‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు

‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు

Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012

వర్షాకాలంలో ఒక్కోరోజు కుండపోతగా వర్షం కురిసి, వాగూవంకా వెల్లువెత్తడం సహజమే. అన్ని రుతువుల్లో అభిమాన వర్షం కురిపించగల ‘మమతల మంత్రవిద్య’ మాత్రం గోదారి గడ్డ సొంతం. తన మేలు కోరే వారిని, తన కోసం పోరే వారిని వాత్సల్యపు వెల్లువలో తడిసి ముద్ద చేయడం ఈ ప్రాంతపు రివాజు. రామచంద్రపురం ఉప ఎన్నికలో ప్రచారం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఈ సీమ మమకారం వరదలెత్తుతోంది. గతంలో మహానేత వైఎస్ చవిచూసిన అవ్యాజానురాగాల్నే తానూ ఆస్వాదిస్తూ, పులకరిస్తూ, ప్రతిచోటా తన కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్న వేలమందిని ప్రేమతో పలకరిస్తూ, ‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. 
రామచంద్రపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి : ఊరూరా, వాడవాడలా జనం పంచే ఆత్మీయత, అనురాగాలను చవి చూస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామచంద్రపురంలో రెండో రోజు శుక్రవారం పర్యటించారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయనను చూసేందుకు, ఆయన పలుకులు వినేందుకు మహిళలు, యువత కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు. వెల కట్టలేని ఆ అభిమానానికి జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. షెడ్యూల్‌లో తీవ్రజాప్యం జరుగుతున్నా లక్ష్యపెట్టకుండా వారితో మాట్లాడిన తరువాతే ముందుకు కదిలారు. ఈ కారణంగా పర్యటన అనుకున్న దాని కన్నా నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. గంగవరం శివాలయంలో పూజల్లో పాల్గొన్న జగన్ గుడ్ ఫ్రైడే సందర్భంగా కుందూరులోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

మనసుంటే క్షణాల్లోనే ‘మార్గం’...
జగన్ పర్యటనకు ఆటంకం కల్పించాలనుకున్న అధికార పార్టీ పెద్దల కుట్రలను దంగేరు ప్రజలు తిప్పికొట్టారు. దంగేరు-శివల మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డుపై గొయ్యిని తవ్వడంతో దంగేరు వెళ్లేందుకు దారి లేకపోయింది. ఎలాగైనా జగన్‌ను తమ గ్రామంలోకి తీసుకురావాలనుకున్న జనం అప్పటికప్పుడు మట్టితో గోతిని పూడ్చారు. అయితే అధికారపక్షం నేతలు అధికారులను పంపి ఆ పూడికను తొలగింపజేశారు. అయినా పట్టువీడని జనం... పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లు చేసి జగన్‌ను తమ గ్రామానికి తీసుకు వెళ్లగలిగారు. దంగేరు శివారు శెట్టిబలిజపేట దుర్గమ్మగుడి వద్ద వాసంశెట్టి వెంకటరమణ తదితరులు రోడ్డుకు అడ్డం పడి జగన్‌ను మాట్లాడాకనే ముందుకు వెళ్లనిచ్చారు.

తాళ్లపోడు వద్ద ప్రచారరథంపై నుంచి మాట్లాడేందుకు సిద్ధమవుతున్న జగన్‌ను దగ్గర నుంచి చూడాలని ఆత్రుతతో మహిళలు ఆయన కిందికి దిగిరావాలని పట్టుబట్టారు. ‘మీ మాటల కంటే మిమ్మల్ని చూడాలనే ఇంతసేపు ఇక్కడ ఉన్నాం’ అంటూ పదేపదే విజ్ఞప్తి చేయడంతో జగన్ ప్రచారరథం దిగివచ్చారు. మసకపల్లిలో వైఎస్ అభిమానులు తలో కొంత చందాలు వేసుకుని వైఎస్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆయనకు ఎస్సీ, బీసీల్లో ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ప్రతి పల్లెలో మహిళలు, వృద్ధులు జగన్ రాక కోసం, ఆయనతో చేయి కలిపేందుకు తహతహలాడడం కనిపించింది. జగన్ కూడా పర్యటన ఆద్యంతం విసుగూ విరామం లేకుండా వారితో చేయి కలుపుతూ ముందుకు సాగారు. 

ఎల్లలు లేని జనాభిమానం...
అమెరికాలో స్థిరపడ్డ పిల్లంకకు చెందిన సాగి సుదర్శనరాజు సెలవు పెట్టి మరీ మసకపల్లిలో జగన్‌ను కలిసేందుకు రావడం ఆయనపై జనాభిమానానికి ఎల్లలు లేవని స్పష్టం చేస్తోంది. ఉదయం 10 గంటలకు కె.గంగవరంలో ప్రారంభమైన పర్యటన అడుగడుగునా జాప్యం కావడంతో మసకపల్లిలో మహానేత వైఎస్ నిలువెత్తు విగ్రహావిష్కరణ సభతో రాత్రి 8.30 గంటలకు ముగించాల్సి వచ్చింది. కె.గంగవరంలో ప్రారంభమైన పర్యటన కూనుమిల్లిపాడు, ఎర్రపోతవరం, బాలాంత్రం, మసకపల్లిల వరకు సాగింది. కూనుమిల్లిపాడు, ఎర్రపోతవరం, బాలాంత్రంలలో వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. తొలుత గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని వివిధ ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, జగన్ వారితో ఫొటోలు తీయించుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పాతకోట గ్రామానికి చెందిన ఆనందరావు, సుశీల దంపతుల చిన్నారికి ‘విజయమ్మ’గా జగన్ నామకరణం చేయడంతో వారు మురిసిపోయారు. 

త్వరలో జరగనున్న రామచంద్రపురం ఉప ఎన్నికల్లో విలువల కోసం పదవిని వదులుకున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు మద్దతు కోరుతూ పర్యటన సాగినా, ఓటు హక్కులేని విజయనగరం వలసకూలీలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించడం జగన్ కేవలం ఓట్ల కోసం రాలేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్టయ్యింది. జగన్ అదే సందర్భంలో కూలీ పనులు చేసుకునే తల్లులు పిల్లలను చదివిస్తే నెలకు రూ. 500 వంతున అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషా బోధనను కూడా అందుబాటులోకి తీసుకువస్తానని, ఇంజనీరింగ్ వరకు చదివించే బాధ్యతను తీసుకుంటానని భరోసా కల్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న పాలక, ప్రతిపక్షాల కుళ్లు కుతంత్రాలను ఉప ఎన్నికల్లో తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని కోరారు. పర్యటన అనంతరం జగన్ హసన్‌బాద చేరుకుని పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంట బస చేశారు
Share this article :

0 comments: