చార్జిషీటు సీబీఐ వ్యూహం మరిన్ని చార్జిషీట్లని ముందే తెలుగుదేశం ప్రకటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చార్జిషీటు సీబీఐ వ్యూహం మరిన్ని చార్జిషీట్లని ముందే తెలుగుదేశం ప్రకటన

చార్జిషీటు సీబీఐ వ్యూహం మరిన్ని చార్జిషీట్లని ముందే తెలుగుదేశం ప్రకటన

Written By ysrcongress on Friday, April 6, 2012 | 4/06/2012

చార్జిషీటు సీబీఐ వ్యూహం మరిన్ని చార్జిషీట్లని ముందే తెలుగుదేశం ప్రకటన
న్యాయస్థానాల ద్వారా కేసును నడిపిస్తారని ప్రచారాలు
సీబీఐకి అజెండా నిర్ణయించేలా నిత్యం కథనాలు
అందుకు తగ్గట్లే సీబీఐ నిర్ణయాలు
వైఎస్ కుటుంబం, పరిచయస్తులు, సాక్షి ఇన్వెస్టర్లే లక్ష్యం
రాజకీయంగా జగన్, పత్రిక పరంగా సాక్షి వ్యతిరేకులతో ముఠా
అందుకే చారిటీ భూములపైనా రామోజీ రాతలు
వైఎస్ మరణానంతర పెట్టుబడుల మీద కిరాయి రాతలు
వాన్‌పిక్‌పై వ్యూహాత్మక కథనాలు
చంద్రబాబు అరాచకాలు మరచి నిజాయితీ నటనలు
కాకినాడ పోర్టు, ఐఎంజీ దాగని బాగోతాలు
కాంగ్రెస్‌కూ పాకిన ఎల్లో వైరస్...

గడచిన మూడు రోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ఏముందంటే... బ్రదర్ అనిల్, సునీల్, వాన్‌పిక్! వైఎస్ కుటుంబ సభ్యులు, పరిచయస్తులు, వారి సంస్థల్లో పెట్టుబడి దార్లు- వీరే రామోజీరావు దృష్టిలో ప్రజలకు సంబంధించిన వార్తాంశాలు. సీబీఐ విచారణ అంటూ సాగుతున్న తంతు ఒక వంక, తెలుగుదేశం పార్టీ విషణ్ణ వదనంతో వేసే చిందులు మరోవంక... ఈనాడు, తోక పత్రికల రాతలు ఇంకో వంక! విచిత్రమేమిటంటే అన్నింటి థీమ్ ఒకటే. స్క్రిప్టూ ఒకటే. మాటలూ డైలాగులూ కూడా దాదాపు ఒకటే. మూడింటికీ మూలం ఒకటే. ఈనాడు రాతలే సీబీఐ చార్జిషీట్‌లో ఉంటాయి. సీబీఐ చెప్పబోయేది అంతకన్నా విచిత్రంగా ముందే ఈనాడులోనో, తోక పత్రికలలోనో ముద్రితమవుతూ ఉంటుంది. దానిమీదే తెలుగుదేశం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇదో గూడుపుఠాణీ. గడచిన ఎనిమిది నెలలకు పైగా సీబీఐ విచారణ పేరిట ఈ వ్యవహారానికి వెన్నుదన్నుగా, ముందూవెనకగా ఒక పార్టీ, రెండు పత్రికల ద్వారా సాగుతున్నది సమాచార ప్రసారం కాదు, పాఠకులమీద అత్యాచారం.

మార్చి 31న సీబీఐ చార్జిషీటును న్యాయస్థానంలో సమర్పిస్తే... దానితో సంబంధం లేని అంశాలన్నీ గొలుసుకట్టు కథ(నా)లుగా ఈనాడులో ప్రత్యక్షమవుతున్నాయి. గడచిన నాలుగు రోజుల్లో ఇటు తెలుగుదేశం పార్టీగానీ, మరోవంక దానికి మద్దతు పలుకుతున్న మీడియాగానీ చేస్తున్న ప్రచారాలను గమనిస్తే.... సీబీఐ ప్రకటించక ముందే అది ఎన్ని ఛార్జి షీట్లు దాఖలు చేయబోతోందో తెలుగుదేశం నాయకులు టీవీల చర్చల్లో ప్రకటించేశారు. ఇకమీదట సీబీఐ వ్యూహం న్యాయస్థానాల ద్వారా కేసును నడిపించటం అంటూ విసృ్తతంగా ప్రచారం చేశారు. వారి ప్రచారాలను బలపరుస్తూ తాము మరి కొన్ని ఛార్జిషీట్లను దాఖలు చేస్తామని సీబీఐ ఆ తరవాత న్యాయస్థానానికి నివేదించింది. అంటే ఎవరి వెనక ఎవరు నడుస్తున్నట్టు? ఎవరి ఆదేశాలు ఎవరు అమలు చేస్తున్నట్టు?

‘తదుపరి నాటకానికి’ తెరలేస్తోందా?

మరోవంక ఈ సంయుక్త నాటకంలో భాగంగానే పత్రికల్లో మరోసారి వైఎస్ కుటుంబాన్ని, పరిచయస్తుల్ని లక్ష్యంగా చేసుకుని.... ‘తదుపరి’ అంకానికి తెరతీసేలా తెలుగుదేశం పార్టీ, ఈనాడు, తోక పత్రిక ఎవరి కుటిల పాత్రను వారు పోషిస్తూ ప్రచురణలు, ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ తంటా అంతా ఎందుకంటే, జనంలో తెలుగుదేశం పార్టీ ప్రభ పైకి లేచే పరిస్థితి లేదు. దాన్ని అంటిపెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయటానికి ‘చేయి’స్తున్న కాంగ్రెస్... చంద్రబాబు నుంచి ఆర్థిక అరాచక విధానాలతోపాటు అనతికాలంలోనే ప్రజలకు దూరం కావటం ఎలా అనే విద్యను ఒంటినిండా పట్టించుకుని ఎన్నికల్లో రెండు-మూడు స్థానాల కోసం రాజకీయ వ్యూహాలు రచించుకునే స్థితికి దిగజారింది. కాబట్టే ఈ రోజున తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల మీడియా వ్యూహం ఏమిటంటే, తాము ప్రజలకు ఈ మంచి చేస్తామని చెప్పటం కాదు. రోజంతా అడ్డదిడ్డమైన విమర్శలతో జగన్ నామ స్మరణ!

ఎవరి ప్రయోజనాలు?

రాష్ట్రంలో ఏ పల్లెలో చూసినా కరెంటు లేదు. నీళ్ళు లేవు. పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం లేదు. పరిశ్రమ నడిచే పరిస్థితి లేదు. దుకాణాల్లో వ్యాపారం లేదు. ఉద్యోగాల ఆశ లేదు. ఉపాధికి హామీ లేదు. ఉత్పత్తుల్లో కోత. ధరల వాత. ఆర్థిక కార్యకలాపం ఆగిపోయింది. ప్రజల చేతుల్లో పైసలు లేవు. ఇలాంటి దారుణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను భారీగా పెంచేసింది. ఫ్యూయల్ ఎడ్జెస్ట్‌మెంట్ ఛార్జీలంటూ గడచిన రెండేళ్ళుగా వాడుకున్న యూనిట్లమీద కూడా డబ్బులు కక్కండంటూ జనంమీద దాడికి దిగింది. ఈ ఎండాకాలం నీరు అందుతుందో లేదో ముందుగా ఆలోచన చేయని రాజకీయ నాయకత్వం... బీరుకు ఈ ఏడాది ఏర్పడనున్న డిమాండును లెక్కగట్టటంలో తల మునకలై రాష్ట్ర చరిత్రలోనే ఏనాడూ లేనంత భారీగా లిక్కరుకు లెసైన్సులు జారీ చేసుకుంటూ పోయింది. కృష్ణా జిల్లాలో లిక్కరు మరణాలు సంభవించాయంటే, అయ్యో లిక్కరు సరిగ్గా అందక జనం అల్లాడుతున్నారని అర్థం చేసుకుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది? ప్రజల పక్షాన నిలబడాల్సిన పత్రికల్లో కొన్నింటిని తెరిస్తే నిత్యం ఏం కనిపిస్తోంది? పచ్చగా... పచ్చిగా అధికార కాంక్ష! పరోక్షంగానో ప్రత్యక్షంగానో అధికార పరిష్వంగం లేక ఎనిమిదేళ్ళుగా దహించుకుపోతున్న వారి శరీరాలు ప్రజల మెదళ్ళతో ఆడుతున్న చెలగాటం! 

చట్టం గిట్టం జాన్తానై!

సీబీఐ అన్నది నిబంధనలు, చట్టాల ప్రాతిపదికన పనిచేయాల్సిన సంస్థ. మీడియాలో తప్పుడు కథనాలు వచ్చిన వెంటనే వాటిని ఖండించాలని సీబీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఈ ఎనిమిదిన్నర నెలలుగా 26 జీవోల కేసులో విచారణకు సంబంధించి సీబీఐనుంచి ఖండనలు రాలేదు సరికదా... ఆ సంస్థలోని వ్యక్తులే మీడియాలోని సాక్షి వ్యతిరేక పత్రికలకు, తెలుగుదేశం అనుకూల వ్యక్తులకు సరంజామా సమకూరుస్తున్నారన్నది ఇప్పటివరకు నోటి మాటగా రూఢి అవుతున్న నిజం. ఇప్పుడు ఈనాడు, ఇక మొహమాటాలేమిటన్నట్టు సీబీఐ ఏం దర్యాప్తుచేస్తోందన్నది కూడా వారు న్యాయస్థానానికి సమర్పించటానికి ముందే వెల్లడిస్తోంది. సీబీఐ వ్యవహారాన్ని విచారణ అనిగానీ, ఈనాడు వ్యవహారాన్ని ప్రచురణ అనిగానీ ఎవరూ అపోహపడకుండా దొందూ దొందుగానే వ్యవహారం నడుస్తోంది. సీబీఐ దాఖలు చేయబోయే అంశాలు మరెన్నో ఇకమీదటా ఇలా సాక్షి-జగన్ వ్యతిరేక మీడియా ద్వారా దుష్ర్పచారంలోకి వస్తాయన్నది మాత్రమే రూఢి అవుతోంది. ఈ మొత్తాన్ని ఉపయోగించుకుని మరేదో కుట్రకు బాటలు పరుస్తున్నారన్న అభిప్రాయమూ బలపడుతోంది.

రావణ గీత!

ఫలానా ఇన్వెస్టర్ ఫలానా సంస్థల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలన్నది రామోజీ గీసే రావణ గీత! ఏ పెట్టుబడిదారు అయినా, వారెంతటి ఘన విజయాలు సాధించినవారైనా... తనకు గిట్టని సంస్థలో పెట్టుబడి పెడితే ఆయన పత్రికా భుజంగం ద్వారా బుసలు కొట్టి కాటు వేయాలనుకుంటారు. వ్యాన్‌పిక్ అంటున్న సంస్థలో స్థానికంగా ప్రధాన భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ఈ రాష్ట్రం గర్వించదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన సంస్థల్లోనే దేవేందర్ గౌడ్ పెట్టిన పెట్టుబడి అక్షరాలా రూ.30 కోట్లయితే, వెనక్కు తీసుకున్నది దాదాపు రూ.500 కోట్లు. ఈ విషయం ఈనాడులో ఏనాడూ సింగిల్ కాలమ్ ఐటమ్‌గా కూడా ప్రచురించినది లేదు. అలాగే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ళలోనే దేశ చరిత్రలోనే తొలిసారిగా కాకినాడ పోర్టు ప్రవేటు పరం అయింది. 

కాకినాడ పోర్టును ప్రైవేటీకరించటానికి ముందే చంద్రబాబు ప్రభుత్వం ఆసియన్ డెవలప్‌మెంటు బ్యాంకునుంచి రూ.400 కోట్లు రుణంగా తీసుకుని ఆ పోర్టు ఆధునికీకరణకు ఖర్చు చేసింది. దీన్ని తమ ఎల్ అండ్ టీ, మలేసియా నాటి ప్రధాని- అక్కడ చంద్రబాబు స్నేహితుడు అయిన మహతీర్ మహ్మద్ తనయుడు మిర్జాన్ మహ్మద్ సంస్థకు ఏడీబీ డబ్బుతో ముస్తాబు చేసి మరీ కట్టబెట్టేశారు. ఆ ఏడీబీ రుణాన్ని తీర్చుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు. పైసా ఖర్చు లేకుండా కాకినాడ పోర్టును జేబులో వేసుకుని చంద్రబాబు రుణాన్ని ఎవరు ఎలా తీర్చుకున్నారన్నది ఏ న్యాయస్థానమో సరైన దర్యాప్తునకు ఆదేశిస్తే తప్ప వెల్లడి కాని అంశం. 

వాన్‌పిక్‌పై దొంగాట...

ఇక్కడే ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, రాష్ట్రంలోని పోర్టులన్నింటిమీదా చంద్రబాబు కన్ను 1995లో అధికారాన్ని కబ్జా చేసిన నాటినుంచి పడింది. విజన్ 2020 అంటూ తెలుగు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఓ భయానక పత్రాన్ని రూపొందించటానికి ముందే, చంద్రబాబు ఇప్పుడు వాన్‌పిక్ అంటున్న ప్రాంతంలో రేవును ప్రైవేటుకు అప్పగించటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాకినాడ పోర్టును తన వారికి కట్టబెడుతున్న సమయంలోనే వాడరేవును ఇండియన్ బెరైటీస్ అండ్ కెమికల్స్ చేతిలో ఉంచేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. తాను విదేశాల్లో తిరుగుతున్నప్పుడు 970 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్రతీరాన్ని అణువణువూ వాణిజ్యం చేయవచ్చన్న అభిప్రాయం మొలకెత్తిన విషయాన్ని అప్పట్లో ఆయనే వెల్లడించారు. 

ఇదంతా మనసులో మూటకు సంబంధించిందే అన్న అనుమానాలను బలపరుస్తూ ఈ అంశాలన్నింటినీ తన ఆత్మ-కథతో పోల్చదగిన మనసులో మాటలో రాశారు. రాష్ట్రంలో పోర్టుల్ని ప్రైవేటుకు అప్పగించాలని విజన్ 2020లో రాశారు. రాయటమే కాకుండా గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని ప్రైవేటు పరం చేశారు. ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే దీన్నంతా తన లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ విధానంలో భాగంగా ప్రకటించారు. అదే రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంగా అప్పట్లో ఈనాడు లాంటి పత్రికలు, కొందరు పాత్రికేయుల సహకారంతో చలామణి చేయించారు. చంద్రబాబు రాష్ట్రంలో పోర్టుల్ని తనవారికే కట్టబెట్టినా, పాలేరు సుగర్ సంస్థను కట్టబెట్టటానికి నెల రోజుల ముందే నామా నాగేశ్వరరావుతో ఓ సంస్థను రిజిస్టర్ చేయించినా, మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పప్పుబెల్లాల్లా అమ్మేసి... దేశం మొత్తంమీద రాష్ట్రాలన్నీ ఈ మూత, అమ్మివేతల్లో ప్రజలకు చెందిన ఎన్ని కంపెనీలను అమ్మేశాయో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కంపెనీలు అమ్మేశామని ఏకంగా బ్రోచర్లు ప్రింటు చేసినా అవన్నీ నీతిమంతుడైన చంద్రబాబు చేస్తున్న ఘనకార్యాలని పొగడిన చరిత్ర ఈనాడు అండ్‌కోది. 

ఇంతాచేసి చంద్రబాబు వాడరేవును ప్రైవేటు పరం చేయటానికి నానా పాట్లూ పడ్డా అవేవీ విజయవంతం కాలేదు. ఎందుకంటే, ఆ ప్రాంతంలో పోర్టు నిర్మాణం వల్ల మేలు జరుగుతుందన్నది నిజమే అయినా, అనువుగాని సముద్ర ప్రాంతం కావటం వల్ల పోర్టు నిర్మాణమన్నది అత్యంత భారీ వ్యయంతో కూడిన వ్యవహారం. అందుకే బాబు హయాంలో కంపెనీలన్నీ తోక ముడిచాయి. ప్రకాశం-గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ఆ ప్రాంతంలో గడచిన 56 ఏళ్ళలో ఏ ఒక్క భారీ పరిశ్రమా వచ్చినది లేదు. వాన్‌పిక్ అన్నది కూడా వైఎస్ తొలి యత్నాల్లోనే సాధించిన విజయం కాదు. ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు వస్తే తప్ప అటు పారిశ్రామికుడికి... ఇటు ప్రజలకు ప్రయోజనం ఉండదన్న అభిప్రాయంతోనే వైఎస్ ప్రభుత్వం వాన్‌పిక్‌కు అనుమతించింది. ఆ ప్రాజెక్టు చేపట్టక ముందు అదే ప్రాంతంలో భూముల విలువ ఎంతుంది? అక్కడ ఏం పండేది? వంటి విషయాలను స్థానికులను అడిగినా నిజాలు తెలుస్తాయి. 

ప్రభుత్వం వాన్‌పిక్‌కు 40 వేల ఎకరాలిచ్చిందని... 30 వేల ఎకరాలిచ్చిందని ఈనాడు చేసినది తన మార్కు తప్పుడు ప్రచారం మాత్రమే. అక్కడ భారీ పోర్టు, పారిశ్రామిక సముదాయాల కోసం ప్రభుత్వం ఇస్తానన్న భూమి 2,000 ఎకరాలు మాత్రమే. దాన్నీ ఈ రోజు వరకు ప్రభుత్వం అప్పగించినది లేదు. ఇక్కడే ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రైవేటుకు అప్పగించిన గంగవరం పోర్టు కోసం ప్రభుత్వమే భూములు సేకరించి ఇచ్చింది. అందుకు భిన్నంగా వాన్‌పిక్ విషయంలో ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం భూ సేకరణ కోసం సంస్థకు అనుమతి మాత్రమే ఇచ్చింది.

వాన్‌పిక్‌కు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్‌లో ప్రస్తావించలేదు కాబట్టి, సీబీఐకో మరెవరికో దుర్మార్గదర్శనం చేద్దామనే తాపత్రయంతో నిన్న ఈనాడు ప్రచురించిన కథనంలో వాన్‌పిక్ ఒప్పందాలు అడ్డగోలేనని తీర్మానించింది. ఆ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇలాంటి అడ్డమైన రాతలూ రాయకపోయి ఉంటే ఈ రోజున ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేలాదిమందికి ఉపాధి-ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవి. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ అన్నది ఎంవోయూ అభిప్రాయం అయితే తరవాత దీన్నుంచి పారిశ్రామిక వాడను మినహాయించి, కేవలం ఓడరేవును ఒప్పందంలో చేర్చారన్నది ఓ సంస్థ అభిప్రాయం. వాన్‌పిక్ ప్రాజెక్టు అమలు ప్రారంభమైనా కాలేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఓ సాధింపు నివేదిక ఇవ్వండన్నట్టు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనకు నచ్చిన సంస్థకు ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే ఇంతకు మించిన నివేదికలు ఎవరు మాత్రం ఆశించగలరు? ప్రపంచంలో ఎక్కడైనా పారిశ్రామిక వాడను బీవోటీ పద్ధతిలో నిర్మించారా? అది సాధ్యమేనా? ఎంవోయూలో అంశాలే అంతిమం అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కుదిరిన షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు చెప్పినది ఒకటి. 

ఆ తరవాత సంస్థలు, ఇంధనం, యాజమాన్యం, వాటితో కుదుర్చుకున్న రేటు... అన్నీ మారిపోయాయి. ఏ కొంచం డీవియేషన్ అయినా నేరం అనుకుంటే చంద్రబాబు నాయుడు నేరానికి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? విచిత్రంగా ఆ సంస్థలు ఎంవీఎస్ మూర్తి లాంటి చంద్రబాబు సన్నిహితుల పంట పండిస్తూ అనతికాలంలోనే వారికి ఎలా దక్కాయి? మొన్నీమధ్య కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నానని చెపుతోంది. ఆ ఒప్పందాలన్నీ కిరణ్ సర్కారు చూసే సంతకం పెట్టిందా? ఆ ప్రకారమే తరవాత ప్రాజెక్టులు అమలు అవుతాయా? ఎంవోయూల్లో తప్పులు దొర్లితే ఒప్పందాల్లో సరిచేసుకోరా? కన్సెషనల్ ఎగ్రిమెంట్లు చంద్రబాబు హయాంలో ఎలా కుదిరేవి? ఈ అంశాలన్నీ అడ్డమైన రాతలూ రాసేటప్పుడు ఈనాడుకు గుర్తుకురావా? 

అదేం నివేదిక? 

ఇప్పుడు వాన్‌పిక్‌కు సంబంధించిన నివేదికలో ‘స్వతంత్ర సంస్థ’ ప్రదర్శించిన పరిజ్ఞానాన్ని చూసి ఐఏఎస్‌లు తల పట్టుకుంటున్నారని సమాచారం. ‘‘అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ఓడరేవుల సరిహద్దు 12 నాటికల్ మైళ్ళను దాటి ఉంది’’ అన్న వాక్యాలు ఈనాడు స్థాయికి ఎలాగూ అర్థం కావుగానీ, అలాంటి సంస్థతో వాన్‌పిక్‌ను తనిఖీ చేయించారంటేనే ఆ నివేదిక ఎంతటి అక్కసుతో నిర్వహించినదీ అర్థమవుతుంది. ఒడ్డునుంచి సముద్ర జలాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. వాన్‌పిక్‌కు నాటికల్ మైళ్ళపొడవుమీద అధికారం ఏమిటి? ఇవన్నీ చూస్తే రూఢి అయ్యేది రామోజీకి షిప్‌మేకింగ్ తెలియదు. ఆయనకు ఒకప్పుడు ఓ షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉండేదట. ఇప్పుడు ఆయనకున్నది తన స్వార్థం కోసం మొత్తంగా సమాజ ప్రయోజనాలనే ముక్కలు చేసే యూనిట్ మాత్రమే.

ఈ రోజున ప్రజలందరికీ నాయకులు, పత్రికలకు సంబంధించి సంపూర్ణంగా స్పష్టత ఉంది. సమస్య ఈనాడు, తోక పత్రిక, చంద్రబాబుల మెదడులో ఉంది. ఆ ఎల్లో వైరస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా పాకింది. 

భూములు మింగే రామోజీకి చారిటీ అంటే అలుసా...

ఈ నెల 2న ఈనాడు మొదటి పేజీలో అచ్చోసిన ‘‘అనాథల పేరుతో అల్లుడి దోపిడీ రూ.60 కోట్లు’’ అనే వార్తనే చూడండి. ఈ వార్త చూడగానే కనిపించేది రామోజీ రావుకు వైఎస్ కుటుంబంమీద ఉన్న ఉక్రోషం, ఆక్రోశం. ఈ ఒళ్ళు తెలియని పిచ్చి కోపంతో రాతలు రాయటం వల్ల అసలు ఆ ఛారిటీలో బ్రదర్ అనిల్‌కు ఎలాంటి పాత్రా లేదన్న నిజాన్నే చూడలేకపోయారు. అదీగాక, ఏ తుపానో రాగానే ప్రజల డబ్బు పోగు చేసి తప్ప పిల్లికి కూడా బిచ్చం పెట్టే దాతృత్వంగానీ, ఓ అనాథను అక్కున చేర్చుకుని పెంచి పోషించే మానవత్వంగానీ ఏనాడూ కనబరచని రామోజీకి వేరే ఎవరైనా చారిటీ పెట్టుకుంటే ఇలాగే ఒళ్ళు మండుతుంది. అన్నింటికీ మించి, ఆయన గురించి జనానికి తెలిసినా నమ్మలేని నిజం ఏమిటంటే... ప్రచ్ఛన్న అధికారంతో వేలకోట్ల రూపాయలను కొండల్లా పేర్చుకుని కోటలు కట్టుకున్న రామోజీ కమ్యూనిస్టట! అందరికీ తెలిసిన నిజం రామోజీ నాస్తికుడన్నది. ఇలాంటి రామోజీ ఓ మతపరమైన చారిటీకి ప్రభుత్వం కేవలం భూమిని కేటాయిస్తే అడ్డదిడ్డంగా కథనాలు వండి వార్చారు. 

అక్కడ భూమి రేటును తన ఇష్టం వచ్చినట్టు లెక్కగట్టారు. తాను విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో నడిబొడ్డున లీజుకు తీసుకుని ‘ఈనాడు’ కార్యాలయాలు నిర్మించుకుని స్థలం యజమానులకు చెల్లిస్తున్న సొమ్ము ముష్టి మాదిరి ఉందన్న నిజాన్ని కూడా మరిచిపోయి అనాధాశ్రమానికి, వృద్ధాశ్రమానికి ఇచ్చిన భూమికి కేవలం నలభై వేల రెంటా అంటూ తెగ ఆశ్చర్యపడిపోయారు. కొస మెరుపు కాకపోయినా ఇటీవల రామోజీ భూ భాగోతంలో మెరిసిన మరో మెరుపు ఏమిటంటే, ఈ భూమోజీ ఏకంగా హైదరాబాద్‌లో ఫిలిం సిటీ పేరిట ఆక్రమించిన ప్రభుత్వ భూములు 60 ఎకరాలని ప్రభుత్వం లెక్కగట్టింది. పాల్మాకులలో మరో అయిదు ఎకరాలను కబ్జా చేశారనీ ఇటీవలే ప్రభుత్వం నిగ్గు తేల్చింది. ఆయన లాక్కున్న అసైన్డ్ భూములు 11 ఎకరాలని ఆరోపణలున్నాయి. రాష్ట్ర రాజధానిలో ఆయన ల్యాండ్ బ్యాంకులో ఉన్నది ఏకంగా 2000 ఎకరాలకు పైన! అంటే భూ గరిష్ట పరిమితి చట్టాలన్నీ సామాన్యులకు వర్తించాలని పత్రికలో నిత్యం ఎడాపెడా వార్తలు రాసే రామోజీ కోసం ప్రత్యేక చట్టాలేవైనా తయారయ్యాయా? భూముల దందాల రామోజీ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రాశారా? అరాచకం ఏమిటంటే... ఇలాంటి మనిషి తన పత్రికలో రోజూ గిట్టని వారి గురించి పతాక శీర్షికల్లో వ్యతిరేకంగా వార్తలు రాయటం. సీబీఐకి మార్గదర్శకత్వం చేయటం!

సీబీఐ ఎవరికి రిపోర్టు చేస్తోంది?

ఏ సంస్థలో ఎవరు పెట్టుబడులు పెట్టారో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన పత్రాల్లో వెల్లడి అవుతూనే ఉంటుంది. సునీల్‌రెడ్డికి సంబంధించిన సంస్థలోనైనా మరెవరి సంస్థలోనైనా ఎవరెవరు ఎంత పెట్టుబడులు పెట్టారన్నది తెలుసుకోవాలనుకుంటే దానికి చట్టబద్ధమైన ఏర్పాటు పౌరులందరికీ అందుబాటులో ఉంది. ఎమ్మార్ కుంభకోణంలో నిధులు వైఎస్ చనిపోయిన తరవాత సునీల్ రెడ్డి సంస్థలోకి వచ్చాయని ‘ఈనాడు’కు సీబీఐ చెప్పిందట! ఇది- మొన్నటి పతాక శీర్షికలో ‘ఈనాడు’ కథనం. సాక్షిలో పెట్టుబడులు పెట్టినవారు సునీల్ సంస్థలో పెట్టుబడి పెట్టారట. ఈ సంస్థల డెరైక్టర్ల కోసం సీబీఐ వెతికినప్పుడు అవి బోగస్ అని తేలిందట. ఈ కథనమే నిజమనుకుంటే... మొట్టమొదట ఎవరికైనా వచ్చే అనుమానం ఏమిటంటే, అంతెత్తున ఘనత వహించిన సీబీఐ... ఈ విషయాన్ని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి తరవాత నివేదించవచ్చులే అని, అంతకు ముందుగానే రామోజీకి ఎందుకు నివేదించిందన్నది! రెండోది- సాక్షిలో పెట్టుబడులు క్విడ్ ప్రోకో అన్నది నిజమే అయితే, వారు నేరుగా ఆ డబ్బును కూడా సాక్షిలోనే పెట్టుబడి పెట్టవచ్చుకదా? మరి సునీల్‌రెడ్డి కంపెనీలో ఎందుకు పెట్టినట్టు? అది కూడా వైఎస్ మరణించిన తరవాత! అప్పటికి ఏ ఎంక్వైరీలూ లేవే?
Share this article :

0 comments: