరణ్‌ను తక్షణమే పదవి నుంచి దించేయాలని గట్టిగా కోరినట్లు తెలిసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా విన్న సోనియా, కిరణ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తమవద్ద అన్ని నివేదికలు ఉన్నాయని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయన్న తరహాలో మాట్లాడినట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన పెద్దిరెడ్డి తన వాహనాన్ని ఆపకుండా, మీడియాతో మాట్లాడకుండా వేగంగా వెళ్లిపోయారు.
Share this article :

0 comments: