విత్తనాల సేకరణ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విత్తనాల సేకరణ లేదు

విత్తనాల సేకరణ లేదు

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012


సేకరణ ధరలూ ఖరారు కాలేదు
రైతులతో 30 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను పండించి.. ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు
కొనుగోలుపై మీనమేషాలు..
చేసేది లేక మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకుంటున్న రైతులు
వచ్చే ఖరీఫ్‌కు విత్తనాల కొరత ఏర్పడే ప్రమాదం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సర్కారు నిర్లక్ష్యం కారణంగా వచ్చే ఖరీఫ్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఇప్పటికీ విత్తనాలను నిల్వ చేయలేదు సరికదా... సేకరణ ధరలను కూడా ఖరారు చేయలేదు. 2011-12 ఖరీఫ్, రబీల్లో ప్రభుత్వం విత్తన గ్రామం, ఇతర పథకాల కింద రూ.60 కోట్లు ఖర్చు చేసి 30.71 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను రైతుల ద్వారా ఉత్పత్తి చేయించింది. వరి మినహా అన్ని పంటల కోతలు నెల క్రితమే పూర్తయ్యాయి. అయితే రైతుల నుంచి ఇప్పటికి ఒక్క క్వింటాల్ ధ్రువీకృత విత్తనాలను కూడా సేకరించలేదు. వ్యవసాయ శాఖ తీరుతో విసిగిపోయిన విత్తన రైతులు నాణ్యమైన విత్తనాలను సాధారణ పంట కింద బహిరంగ మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మరోవైపు వచ్చే ఖరీఫ్‌లో రూ.160 కోట్ల సబ్సిడీతో 10.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. విత్తనాలన్నీ మార్కెట్‌లోకి వెళ్లిపోతుండడంతో వ్యవసాయ శాఖ వచ్చే ఏడాది రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ విత్తనాల విషయంలో వ్యవసాయ శాఖ తీరు రైతులను నష్టపరిచేలా ఉంది. వర్షాభావం, అధిక వర్షాలకు తట్టుకునే టీఎంవీ 2 విత్తనాలను సబ్సిడీ పథకంలో సరఫరా చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రైతులతో టీఎంవీ 2 విత్తనాలను ఉత్పత్తి చేయించిన ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు వీటిని సేకరించేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌లో రైతులకు తాము కోరుకున్న వేరుశనగ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు.

ఖరారు కాని సేకరణ ధరలు...

వరి, వేరుశనగ, శనగ వంటి ముఖ్యమైన పది పంటలకు చెందిన మూల (ఫౌండేషన్) విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్), జాతీయ విత్తన సంస్థ (ఎన్‌ఎస్‌సీ), నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్)లు రైతులకు ఇచ్చి ధ్రువీకృత(సర్టిఫైడ్) విత్తనాలను ఉత్పత్తి చేయిస్తున్నాయి. ఇలా ఉత్పత్తి అయిన ధ్రువీకృత విత్తనాలను సాధారణ పంటకు మార్కెట్‌లో లభించే ధర కన్నా ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ సంస్థలు సేకరించాలి. అనంతరం సబ్సిడీ విత్తనాల పథకం కింద వ్యవసాయ శాఖ రైతులకు పంపిణీ చేయాలి. దీని వల్ల పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. విత్తన గ్రామ పథకం కింద ప్రస్తుత రబీలో వ్యవసాయ శాఖ ఒక్క అనంతపురం జిల్లాలో 13 వేల క్వింటాళ్ల మూల(ఫౌండేషన్) వేరుశనగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇచ్చి సాగు చేయించింది. 1.30 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత (సర్టిఫైడ్) విత్తనాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే ఫిబ్రవరిలోనే పంట కోతలు పూర్తయినా వ్యవసాయ శాఖగానీ ఏపీ సీడ్స్‌గానీ ఇప్పటికీ రైతుల నుంచి విత్తనకాయలను సేకరించలేదు. సేకరణ ధరలే ఖరారు చేయలేదు. వేరుశనగకాయలు బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాల్ రూ.5,300 పలుకుతోంది. విత్తనకాయల ధర దీనికంటే ఎక్కువ ఉండాలి. కానీ రవాణా, రిజిస్ట్రేషన్ ఖర్చులు మినహాయిస్తే రైతులకు క్వింటాల్‌కు రూ.4,600 మాత్రమే వచ్చేలా వ్యవసాయ శాఖ వ్యవహరిస్తోంది. శనగ విత్తనాలు పండించిన కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. రైతులు విధిలేని పరిస్థితుల్లో విత్తన పంటలను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు.

‘విత్తన గ్రామం’ అంటే..?

రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సాగుచేసే పంటల సరళి ఆధారంగా నూతన వంగడాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడం, అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన ధ్రువీకృత విత్తనాలను రైతులకు తక్కువ ధరలోనే సరఫరా చేయడం కోసం వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘విత్తన గ్రామం’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద వ్యవసాయ వర్సిటీ వంటి గుర్తింపు కలిగిన పరిశోధన సంస్థల నుంచి వ్యవసాయ శాఖ మూల విత్తనాలను సేకరిస్తుంది. వాటిని ఎంపిక చేసిన రైతులకు 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఒకచోట కనిష్టంగా 25 ఎకరాల్లో ఒకే రకమైన పంటలను సాగు చేసేలా 50 మంది రైతులను ఎంపిక చేస్తారు. ఇలా మూల విత్తనాల సాగుతో ఉత్పత్తి అయిన ధ్రువీకృత విత్తనాలను నాణ్యత పరీక్షలు పూర్తి చేసి ఆయా జిల్లాల్లోని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తారు. వరి, కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు, ఆముదం, గోగు, జొన్న, చెరకు విత్తనాలను ఇలా ఉత్పత్తి చేస్తున్నారు.

Share this article :

0 comments: