ఆగిన 18 ‘అభిమాన’ గుండెలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆగిన 18 ‘అభిమాన’ గుండెలు

ఆగిన 18 ‘అభిమాన’ గుండెలు

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012


సీబీఐని అడ్డం పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాజన్న’ బిడ్డ పట్ల అనుసరిస్తున్న కక్షసాధింపు ధోరణిని తట్టుకోలేక ఆ గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. విచారణకంటూ పిలిచి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా ఎక్కడ అరెస్టు చేస్తారో అంటూ.. గత రెండురోజులుగా తీవ్ర ఉత్కంఠతో టీవీలను వీక్షిస్తున్న అభిమానులు ఆందోళనతోనూ, అరెస్టయిన తర్వాత ఆవేదన, ఉద్వేగంతోనూ రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో మొత్తం 18 మంది గుండెపోటుతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, ఖమ్మం, కృష్ణా, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున హఠాన్మరణం చెందారు. కాగా, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, చిత్తూరు జిల్లాల్లో మరో నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రూరల్ మండలం మాధవపట్నంలో దండి పెంటయ్య (65) టీవీలో జగన్‌పై సీబీఐ విచారణ వార్తలు చూస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయి మృతిచెందారు. రౌతులపూడి మండలం ములగపూడిలో అంధురాలు కొయ్యా వినాయకమ్మ (57) గత రెండు రోజులుగా టీవీలో జగన్‌కు సంబంధించిన వార్తలు వింటూ ఆందోళనకు గురై గుండెపోటుతో కన్నుమూసింది. అలాగే, పెద్దాపురం లెప్రసీ కాలనీకి చెందిన జొన్నకోటి మార్తమ్మ (50) కూడా టీవీలో వార్తలు చూస్తూ శనివారం గుండెపోటుకు గురై మృతి చెందిందని ఆమె కుమారుడు సుధాకర్ తెలిపారు. సీతానగరం రాజానగరం మండలం సీతారామపురానికి చెందిన బొబ్బర రామయ్య (60) జగన్ అరెస్టుపై టీవీల్లో వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురై గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు. వైద్యుడు వచ్చేసరికే ప్రాణాలొదిలాడు. తుని మండలం టి. తిమ్మాపురం గ్రామానికి చెందిన మదినే సూరిబాబు (52) కూడా జగన్ అరెస్టుపై వస్తున్న వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వైఎస్‌ఆర్ జిల్లా రాజుపాళెం మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన చింతల పెద్ద సుబ్బన్న(70) జగన్ అరెస్టును తట్టుకోలేక ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలోని రైతు కొలవల యల్లారెడ్డి (50) పొలంలో పని చేసుకుంటుండగా ఆయన భార్య జగన్ అరెస్టు విషయాన్ని చెప్పింది. దీంతో అవునా అంటూనే ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయింది. మైదుకూరు మండలం అన్నలూరు పంచాయతీ పరిధిలోని ముత్యాలనగరానికి చెందిన మాబున్ని(54) జగన్ అరెస్ట్‌తో గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణం విడిచింది. 

ప్రకాశం జిల్లా చీరాల రామ్‌నగర్‌కు చెందిన ఉసురుపాటి రాజారావు(39) టీవీలో జగన్ అరెస్టు చూసి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మృతి చెందాడు. పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామానికి చెందిన చీరదల వెంకటమ్మ (58), నరజాముల తండాకు చెందిన మూడావత్ మోతిబాయి (60) టీవీ చూస్తూ జగన్ అరెస్టును తట్టుకోలేక తల్లడిల్లారు. సుమారు 8 గంటల ప్రాంతంలో వెంకటమ్మ, 8.15 గంటల ప్రాంతంలో మోతిబాయి గుండెపోటుతో చనిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామానికి చెందిన వికలాంగుడు కాకి వెంకటేశ్వర్లు(45) స్నేహితులతో జగన్‌పై సీబీఐ విచారణకు సంబంధించి చర్చిస్తూనే గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. డోన్ రూరల్ మండలం దేవరకొండ గ్రామానికి చెందిన గొల్ల రామచంద్రుడు (58) జగన్ అరెస్టు వార్తను టీవీలో వీక్షిస్తూ కుర్చీలో కూర్చున్న వాడు కూర్చున్నట్లుగానే గుండెపోటుతో మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామం తుమ్మలపల్లికి చెందిన పాముల ఇమ్మానియేలు (65) జగన్ విచారణకు హాజరవుతున్న దృశ్యాలను టీవీలో చూస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ నేత రేకులకుంట సత్యనారాయణ(60) కూడా జగన్ అరెస్టు వార్తను టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిపాలపాడులో కందుకూరి తిరుపతమ్మ (55) కూడా జగన్ అరెస్టు వార్తను చూసి ఆవేదనకు గురై గుండెపోటుతో మరణించింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన సయ్యద్ అమీర్ (71) జగన్ అరెస్టు వార్తలను టీవీలో చూస్తూ గుండె ఆగి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామానికి చెందిన లింక కిష్టయ్య (48) కూడా జగన్‌కు సంబంధించిన వార్తలు విని హఠాత్తుగా గుండె పోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

నలుగురి ఆత్మహత్యాయత్నం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వరంగల్ జిల్లా రేగొండకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు పసుల రత్నాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించా రు. 

నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూరు గ్రామపంచాయతీ పరిధి మేజర్‌వాడి గ్రామానికి చెందిన మన్నే వెంకటి(28) ఇంట్లో నుంచి కిరోసిన్ డబ్బాతో బయటికి వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. గ్రామస్తులు అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుమతీమోహన్ తన ఇంట్లో నిద్రమాత్రలు మింగారు. గమనించిన కుటుంబసభ్యులు, కార్యకర్తలు వైద్యుడ్ని పిలిపిం చి వైద్యం చేయించడంతో ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా దామినేడుకు చెందిన అశోక్ (40) ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది.
Share this article :

0 comments: