మరో 2,500 కోట్ల షాక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో 2,500 కోట్ల షాక్!

మరో 2,500 కోట్ల షాక్!

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

1,630 కోట్లు రిలయన్స్ పాపం + 875 కోట్లు ‘ఉచిత’ భారం
విద్యుత్ సబ్సిడీ చెల్లింపునకు కిరణ్ సర్కారు ససేమిరా 
ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్నున్న డిస్కంలు 
మొత్తం రూ.7 వేల కోట్లకు చేరనున్న చార్జీల మోత 
హైదరాబాద్, న్యూస్‌లైన్: షాకుల మీద షాకులు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలు పెనుభారం మోపుతుండగా.. ప్రజలకు మరో విద్యుత్ షాక్ కూడా పొంచి ఉంది. ఇప్పటికే రూ.4,500 కోట్ల మేరకు భారాన్ని మోపిన ప్రభుత్వం మరో రూ.2,500 కోట్లకు పైగా అదనపు భారాన్ని మోపేందుకూ సిద్ధమవుతోంది. గ్యాసు ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రిలయన్స్ చేసిన పాప ఫలితం రూ.1,630 కోట్లతో పాటు రూ.875 కోట్ల ఉచిత విద్యుత్ భారాన్ని కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సిద్ధమవుతున్నాయి. వ్యవసాయానికి ఏడు గంటలు దాటితే చార్జీలు వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం... తాజాగా గతంలో వ్యవసాయానికి (ఈఆర్‌సీ నిర్ణయించిన కోటాను మించి) అదనంగా సరఫరా చేసిన ఉచిత విద్యుత్‌కు అయిన వ్యయాన్ని కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా గ్యాసు ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించిన ఫలితంగా కొనుగోలు చేసే అదనపు విద్యుత్ భారాన్ని కూడా సర్కారు ప్రజలపైనే వేయనుంది. ఇప్పటికే మోపిన భారంతో వచ్చే నెల బిల్లుల్లో రూ.4,500 కోట్ల షాక్ తగలనుండగా.. తాజాగా రూ.2,505 కోట్లతో కలిపి మొత్తం రూ.7 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం జనంపై పడనుంది. 

రిలయన్స్ నిర్వాకం...

రాష్ట్రంలో గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 2,495 మెగావాట్లు. అంటే గ్యాసు సరఫరా పూర్తిగా జరిగితే ప్రతిరోజూ 2,495 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తాయి. అయితే కేజీ బేసిన్‌లో గ్యాసు ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించడం వల్ల ఈ ప్లాంట్లకు కేవలం 48 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు మాత్రమే గ్యాసు సరఫరా అవుతోంది. దీంతో 1,197 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ కారణంగా ప్రతి ఏటా 7,028 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ లోటు ఏర్పడిందని డిస్కంలు అంచనా వేశాయి. వాస్తవానికి మొత్తం గ్యాసు సరఫరా జరిగితే 1,298 మెగావాట్ల విలువైన విద్యుత్ కూడా.. యూనిట్ కేవలం రూ. 1.85కే మనకు లభ్యమయ్యేది. కానీ గ్యాసు సరఫరా లేకపోవడం వల్ల ఆ మేరకు విద్యుత్‌ను యూనిట్‌కు సగటున రూ.4.17 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతినిచ్చింది. అంటే యూనిట్‌కు అదనంగా రూ.2.32 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే మొత్తం 7,028 ఎంయూలకు యూనిట్‌కు రూ.2.32 చొప్పున అదనంగా వెచ్చించడం వల్ల రూ. 1,630 కోట్ల అదనపు భారం పడుతుందని డిస్కంలు తేల్చాయి. ఈ భారాన్ని జనంపైనే మోపాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. 

‘ఉచితం’పై అనుచితం!: వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ హామీని ప్రభుత్వం గాలికొదిలేసింది. పైగా వ్యవసాయానికి ఏడు గంటల సరఫరా దాటితే పెరిగిన మేరకు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. యూనిట్‌కు రూ.3.50 వసూలు చేయాలని ఇప్పటికే ఈఆర్‌సీ ఆదేశాలు జారీచేసింది. ఇదిలావుండగా.. గతంలో (2010) వ్యవసాయానికి ఈఆర్‌సీ నిర్ణయించిన కోటాకు మించి (ఏటా ఎన్ని ఎంయూల విద్యుత్ సరఫరా చేయాలో ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది) సరఫరా చేసిన విద్యుత్ సంబంధిత భారాన్ని కూడా ప్రజలందరిపైనా మోపనున్నారు. వాస్తవానికి ఈ అదనపు విద్యుత్‌కు అయిన మొత్తాన్ని (సబ్సిడీ) చెల్లించాలని గతంలోలాగే డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ మొత్తాన్ని ప్రజల నుంచే వసూలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి వాస్తవంగా సరఫరా చేయాల్సిన విద్యుత్ కంటే అదనంగా 2,100 ఎంయూలు సరఫరా చేసినట్టు డిస్కంలు పేర్కొంటున్నాయి. ఆ మేరకు ట్రూయింగ్ అప్ (వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడం) పద్ధతిలో యూనిట్‌కు 4.17 చొప్పున రూ. 875 కోట్లను డిస్కంలు ప్రజల నుంచే వసూలు చేయనున్నాయి. ఈ మేరకు అవకాశం కల్పించాలని ఈఆర్‌సీని డిస్కంలు అభ్యర్థించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలను సమర్పించాలని ఈఆర్‌సీ చేసిన సూచన.. మళ్లీ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. 

అదనపు విద్యుత్‌కు నిధులిచ్చిన వైఎస్

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్ 2004 నుంచి అమలు చేశారు. దీనికింద వ్యవసాయానికి సరఫరా చేసిన మొత్తం విద్యుత్‌కు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే ఉచిత విద్యుత్ ఎంత సరఫరా అవుతుందనే విషయాన్ని ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈఆర్‌సీ నిర్ణయించిన దానికి మించి డిస్కంలు సరఫరా చేస్తే... ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ అలాగే జరిగింది. ఒకవేళ వ్యవసాయానికి కోటాకు మించి సరఫరా జరిగితే... ఆ అదనపు విద్యుత్ కొనుగోళ్లకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేశారు. ఒక్క వ్యవసాయానికే కాకుండా గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసిన అదనపు విద్యుత్‌కు కూడా నిధులు విడుదల చేసేందుకు వైఎస్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
Share this article :

0 comments: