చంద్రబాబుకు ‘పోలవరం తమ్ముళ్ల’ షాక్!పార్టీ పదవులకు గుడ్‌బై చెప్పిన సింగన్నదొర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు ‘పోలవరం తమ్ముళ్ల’ షాక్!పార్టీ పదవులకు గుడ్‌బై చెప్పిన సింగన్నదొర

చంద్రబాబుకు ‘పోలవరం తమ్ముళ్ల’ షాక్!పార్టీ పదవులకు గుడ్‌బై చెప్పిన సింగన్నదొర

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012


టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలవరం తెలుగు తమ్ముళ్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన తమ నియోజకవర్గంలో పర్యటించే ముందురోజు పదవులకు రాజీనామాలు చేసి పార్టీ వర్గాల్లో కలకలం రేపారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడికి సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమైన మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర తన అనుచరులు, మద్దతుదారులతో కలసి పార్టీ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. త్వరలో ఉపఎన్నికలు జరగనున్న పోలవరం సీటు కోసం పూనెం కుమారుడు వీరవెంకట సత్యమోహన్, మొడియం శ్రీనివాస్ తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు. ఇరువర్గాలు చంద్రబాబు సమక్షంలోనే సీటు కోసం పట్టుబట్టడంతో కొద్ది రోజులు ఆయన ఈ విషయంపై నాన్చుడు ధోరణి అవలంబించారు. ఉప ఎన్నికలు ముంచుకు వస్తుండడం, తాను ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సివుండడంతో చివరికి నాలుగు రోజుల క్రితం మొడియం శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టున్న తనను కాదని ఒక సాధారణ వ్యక్తికి సీటివ్వడాన్ని సింగన్నదొర అవమానంగా భావించారు. మంగళవారం పోలవరంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి, ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పార్టీలోనే ఉంటానని, పదవుల భారం మోయలేనని స్పష్టం చేశారు. పైకి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా అంతర్గతంగా బాబును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. సింగన్నదొరకు మద్దతుగా తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఈడ్పుగంటి రత్నమాణిక్యం, పార్టీ పోలవరం మండల కమిటీ అధ్యక్షుడు రెడ్డి అప్పారావు, పలు గ్రామ కమిటీలు, రైతు కమిటీల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి, రెండురోజుల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ మరి కొందరు నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

జిల్లా నేతల రాజీ చర్చలు: సింగన్నదొర ఆయన మద్దతుదారుల రాజీనామాలతో ఉలిక్కిపడిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు హుటాహుటిన పోలవరం వెళ్లి చర్చలు జరిపారు. వారిపై కార్యకర్తలు తిరగబడి గందరగోళం సృష్టించారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా నేతలు కోరినా పట్టించుకోని సింగన్నదొర కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. దీంతో బుధవారం చంద్రబాబు పర్యటనలో భాగంగా కొయ్యలగూడెంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి హాజరుకావాలని, అక్కడ అధినేతతో ఈ వ్యవహారంపై చర్చించవచ్చని వారు సూచించి వెనక్కు వచ్చేశారు. బుధవారం పర్యటనలో బాబును నిలదీసేందుకు పూనెం వర్గీయులు సిద్ధమవుతుండడం పార్టీ జిల్లా నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
Share this article :

0 comments: