ఈనాడు యాజమాన్యంపై చర్యలేవి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు యాజమాన్యంపై చర్యలేవి?

ఈనాడు యాజమాన్యంపై చర్యలేవి?

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

* సీబీఐ, ప్రభుత్వం పథకం ప్రకారమే ఇలా చేశాయి
* పలు కేసులు ఎదుర్కొంటున్న ఈనాడుపై లేని నిషేధం సాక్షిపై ఎందుకు?

గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో ముందే ఒక అవగాహనకు వచ్చి.. పథకం ప్రకారమే సాక్షి పత్రికకు వచ్చే ప్రభుత్వ ప్రకటనలపై నిషేధం విధిస్తూ జీవో జారీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈనెల 8న సాక్షి పత్రిక, చానల్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీబీఐ ఫ్రీజ్ చేయగా.. ఏ ప్రభుత్వశాఖ సాక్షికి ప్రకటనలు ఇవ్వకూడదని బుధవారం అర్ధరాత్రి జీవో వెలువడిందని పేర్కొన్నారు. ఖాతాలను సీబీఐ ఫ్రీజ్ చేసింది కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కొందరు ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. 

రాంబాబు గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి ప్రకటనలపై నిషేధం విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, దీనిపై న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నట్లు గత నెల 30న దక్కన్ క్రానికల్ దినపత్రికలో ఒక కథనం ప్రచురితమైందని తెలిపారు. అంటే అర్ధరాత్రి ఇచ్చిన జీవో ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది నిరూపితమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, స్వతంత్ర వ్యవస్థ అయిన సీబీఐ జత కట్టి మరీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. చట్టాల్ని ఉల్లంఘిస్తూ సాక్షి గొంతు కోయాలని ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఈనాడు యాజమాన్యంపై చర్యలేవి?
ఈనాడు యాజమాన్యం హెచ్‌ఎఫ్ సెక్షన్ కింద కొన్ని వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఉషోదయలో పెట్టుబడులు పెట్టిందని, ఆర్‌బీఐలోని 45వ నిబంధన ప్రకారం అది ఆర్థిక నేరమని నిర్ధారించి నిషేధించారని అంబటి గుర్తుచేశారు. దీంతో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఈనాడు యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టిందని, కానీ ఆ పత్రికకు ప్రకటనలివ్వడాన్ని మాత్రం నిషేధించలేదని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈనాడుపై లేని నిషేధం సాక్షిపై ఎందుకని ప్రశ్నించారు. రామోజీరావు, చంద్రబాబు, కిరణ్‌లు సాక్షి గొంతు కోయటానికి చేస్తున్న కుట్రను ఓటు అనే ఆయుధంతో ప్రజలు నిలువరించి కాంగ్రెస్, టీడీపీలను నిలువునా కోస్తారని హెచ్చరించారు.

జగన్‌దే విజయం
సాక్షి ప్రజల గొంతును వినిపిస్తోందని, అందులో టీడీపీ, కాంగ్రెస్ చేసే కుట్రలను బహిర్గతంచేసే కథనాలు వస్తున్నాయని.. వాటిని అడ్డుకుంటే తాము చెప్పిందే వేదం అవుతుందనే భావనలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, మరికొంత మంది కాంగ్రెస్ పెద్దలు 2009లో సాక్షి పత్రిక లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చేవి కాదని చెప్పిన విషయాన్ని రాంబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దివంగత వైఎస్సార్ రెక్కల కష్టంతోపాటు సాక్షి పత్రిక కృషి వల్లే 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టంచేశారు. 

పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదంటూనే అవినీతి సొమ్ము అంటూ బాబు, కిరణ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం చెబితే అది అవినీతి సొమ్ము అయిపోదని, ఆ విషయం చెప్పాల్సింది న్యాయస్థానాలని పేర్కొన్నారు. తమకు కోర్టులపై విశ్వాసం, ప్రజలపై గౌరవం ఉందని.. న్యాయస్థానాల్లో జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్‌కే అంతిమ విజయం దక్కుతుందని ధీమా వ్యక్తంచేశారు. అర్ధరాత్రి అడ్డగోలుగా జీవో జారీ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

బాబుది బందిపోటు దొంగల పార్టీ
పక్క పార్టీలను విమర్శించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది బందిపోటు దొంగల పార్టీ అని అంబటి విమర్శించారు. ఆయన మినహా మిగిలిన నేతలంతా దొంగలనే రీతిలో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క ఉప ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదని, చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని గుర్తుచేశారు. 18 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని, టీడీపీకి మూడో స్థానం ఖాయమని జోస్యం చెప్పారు.
Share this article :

0 comments: