‘సాక్షి’ ఉద్యోగులు వెయ్యి మందేగా: సీఎం.సాక్షిపై ఆధారపడ్డవారు 61 వేలు సీఎంగారూ.. తెలుసుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’ ఉద్యోగులు వెయ్యి మందేగా: సీఎం.సాక్షిపై ఆధారపడ్డవారు 61 వేలు సీఎంగారూ.. తెలుసుకోండి

‘సాక్షి’ ఉద్యోగులు వెయ్యి మందేగా: సీఎం.సాక్షిపై ఆధారపడ్డవారు 61 వేలు సీఎంగారూ.. తెలుసుకోండి

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

20 వేల మంది ఎక్కడున్నారంటూ ఎద్దేవా
పత్రికలో 700, టీవీలో 300 మందే ఉన్నారట!
వాస్తవాలు వివరించినా, వంకర నవ్వులే సమాధానం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘సాక్షి’పై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షి మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కేవలం వెయ్యి మందేనని తనంత తానుగా తేల్చేశారు. ‘సాక్షి మూతపడ్డా వెయ్యి మందికేగా నష్టం’ అనే రీతిలో విడ్డూరపు వ్యాఖ్యలూ చేశారు. సాక్షి ఖాతాల స్తంభన, సంస్థలకు ప్రభుత్వ ప్రకటనల నిలిపివేతలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. 

గురువారం మహబూబ్‌నగర్ శివారులోని క్రిస్టియన్‌పల్లిలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించేందుకు వచ్చిన కిరణ్.. సాక్షి సంస్థల ప్రతినిధులు, ఏపీయూడబ్ల్యూజే మహబూబ్‌నగర్ శాఖ సభ్యులు వినతిపత్రం అందించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. సాక్షి మీడియా గ్రూపుకు చెందిన బ్యాంకు కరెంట్ ఖాతాల లావాదేవీలను సీబీఐ ఫ్రీజ్ చేయడం వల్ల 20 వేల మంది ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొందని జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సాక్షికి ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ బుధవారం అర్ధరాత్రి జారీ చేసిన 2097 జీవోతో సంస్థ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినట్టయిందని వారన్నారు. దాంతో.. ‘సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులా? ఏం చెబుతారయ్యా..! నాకు తెలియదా? అందులో వెయ్యి మంది పని చే యడమే ఎక్కువ! టీవీలో 300 మంది, పేపర్‌లో 700 మంది. అంతే కదా!’ అంటూ కిరణ్ చాలా తేలిగ్గా తేల్చిపారేశారు. సాక్షి ప్రతినిధులు వివరించే ప్రయత్నం చేయగా, ‘ఓకే.. ఓకే! నేను పరిశీలిస్తా’ అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు!

పోలవ రానికి అడ్డొస్తే భస్మమవుతారు!

పోలవరం ప్రాజెక్టును కోర్టుకు వెళ్లయినా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌పై కిరణ్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్ పేరుతో ఎన్నికల్లో సీట్టు గెలుచుకుంటున్నారని, తర్వాత రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం మహబూబ్‌నగర్ మం డలం క్రిస్టియన్‌పల్లిలో జరిగిన రైతు చైతన్యయాత్ర సభలో టీఆర్‌ఎస్‌కు పేరెత్తకుండానే శాపనార్థాలు పెట్టారాయన. ‘‘తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు పోలవరం నుంచి 40 టీఎంసీల నీరు వస్తున్నప్పుడు అడ్డుకునే అఘాయిత్యమెందుకు? ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోండి. లేదంటే ఇంట్లో కూర్చోండి. అంతేగానీ, అడ్డొస్తే భస్మమవుతారు’’ అంటూ హెచ్చరించారు.



సాక్షిపై ఆధారపడ్డవారు 61 వేలు
సీఎంగారూ.. తెలుసుకోండి


సాక్షి ఉద్యోగుల సంఖ్య వెయ్యేనంటూ తేలిగ్గా తేల్చేసిన ముఖ్యమంత్రిగారూ! వాస్తవాలు తెలుసుకోండి. పలు రూపాల్లో సాక్షిపై ఆధారపడ్డ వారి సంఖ్య ఎంతో తెలుసా? 60,993! సంస్థలో రెగ్యులర్, క్యాజువల్ ఉద్యోగులే 8,793 మంది! ఇంకా 13 వేల మంది న్యూస్‌పేపర్ ఏజెంట్లు, 26,500 మంది పేపర్ బాయ్‌లు, 11,700 మంది హాకర్లు, వీరుగాక 1,000 మంది ట్రాన్స్‌పోర్టర్లున్నారు. అయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నా, అంతా బానే ఉందంటూ పార్టీ అధిష్టానానికే ఎప్పటికప్పుడు తప్పుడు సమాచారమిస్తూ వచ్చిన ఘనులుమీరు! అలాంటిది.. మీకు ఎంతమాత్రమూ గిట్టని సాక్షి విషయంలో మీనుంచి అంతకంటే భిన్నమైన ప్రవర్తనను ఎలా ఆశించగలం?! బహుశా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై చేయించినట్టుగానే సాక్షి ఉద్యోగుల సంఖ్యపై కూడా ‘పక్కాగా’ సర్వేలేవో చేయించి, వాటి నివేదికల ఆధారంగా మీరు ఇలాంటి నిర్ధారణకు వచ్చినట్టున్నారు!
Share this article :

0 comments: