ప్రజలపై రూ.1,245 కోట్ల భారం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలపై రూ.1,245 కోట్ల భారం!

ప్రజలపై రూ.1,245 కోట్ల భారం!

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012



పెట్రోల్ ధరల పెంపు ఫలితం
మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం
ద్విచక్రవాహనదారులకు షాక్

హైదరాబాద్, న్యూస్‌లైన్: బుధవారం అర్ధరాత్రి నుంచి లీటరు పెట్రోలుపై రూ.8.30 ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలపై ముఖ్యంగా వాహనదారులపై పెనుభారం మోపనుంది. ఏటా రూ.1245 కోట్ల మేర తల బొప్పి కట్టించనుంది. ఇప్పటికే విపరీతంగా ఉన్న పెట్రోల్ ధరతో అల్లాడిపోతున్న వాహనదారులకు కేంద్ర నిర్ణయం శరాఘాతంలా తగిలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని సుమారు 80 లక్షల మంది ద్విచక్ర వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 10.21 లక్షల మోటారు కార్లు ఉండగా ఇందులో రెండు లక్షలకు పైగా పెట్రోలు వినియోగించేవి ఉంటాయని అంచనా.

ఈ పెట్రో కార్ల వాడకందారులకు కూడా పెట్రోలు ధర పెంపు భారంగా పరిణమించనుంది. రాష్ట్రంలో నెలకు సగటున 12.50 కోట్ల లీటర్ల పెట్రోలును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం లీటరుకు రూ. 8.30 ధర పెరిగింది. నెలకు వినియోగిస్తున్న 12.50 కోట్ల లీటర్లకు లెక్కిస్తే ప్రజలపై పడే అదనపు భారం రూ. 103.75 కోట్లకు చేరుతుంది. వార్షికంగా చూస్తే ఇది రూ.1245 కోట్లు కానుంది. అంటే ప్రస్తుతం పెంచిన ధర ప్రభావంతో పెట్రోలు వినియోగదారులు ఏడాదికి రూ.1245 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుందన్న మాట. ద్విచక్రవాహనదారులతో పాటు, చిన్నకార్లను ఉపయోగించే మధ్యతరగతి ప్రజలపై ప్రస్తుత పెంపు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెట్రో ‘మంట’ పట్టని ప్రభుత్వం
రకరకాల సాకులతో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ పోతుంటే.. తద్వారా వచ్చే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాబడిపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోందో తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లే దు. పెట్రోల్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అంతో ఇంతో వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు గుడ్డిలో మెల్లలా కొంతయినా వెసులుబాటు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ఆలోచనే చేయడం లేదు. పెట్రోలు ధరలో 33 శాతం వ్యాట్ ఉండటంతో దీని ధర పెంచినప్పుడల్లా రాష్ట్ర ఖజానాకు భారీగా అదనపు రాబడి వస్తోంది.

కొత్త రేటు ప్రకారం లీటరు ధర రూ. 81.30 కాగా ఇందులో వ్యాట్ రూ. 20.17 కావడం గమనార్హం. అంటే వ్యాట్ లేకపోతే లీటరు పెట్రోలును రూ.61కే విక్రయించవచ్చన్నమాట. డీజిల్ రేటుపై కూడా 22.25 శాతం వ్యాట్ ఉండటంతో.. సర్కారుకు వచ్చే మొత్తం వ్యాట్ ఆదాయంలో 25 శాతానికిపైగా పెట్రో ఉత్పత్తుల ద్వారానే సమకూరుతోంది. పెట్రో ఉత్పత్తుల ద్వారా వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి 2010-11లో లో రూ. 6500 కోట్ల ఆదాయం రాగా 2011- 12లో ఇది ఏకంగా రూ.10 వేల కోట్లకు పెరిగింది. తాజాగా పెరిగిన ధర వల్ల ప్రభుత్వానికి పెట్రోలు ద్వారా ఏటా వ్యాట్ రూపంలో రూ.308.88 కోట్ల అదనపు రాబడి రానుంది.

రాష్ట్రంలోనే వ్యాట్ ఎక్కువ!
అధికాదాయం కారణంగానే ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోలుపై వ్యాట్ అధికంగా ఉన్నా దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇష్టపడటంలేదు. పెట్రోలుపై హర్యానాలో 20.50%, హిమాచల్‌ప్రదేశ్, ఛండీగఢ్‌లో 24%, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 27%, మధ్యప్రదేశ్‌లో 30.04% వ్యాట్ అమలవుతుంటే మన రాష్ట్రం మాత్రం ఏకంగా 33% వసూలు చేస్తోంది. ఈ శాతాన్ని ఎంత మేరకు తగ్గిస్తే ఆ మేరకు ప్రజలకు ఉపశమనం కలిగే వీలున్నా.. ఆదాయంపైనే దృష్టిసారిస్తున్న రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

గత ఏడాది కాలంలో (2010 నవంబరు 8 నుంచి 2011 నవంబరు 8వ తేదీ వరకూ) పెట్రోలు ధరలు ఏకంగా ఆరుసార్లు పెరిగాయి. ఏడాదికాలంలోనే మొత్తం మీద ధర రూ.26 పెరిగింది. ‘పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలు అమ్మకం పన్ను తగ్గిస్తే ప్రజలకు కొంతవరకూ భారం తగ్గుతుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి..’ అంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీనికి స్పందించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, వంటగ్యాస్‌పై వ్యాట్ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించ లేదు.
Share this article :

0 comments: