చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి చెప్పుకోలేరన్న ధైర్యంతోనే అభాండాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి చెప్పుకోలేరన్న ధైర్యంతోనే అభాండాలు

చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి చెప్పుకోలేరన్న ధైర్యంతోనే అభాండాలు

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

వైఎస్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు 
సర్కారు, బాబుపై జగన్ ధ్వజం
వైఎస్ దళితులకు, రైతులకు, పేదలకు వ్యతిరేకని ఆరోపిస్తున్నారు
చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి చెప్పుకోలేరన్న ధైర్యంతోనే అభాండాలు

కొయ్యలగూడెం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: పేదలకు, రైతులకు ఎలా మేలు చేయాలి.. మరణించినా వారి గుండెల్లో ఎలా నిలిచిపోవాలీ అని ఆలోచించాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఎలా బురదజల్లాలీ? అని మాత్రమే ఆలోచిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈ రోజు దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ రాజ్యమేలుతోందీ అంటే దానికి కారణమైన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ఆయన మరణించి రెండున్నరేళ్లు దాటేస్తున్నా ఆయన్ను అప్రదిష్టపాలు చేయాలని రకరకాల రాజకీయాలు చేయడం చూస్తుంటే బాధనిపిస్తోంది. మహానేతపై బురదజల్లడానికిచివరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా కుమ్మక్కయ్యారు. ఆ దివంగత నేతను ఎలా తిట్టాలీ అని ముఖ్యమంత్రి, మంత్రులూ కలిసి చివరకు క్యాబినెట్ భేటీ కూడా పెట్టుకోవడం చూస్తుంటే చాలా చాలా బాధనిపిస్తోంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

నాలుగురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఆయన దానికి ముగింపుగా మంగళవారం కొయ్యలగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. కమ్యూనిస్టు పాలిత పశ్చిమ బెంగాల్‌లో కూడా లేనివిధంగా ఎస్టీలకు 14 లక్షల 75 వేల ఎకరాల అటవీ భూములను సాగు చేసుకోమని ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిదేనని జగన్ గుర్తుచేశారు. జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

చనిపోయిన ఆ మహానేత ఎలాగూ తిరిగి వచ్చి చెప్పలేరన్న ధైర్యంతో కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దివంగత నేత రైతు వ్యతిరేక ని, దళిత వ్యతిరేకని, పేదల వ్యతిరేకని ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఆ దివంగత నేత రైతు వ్యతిరేకేనేమో(వ్యంగ్యంగా).. అందుకేనేమో వరి మద్దతు ధరను పెంచాలని ఆయన తపించారు. తాను సీఎం కాకముందు వరకు రూ.530 మాత్రమే ఉన్న మద్దతు ధరను తన హయాంలో ఏకంగా రూ.1,030కు తీసుకుపోయారు. ముఖ్యమంత్రి అయిన తొలి నాడే రూ.1,200 కోట్ల కరెంటు బకాయిల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేసి రైతన్నను ఆదుకున్నారు. అటువంటి దివంగత నేతను రైతు వ్యతిరేకని అంటున్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రైతు ముఖంలో చిరునవ్వు కనపడితేనే రైతు కూలీ బాగుంటాడు.. వీరిద్దరూ బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని వైఎస్ ఒక స్వప్నాన్ని చూశారు. అందుకే.. పోలవరం ప్రాజెక్టువైపు చూసినప్పుడు గుర్తొచ్చే పేరు వైఎస్సే.

ఏ అవ్వా ఆకలితో చనిపోకూడదని..

అవ్వా తాతలు ఏనాడూ ఆకలితో చనిపోకూడదు.. వారు ఒక పూట భోజనమైనా సంతృప్తిగా తినాలని వైఎస్ ఆలోచన చేశారు. చంద్రబాబు పరిపాలనలాగా గ్రామాల్లో పది మందికి మాత్రమే పింఛన్లు అన్న పరిస్థితి ఉండకూడదని ఒక స్వప్నాన్ని చూశారు. అందుకే వైఎస్ సీఎం కాకముందు వరకు రాష్ట్రంలో 18 లక్షలు మాత్రమే ఉన్న పింఛన్లను సీఎం అయ్యాక ఏకంగా 79 లక్షలకు పెంచారు. ఆ దివంగత నేత సువర్ణయుగంలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్ దేశంతో పోటీపడి ఐదేళ్లలో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు పేదలకు కట్టించారు. పేదరికం పోవాలంటే.. ప్రతి పేదవాడి ఇంటిలోనూ ఒక్కరైనా ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలని వైఎస్ కలలుగన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు.

108కు ఫోన్‌చేస్తే రిపేరులో ఉందంటున్నారు: ఏ పేదవాడికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా జరిగితే.. ఎంత వడ్డీకైనా ఎన్ని లక్షలైనా అప్పు తెచ్చి ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఆ తర్వాత అప్పు తీర్చడానికి జీవితాంతం కష్టపడతాడు. అలా ఏ పేదవాడూ అప్పుల పాలు కాకూడదని దివంగత నేత ఆలోచించారు. ఏ క్షణంలోనైనా 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి.. లక్షలు ఖర్చయ్యే వైద్యమైనా ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపేలా ఓ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన మరణించాక 108కు ఫోన్ చేస్తే.. అంబులెన్సుల్లో డీజిల్ లేదనో.. వాహనం రిపేరులో ఉందనో సమాధానం వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకుని అడుగుతారేమోనని ప్రతిపక్ష నేతవైపు చూస్తే.. మన ఖర్మ కొద్దీ ఆ స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆయన రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తారే తప్ప.. వారి గురించి కనీసం పట్టించుకోరు. ఎప్పుడైనా జగన్ రైతన్న వద్దకు వెళుతున్నాడంటే అప్పుడు అయ్యయ్యో జగన్ వెళ్లిపోతున్నాడే అన్న ఆందోళనతో ఆయన రైతుల వద్దకు బయల్దేరతారు.

కుమ్మక్కుకు నిదర్శనమిదే..

మహానేతను అప్రతిష్టపాలు చేయడానికి ఈ కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఎంతగా కుమ్మక్కయ్యారంటే... వీరిద్దరూ కలిసికట్టుగా కోర్టులదాకా వెళ్లి వైఎస్‌పై కేసులు కూడా వేశారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేశారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన జీఎం నాయుడుకు హైదరాబాద్ నడిబొడ్డున 5 ఎకరాల భూమిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ధారాదత్తం చేశారంటే.. వీరి కుమ్మక్కు రాజకీయాలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ చీకటి రాజకీయాలు ఎవరూ చూడడం లేదనుకుంటే పొరపాటే. పైనున్న దేవుడు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా దక్కవు.
Share this article :

0 comments: