బంద్‌ను భగ్నం చేయడానికి 60 వేల మంది పోలీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్‌ను భగ్నం చేయడానికి 60 వేల మంది పోలీసులు

బంద్‌ను భగ్నం చేయడానికి 60 వేల మంది పోలీసులు

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

జిల్లాల్లో 31,350 మందికిపైగా కార్యకర్తలు, నేతల అరెస్టు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ఎటు చూసినా ఖాకీమయం.. ఎక్కడికక్కడ నిర్బంధాలు.. అరెస్టులు.. లాఠీచార్జీలు.. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో సోమవారం ‘ఎమర్జెన్సీ’ రాజ్యమేలింది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ సోమవారం ఇచ్చినరాష్ట్ర బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసు యంత్రాంగం సాయంతో సర్కారు దమనకాండకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర పారామిలటరీ బలగాలు, ఏపీఎస్పీ బలగాలు, రిజర్వు, సివిల్ పోలీసులు కలిపి ఏకంగా 60 వేల మంది ఖాకీలను రంగంలోకి దింపింది. జిల్లాల్లో పోలీసులు 31,350కిపైగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను, క్రియాశీల నాయకులను గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులు సృష్టించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్న కార్యకర్తలపైనా లాఠీలతో విరుచుకుపడ్డారు. 

ఎన్ని నిర్బంధాలున్నప్పటికీ జనం, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో శాంతియుతంగా ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రత్యేక వాహనాల్లో పోలీసులు రోడ్లపై తిరుగుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులైన పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి గుర్నాథరెడ్డిలతో పాటు వరంగల్‌లో ఎమ్మెల్సీ కొండా మురళి తదితర నాయకులను గృహనిర్బధంలో ఉంచారు. డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకే అన్ని జిల్లాల ఎస్పీలు అణచివేత చర్యలకు దిగారు. బంద్ సక్సెస్ కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంతో ఖాకీలు మరింత రెచ్చిపోయారు.

పోలీసుల దమనకాండ సాగిందిలా..: గత రెండ్రోజుల నుంచే జిల్లాల్లో అరెస్టుల పర్వానికి తెరలే పిన పోలీసులు.. సోమవారం మరింత ఉధృతం చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే పది వేల మందికిపైగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీ అభ్యర్థి బి.గురునాథరెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సాలార్‌బాషలతో సహా వెయ్యి మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో రెండు వేల మంది జైల్‌భరో నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో ముందుజాగ్రత్తగా 1273 మందిని అరెస్టుచేశామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. అనధికారికంగా ఈ సంఖ్య 2,500 మందికి పైనే ఉంటుంది. జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వందలాది మంది జైల్‌భరో నిర్వహించారు. రాజమండ్రిలో జక్కంపూడి విజయలక్ష్మి, నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో పోలీసులు ముందస్తుగా సుమారు 600 మంది నాయకులను అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాలో 700 మంది కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చీపురుపల్లిలో జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజును అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లాలో 300 మందిని అరెస్టు చేశారు. 18 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో 230 మందిని అరెస్టు చేశారు. మరో 120 మందిని అనధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అరెస్టు పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లాలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సహా 1304 మంది నాయకులు, కార్యకర్తలను నిర్బంధించారు. ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు మూడు వేల మందికిపైగానే పోలీసులు అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై వదిలి పెట్టారు. పార్టీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉదయం గృహనిర్బంధం చేశారు. నెల్లూరులో 1350 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. కృష్ణా జిల్లాలో వెయ్యిమందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. వైఎస్సార్ జిల్లాలో గత రెండ్రోజుల్లో 100 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో 1112 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్య నేతలు, మండల కన్వీనర్లతో పాటు మొత్తం 1400 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

ఎమ్మిగనూరు పార్టీ అభ్యర్థి కె.చెన్నకేశవరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో ప్రచారం నిర్వహించలేకపోయారు. కరీంనగర్ జిల్లాలో 287 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి సాయంత్రం ఏడు గంటల వరకు పోలీస్ స్టేషన్లలోనే ఉంచి బంద్‌ను విఫలం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 300 మందిని అరెస్టు చేయగా.. నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 వేల మందిని తీసుకున్నారు. మెదక్‌లో 391 మంది బైండోవర్ కేసులు పెట్టారు. వరంగల్‌లో 400 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 155 మందిని, నిజామాబాద్‌లో 500 మందిని నిర్బంధించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలను రెండు రోజుల క్రితమే పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

కర్ణాటకలో జగన్‌కు సంఘీభావం

బెంగళూరు, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. సీబీఐ వైఖరిని నిరసిస్తూ సోమవారం బెంగళూరులో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఫ్రీడం పార్కులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి నాయకత్వంలో ధర్నా చేశారు. బళ్లారి నగరంలోని రాయల్ సర్కిల్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు మౌన ప్రదర్శన నిర్వహించారు. 

డీజీపీతో సీఎం సమీక్ష..: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో డీజీపీ దినేష్‌రెడ్డితో భేటీ అయ్యారు. శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఇక ముందు కూడా మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు.
Share this article :

0 comments: