ఉప్పు కార్మికులకు గోడౌన్లు కట్టిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప్పు కార్మికులకు గోడౌన్లు కట్టిస్తాం

ఉప్పు కార్మికులకు గోడౌన్లు కట్టిస్తాం

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


పశ్చిమ గోదావరి పర్యటనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వర్షానికి ఉప్పు తడిసిపోకుండా గోడౌన్లో పెట్టుకునేలా చేస్తా
వారికీ రైతుల మాదిరిగానే రుణాలిప్పిస్తా
దళారుల చేతిలో మోసపోకుండా వేయింగ్ మిషన్లు పెట్టిస్తా
ఏడాదిలో నరసాపురం-సఖినేటిపల్లి బ్రిడ్జిని నిర్మించి ఇస్తా
ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికులకు వారం రోజుల్లోనే 
రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం

నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘మొన్న చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు మత్స్యకారులపై ప్రేమ ఒలకబోస్తూఅగాహన లేకుండా ఒక హామీ ఇచ్చారట. ఇప్పుడే మనవాళ్లు చెప్పారు. చంద్రబాబు ఎంతగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే... ఆ ఉప్పును ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫాంలు కట్టిస్తారట. ఇవాళ నేను ఉప్పు కార్మికుల వద్దకు వెళ్లి ఎలా ఉప్పు పండిస్తున్నారో చూశా. వారికో హామీ ఇస్తున్నా. చంద్రబాబు మాదిరిగా ఆరబోసుకోవడానికి ప్లాట్‌ఫాంలు కట్టివ్వడం కాదు. ఉప్పు కార్మికుల కోసం ఒక గోడౌన్ కట్టిస్తా. పండించిన ఉప్పు వర్షానికి తడిసిపోకుండా ఆ గోడౌన్లలో పెట్టుకునేలా చేస్తా. నేను ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో ఈ గోడౌన్లు కట్టించి మళ్లీ ఈ గ్రామానికి వస్తా...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికలు జరగనున్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో గురువారం ఆయన రెండోరోజు ప్రచారం నిర్వహించారు. పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, ఎల్బీ చర్ల, పితానివారిమెరక గ్రామాల్లో మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఉప్పు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారుల కష్టాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వచ్చే సువర్ణయుగంలో వారి కష్టాలు తీరుస్తానని హామీనిచ్చారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఉప్పు కార్మికులకూ లోన్లు ఇప్పిస్తా...

ఉప్పు కార్మికులకు లోన్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు. వారికి గోడౌన్లు కట్టించడమే కాదు... ఆ కార్మికులను కూడా రైతుల మాదిరిగానే చూడాలి. రైతుల్లాగానే వారికి లోన్లు ఇప్పిస్తా. దళారులు మోసం చేస్తున్నారని ఉప్పు కార్మికులు వాపోతున్నారు. 120 కేజీల ఉప్పు బ్యాగ్‌ను తీసుకొచ్చి దాన్ని నూరు కేజీలని చెప్పి ఎక్కువ ఉప్పుతో నింపేసుకుపోతున్నారు. దీనివల్ల రైతులు మోసపోతున్నారు. దళారుల నుంచి కాపాడ్డానికి మీ గ్రామాల్లో వేయింగ్ మిషన్లు పెట్టిస్తా. ప్రతి ఉప్పు మూటను లెక్కించి పంపిస్తా. ఇంకోటి కూడాచెబుతున్నా. నరసాపురం-సఖినేటిపల్లి బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తే ఉప్పు కార్మికులు సైకిల్ మీద వెళ్లి ఉప్పు అమ్ముకుని వస్తారు. నేను ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోపే ఆ బ్రిడ్జిని నిర్మించి ఇస్తానని హామీ ఇస్తున్నా..


గీత కార్మికులకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా..

నేను ఇవాళ గీత కార్మికులతో మాట్లాడా. వాళ్ల కష్టాలను నాకు చెప్పారు. అప్పుడు నేను వారిని ప్రశ్నించా. అన్నా మీరు ప్రాణాలు కూడా లెక్కచేయకుండా చెట్టు ఎక్కుతున్నారు.. ఒకవేళ ప్రమాదవశాత్తూ కిందపడిపోతే పరిస్థితి ఏంటన్నా.. అని అడిగా. గీతకు వెళ్లినవాళ్లు తిరిగిరాకపోతే మీ పరిస్థితి ఏంటమ్మా అని ఆ ఆక్కాచెల్లెళ్లను కూడా అడిగా. ఆ చెల్లెమ్మ చెప్పింది.. మా కుటుంబంలో తండ్రి, సోదరుడు కూడా గీత వృత్తే చేస్తారని. వారికేదైనా ప్రమాదం జరిగితే మా కుటుంబం అంతా అనాథగా మారిపోతుందన్నా అని చెప్పింది. అప్పుడు నాకు బాధనిపించింది. గీత కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేశా. చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలోని అక్కాచెల్లెళ్లకు మంచి ముఖ్యమంత్రిగా రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తా. అదీ వారం రోజుల్లో ఇప్పిస్తా. మంచి ముఖ్యమంత్రి అన్నయ్యగా ఆ చెల్లెమ్మకు అండగా నిలబడతా.

మత్స్యకారులకు అండగా ఉంటా..: మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు పొరపాటున ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి వస్తే.. ఆ అక్కాచెల్లెళ్లు ఎంతో ఆందోళన చెందుతారు. త్వరలో ఒక సువర్ణయుగం యుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో ఆ అక్కాచెల్లెళ్లకు ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో కనబడతాడు. ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తా. వేటకు వెళ్లిన వ్యక్తి ఇంకా తిరిగి రాలేదని తెలిసిన వారం రోజుల్లో రూ.50 వేలు ఇప్పిస్తా. ఆ తర్వాత ఆరు నెలల్లో రూ. 4.5 లక్షలు అందేలా చేస్తా.

పిల్లలు పెద్ద చదువులు చదివాలి..

ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజినీరు, డాక్టరు, కలెక్టర్ వంటి ఉన్నత చదువులైనా చదవాలి. వారు కాస్తో కూస్తో సంపాదిస్తే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి. ఆ సువర్ణయుగంలో అక్కాచెల్లెళ్లు పిల్లల్ని చదివించుకోవడానికి బాధపడకూడదు. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం కూడా పెడతా. ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆ తల్లి బ్యాంక్ అకౌంట్‌లో వెయ్యి రూపాయలు వేయిస్తా. ఆ అక్కాచెల్లెమ్మల ముఖాన సంతోషం కనపడాలి. ఇది నాకు పెద్ద సవాల్. దీన్ని చేసి చూపిస్తా. దీన్ని చేసి చూపించిన రోజు స్వర్గంలో ఉన్న దివంగత నేత రాజశేఖరరెడ్డి గర్వపడతారు. ఒక లీడర్‌కు ఒక ఆశ ఉంటుంది. ఒక సంకల్పం ఉంటుంది. చనిపోయిన తర్వాత నాతోపాటు నాన్న ఫొటో కూడా ప్రతి ఇంట్లో కనపడాలి

మీ చల్లని దీవెనలు అందించండి..

జూన్ 12న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం మీ అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి తన పదవిని వదులుకోవాలంటే చాలా బాధపడతాడు. అదీ పేదల కోసం పదవిని వదులుకోవాలంటే ఇంకా బాధపడతాడు. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవిని త్యాగం చేయాలంటే ఆలోచిస్తారు. ఎంతగా ఆలోచిస్తారంటే ఆ పేదవాడితో పనిపడేది ఐదేళ్లకోసారే కదా.. అప్పుడే ఎందుకు వారికోసం పదవిని వదులుకోవాలని ఆలోచిస్తారు. అందులో అధికారపక్షంతో పోటీ అంటే ఇంకా ఆలోచిస్తారు. పోలీసులు వారికే వత్తాసు పలుకుతారు.. కేసులు పెడతారు.. మంత్రులు మోహరిస్తారని తెలిసినా ప్రసాద్ (నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే) మాత్రం నిజాయితీగా పేదల తరపున నిలబడ్డాడు. వారి కోసం పదవిని త్యాగం చేసి ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. ఆయనకు మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు కావాలి.

పేదోడిని పట్టించుకునేవారేరి..?

ఈ రోజు పేదవాడికి ఇల్లు లేకపోయినా పట్టించుకునేవాడు లేడు. ఆ ఇంట్లో కరెంటు లేకపోయినా పట్టించుకునేవాడు లేడు. ఇంటికి వెళ్లి స్విచ్ వేస్తే కానీ కరెంటు ఉందో లేదో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ పేదవాడికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా.. 108కి ఫోన్ చేస్తే రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో 20 నిమిషాల్లో కుయ్.. కుయ్.. కుయ్‌మంటూ అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే మా అంబులెన్సులు రిపేరు షెడ్లలో ఉన్నాయని, ఆంబులెన్స్‌కు డీజిల్ లేదనే సమాధానం వస్తుంది. త్వరలో సువర్ణయుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో ఎంత ఖర్చయినా పేదవాడికి ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేసి చిరునవ్వుతో అక్కడినుంచి సాగనంపేలా చేస్తా.
Share this article :

0 comments: