సీబీఐ లీక్ చేసిందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ లీక్ చేసిందా?

సీబీఐ లీక్ చేసిందా?

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్ లీక్ కావడం వెనక కుట్ర ఉందా? చార్జిషీట్‌లో ఉన్న అంశాలను ఒక వర్గం పత్రికలకు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసిందా? ఎల్లోమీడియా వార్తలు చూస్తే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఇటువంటి వార్తలను సీబీఐ ఖండించక పోవడమూ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఈ కేసు విచారణ తొలినాటి నుంచి సీబీఐ ఉద్దేశపూర్వకంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందనే వాదనలకు ఊతమిస్తోంది. ఈ కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు తమకు చార్జిషీట్ ప్రతి కావాలని కోరితే.. మెమో దాఖలు చేస్తే ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. 

దీంతో అది అత్యంత గోప్యంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఉదయానికల్లా.. చార్జిషీటులో ఉన్నాయంటూ కొన్ని అంశాలు ఎల్లోమీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిని సీబీఐ ఖండించకపోవడాన్ని బట్టి దర్యాప్తు సంస్థ కావాలనే ఎల్లోమీడియాకు లీక్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. చార్జిషీట్ దాఖలు చేసిన రోజే.. జగన్ కేసులో తొలి చార్జిషీట్‌ను కోర్టు తమకు ఇచ్చిందని, రెండో చార్జిషీట్‌ను కూడా ఇవ్వాలని ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తమ వాదనలు కొనసాగించడానికి చార్జిషీట్‌లో పేర్కొన్న వివరాలు అవసరమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే చార్జిషీట్ ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించింది. సాంకేతిక అంశాల ఆధారంగా చార్జిషీట్‌ను తిరస్కరించే అవకాశమూ ఉందని, క్షుణ్ణంగా పరిశీలించాక ఇస్తామంది. ఈ విధంగా చార్జిషీట్‌ను సాయిరెడ్డి తరఫు న్యాయవాదికి ఇవ్వడానికి కూడా కోర్టు తిరస్కరించగా... అందులోని వివరాలు ఎల్లో మీడియాకు అందడం గమనార్హం. చార్జిషీట్‌ను ఇవ్వడానికి కోర్టు నిరాకరించినప్పుడు, అందులోని విషయాలను గోప్యంగా ఉంచాలన్న కనీస బాధ్యతను కూడా సీబీఐ విస్మరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ చార్జిషీట్‌లో ఏముందనేది ఒక్క సీబీఐ అధికారులకు తప్ప బాహ్య ప్రపంచానికి ఏమాత్రం తెలిసే అవకాశం లేదని, ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే సీబీఐ అధికారులే చార్జిషీట్ ప్రతులను వారికిచ్చారనేది స్పష్టమవుతోందని న్యాయ నిపుణులంటున్నారు.
Share this article :

0 comments: