కిరోసిన్ కోత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరోసిన్ కోత

కిరోసిన్ కోత

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

నెలకు 43 లక్షల లీటర్లు తగ్గించిన కేంద్రం
అందుకనుగుణంగా పేదలకు వాత పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
దీపం కనెన్షన్‌దారులకు పూర్తిగా ఎత్తివేత
నగరాల్లో కోటా తగ్గింపునకు పౌరసరఫరాల శాఖ కసరత్తు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇప్పటికే కరెంటు చార్జీల పెంపుతో సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన సర్కారు.. తాజాగా పేదలకు మరో వాత పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కిరోసిన్ కోటా తగ్గడంతో ఆ మేరకు ఇక్కడా కోత విధించాలని నిర్ణయించింది. దీంతో దీపం కనెక్షన్‌దారులకు (ఒక సిలిండర్ ఉన్నవారికి) ప్రస్తుతం నెలకు ఇస్తున్న లీటరు కిరోసిన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు నగరాల్లో కోటాను ఇంకా తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.

దేశవ్యాప్తంగా కిరోసిన్‌పై పేదలకు ఇచ్చే సబ్సిడీని మరో ఆరు నెలల తర్వాత నగదు బదిలీ రూపంలో నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే నగదు బదిలీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే నాటికి సబ్సిడీ కిరోసిన్ పథకాన్నే పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి ఇచ్చే కిరోసిన్ కోటాలో క్రమంగా కోతలు విధించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర కిరోసిన్ కోటాలో కోతలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి అదే పని చేసింది. రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీ కిరోసిన్‌లో నెలకు ఏకంగా 43 లక్షల లీటర్లను తగ్గించింది. మార్చి వరకు ప్రతినెలా రాష్ట్రానికి 4.31 కోట్ల లీటర్ల సబ్సిడీ కిరోసిన్ ఇవ్వగా.. ఏప్రిల్‌లో దీన్ని 3.88 కోట్ల లీటర్లకు తగ్గించారు. ఒక్కసారిగా ఇలా భారీ పరిమాణంలో కోటా తగ్గించడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఏడాది కాలంగా కేంద్రం నుంచి వచ్చిన కోటాలో పేదలకు సరఫరా చేయగా మిగిలి ఉన్న 30 లక్షల లీటర్ల కిరోసిన్‌ను ప్రస్తుత నెలకు సర్దుబాటు చేశామని, వచ్చే నెల నుంచి ఏం చేయాలో తెలియజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం తగ్గిస్తున్న కోటాకు అనుగుణంగా పేదలకు ఇచ్చే కిరోసిన్ కోటాను తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర సర్కారు.. మళ్లీ అదే పనిచేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు కోత విధించేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

కోతలే కోతలు...

రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం కొరవడినప్పటి నుంచి అన్ని అంశాల్లోలాగే కిరోసిన్ కోటాలోనూ మన రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2005 జనవరి నుంచి 2010 మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రతినెలా 5.53 కోట్ల లీటర్ల సబ్సిడీ కిరోసిన్‌ను కేటాయించేది. 2010 ఏప్రిల్‌లో ఒక్కసారే 57 లక్షల లీటర్లను తగ్గించింది. అప్పటి నుంచి రాష్ట్రానికి నెలకు 4.96 కోట్ల లీటర్ల కిరోసిన్ మాత్రమే సరఫరా అయింది. అనంతరం 2011 మే నెలలో మళ్లీ 65 లక్షల లీటర్ల కిరోసిన్‌ను తగ్గించింది. అప్పటి నుంచి రాష్ట్రానికి 4.31 కోట్ల లీటర్లు వస్తోంది. తగ్గించిన కోటాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి కూడా కేంద్రాన్ని కోరలేదు. కనీసం లేఖలు కూడా రాసిన దాఖలాలు లేవు. కేంద్ర పెట్రోలియం మంత్రిగా రాష్ట్రానికి చెందిన జైపాల్‌రెడ్డి ఉన్నా, మన రాష్ట్రంలోని పేదలకు కిరోసిన్ కోటా పెంచే విషయాన్ని అస్సలు పట్టించుకోవడంలేదు. దీంతో తాజాగా ఏప్రిల్ నుంచి మరో 43 లక్షల లీటర్ల కిరోసిన్‌కు కేంద్రం కోత పెట్టింది.
Share this article :

0 comments: