నిమ్మగడ్డకు 30 దాకా రిమాండ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిమ్మగడ్డకు 30 దాకా రిమాండ్

నిమ్మగడ్డకు 30 దాకా రిమాండ్

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012


14 రోజులపాటు కస్టడీకి సీబీఐ పిటిషన్
వెంటనే అప్పగించాలంటూ న్యాయమూర్తికి విజ్ఞప్తి
నిందితుల వాదనలు వినకుండా ఎలా?
సీబీఐని ప్రశ్నించిన న్యాయమూర్తి పుల్లయ్య
కస్టడీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ గ్రూపు సంస్థల చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ టీఎస్ అధికారి బీకే బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక ముఖ్య న్యాయస్థానం మే 30 వరకు రిమాండ్ విధించింది. సీబీఐ ఎస్పీ హెచ్ వెంకటేశ్ నేతృత్వంలో అధికారులు బుధవారం మధ్యాహ్నం 2.40 గంటలకు వారిని సీబీఐ ముఖ్య ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పుల్లయ్య ఎదుట హాజరు పరిచారు. అరెస్టు సమయంలో సీబీఐ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వారు తెలిపారు. రిమాండ్ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించి రిసెప్షన్ బ్లాక్‌లో ఉంచారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున కోర్టుకు వచ్చారు. ప్రసాద్‌ను కలిసిన ఆయన సోదరి కన్నీటిపర్యంతమయ్యారు.

తీరు మారని సీబీఐ

న్యాయమూర్తులు ఎంతగా హితబోధ చేస్తున్నా సీబీఐ తీరు మాత్రం మారడం లేదు. ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను 14 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని బుధవారం రిమాండ్ పిటిషన్‌లోనే సంస్థ కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించకుండా పోలీసు కస్టడీకి అప్పగించే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు. ‘రిమాండ్ రిపోర్టుకు నంబరుండదు. కస్టడీ పిటిషన్‌కు కోర్టు క్రిమినల్ నంబరివ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నిందితుల అరెస్టు సమయంలో రిమాండ్ రిపోర్టు, కస్టడీ పిటిషన్లను వేర్వేరుగా వేయండి’ అని ఆదేశించారు. నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) నిబంధనల మేరకు రిమాండ్ రిపోర్టు, కస్టడీ పిటిషన్ వేరుగా ఉండాలని గతంలో కూడా న్యాయమూర్తి నాగమారుతిశర్మ పలుమార్లు సీబీఐని ఆదేశించారు. కస్టడీకివ్వాలని రిమాండ్ రిపోర్టులోనే కోరడంపై నిందితుల తరఫు న్యాయవాదులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సీబీఐ తన వైఖరి మార్చుకోలేదు. న్యాయమూర్తి ఆదేశాలను పట్టించుకోకుండా, తాజాగా కూడా యథావిధిగా రిమాండ్ రిపోర్టులోనే కస్టడీకి కోరింది!

ఒక్కరోజులో ఏమవుతుంది: న్యాయమూర్తి

ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను 14 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్, సీనియర్ పీపీ టి.వెంకటరమణ, పీపీ బి.ప్రవీణ్‌రాజు విజ్ఞప్తి చేశారు. 2జీ కేసులో నిందితులను అరెస్టు చేసిన రోజే కోర్టు కస్టడీకి అప్పగించిందని నివేదించారు. ఒక్క రోజు ఆలస్యమైనా దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి వెంటనే తమ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క రోజులో ఏం జరిగిపోతుందని న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. ‘‘ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను కోర్టులో హాజరుపరిచే ముందే వారి తరఫు న్యాయవాదులకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. వారు కనీసం దాన్ని పరిశీలించాలి కదా. కస్టడీకి అప్పగింతపై నిర్ణయం తీసుకునే ముందు నిందితుల తరఫు న్యాయవాదులకు వాదనలు వినిపించే అవకాశమివ్వడం సహజ న్యాయసూత్రం. ఒక్క రోజులో ఏం జరిగిపోతుంది? కస్టడీ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నా’’ అని ఆయన స్పష్టం చేశారు. గురువారమే వాదనలు విని, వెంటనే నిర్ణయం ప్రకటించాలని సీబీఐ పీపీలు మరోసారి విజ్ఞప్తి చేశారు. అసలు ప్రసాద్ అరెస్టే చట్ట విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ‘‘గత ఏడు నెలల్లో ఆయన 41 సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. సమన్లు పంపిన ప్రతిసారీ వెళ్లి, తనకు తెలిసిన అన్ని విషయాలనూ వారికి వివరించారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారు. ప్రసాద్ సీబీఐ ఎదుట హాజరైనప్పుడల్లా నేనూ ఆయన వెంట ఉన్నాను. మొన్న రాత్రికి, ఈ రోజు రాత్రికి ఏం తేడా వచ్చింది? ప్రసాద్ అరెస్టే చట్ట విరుద్ధం’’ అని వాదించారు. రిమాండ్, కస్టడీ పిటిషన్లపై అభ్యంతరాలుంటే గురువారం తెలిపాలంటూ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

బ్రహ్మానందరెడ్డి మెమో దాఖలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసులో బ్రహ్మానందరెడ్డిని నిందితునిగా చేర్చాలంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఐపీసీ 120 (బి), 420, 406, 477(ఎ) సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(1)(2) సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొంది. ‘‘నిజాంపట్నం ఓడ రేవు ఏర్పాటుకు వాన్‌పిక్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి సంతకాలు చేశారు. మంత్రి మండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక లొసుగులతో ఈ ఒప్పందం జరిగింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీతో వాన్‌పిక్ ఒప్పందం చేసుకునేలా బ్రహ్మానందరెడ్డి ఎంవోయూను రూపొందించారు. వాన్‌పిక్‌కు భూములు కేటాయించాలంటూ గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు రాశారు. దాంతో వాన్‌పిక్‌కు 13,000 ఎకరాల భూమి అప్పగించారు. బ్రహ్మానందరెడ్డి వాన్‌పిక్‌తో కుమ్మక్కై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చేలా వ్యవహరించారు. అందుకే ఈ కేసులో ఆయన్ను నిందితునిగా చేరుస్తున్నాం’’ అనిపేర్కొంది. బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం కోల్‌కతాలోని ఆగ్నేయ రైల్వేలో ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

నిమ్స్‌లో వైద్య పరీక్షలు

నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను సీబీఐ అధికారులు మంగళవారం రాత్రంతా దిల్‌కుశ అతిథి గృహంలోనే ఉంచి విచారించారు. బుధవారం ఉదయం 10.30కు వారిని నిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇద్దర్నీ దిల్‌కుశకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిమ్స్, దిల్‌కుశ వద్ద విపరీతమైన మీడియా హడావుడి నెలకొంది. భోజనానంతరం వారిని మధ్యాహ్నం 2.15 గంటలకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు.
Share this article :

0 comments: