విజయమ్మ నిరసన దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ నిరసన దీక్ష

విజయమ్మ నిరసన దీక్ష

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012



* దిల్‌కుశ ముందు బైఠాయింపు
* రెండు గంటల పాటు ఫుట్‌పాత్‌పై కూర్చున్న విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల
* బలవంతంగా ఇంటికి తరలించిన పోలీసులు
* ఇంటి ముందు రోడ్డు పైనే దీక్ష కొనసాగింపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మాతృమూర్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం రాత్రి దిల్‌కుశ అతిథి గృహం ముందు ధర్నా చేశారు. అరెస్టు అనంతరం కుమారుడిని దిల్‌కుశలో కలిసి బయటికి వచ్చిన ఆమె, ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. ఆవేదనతో రాత్రి 9 గంటల ప్రాంతంలో దిల్‌కుశ వద్దే ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, జగన్ చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డి, ఆయన సతీమణి వై.వి.స్వర్ణ, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జూపూడి ప్రభాకర్ తదితరులు కూడా ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయమ్మకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దిల్‌కుశ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాసేపటికే రాపిడ్ యాక్షన్ ఫోర్సుకు చెందిన మహిళా కమెండోలు విజయమ్మ బృందాన్ని చుట్టుముట్టారు. ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిని స్థానిక పోలీసులు నెట్టివేశారు. వీడియా కెమెరాలను లాక్కోజూశారు. రెండు గంటల తర్వాత, రాత్రి 11.15 గంటలకు విజయమ్మ తదితరులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రయత్నాలను విజయమ్మ, షర్మిల, భారతి, స్వర్ణ తదితరులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. పోలీసుల తీరుపై విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరకు అందరినీ అదుపులోనికి తీసుకుని, లోటస్‌పాండ్‌లోని వారి నివాసానికి తరలించారు. అక్కడ విజయమ్మ, కుటుంబ సభ్యులంతా జగన్ నివాసం గేటు ముందు రోడ్డుపైనే బైఠాయించారు. విజయమ్మతో పాటు వైఎస్ భారతి, షర్మిల తదితరులంతా దీక్ష కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా దీక్ష కొనసాగుతూనే ఉంది. ఆడిటర్ విజయసాయిరెడ్డి తదితరులంతా వారికి మద్దతుగా అక్కడే ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు.

ససేమిరా అన్న విజయమ్మ
అంతకుముందు దిల్‌కుశ వద్ద బైఠాయించిన విజయమ్మకు నచ్చచెప్పేందుకు పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విఫలయత్నం చేశారు. కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆవేదనతో ఉన్న ఆమె మాత్రం, తాను నిరసన తెలిపి తీరుతానని స్పష్టం చేశారు. ధర్నాకు కూర్చున్న వెంటనే తన వద్దకు వచ్చిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తానేమీ ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. తన కుమారుడి అరెస్టుకు కారణాలను సీబీఐ చెప్పాల్సిందేనన్నారు.

కనికరం లేని కాఠిన్యం!
విజయమ్మ దీక్ష సందర్భంగా దిల్‌కుశ వద్ద పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ముందుగా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జూపూడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ సతీమణిని పోలీసులు ఇలా అదుపులోకి తీసుకుంటుంటే ముఖ్యమంత్రి, హోం మంత్రి నిద్రపోతున్నారా అంటూ నిలదీశారు. తర్వాత జగన్ మామ ఈసీ గంగిరెడ్డితో పాటు వైఎస్ భారతి, వైవీ స్వర్ణ, షర్మిల, విజయమ్మ, సబ్బం హరిలను విడివిడిగా అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్‌లోని వారి నివాసానికి తరలించారు.

బతిమాలినా వినలేదు: జూపూడి
ధర్నా విషయంలో తాము చెప్పినా విజయమ్మ వినలేదని జూపూడి తెలిపారు. జగన్ అరెస్టుకు వ్యతిరేకంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేద్దామని ఎంత చెప్పినా, కుమారుడు లేకుండా ఇంటికి వెళ్లలేనంటూ ఫుట్‌పాత్‌పై బైఠాయించారన్నారు.

‘నా బిడ్డను నాకు అప్పగించేదాకా నేనింటికి వెళ్లలేను. ఇక్కడే ఉంటా. నా బిడ్డను నాకప్పగించే దాకా ఇక్కడి నుంచి లేవను’ అని కచ్చితంగా చెప్పారన్నారు. విజయమ్మ ఆవేదన రాష్ట్ర ప్రజలకు చేరకుండా చేసే లక్ష్యంతో మహిళా కమెండోలు ఆమెను చుట్టుముట్టారని ఆరోపించారు. విజయమ్మ దీక్షను మీడియా చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు.

‘వైఎస్ చేసినదానికి మంచి బహుమతే ఇచ్చారు’
తమను అదుపులోకి తీసుకోవద్దంటూ దిల్‌కుశ వద్ద పోలీసులను విజయమ్మ, కుటుంబ సభ్యులు కోరారు. తామెవరినీ ఇబ్బంది పెట్టబోమని, అక్కడ కూర్చునేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా బిడ్డను మీరేం చేస్తారోనన్న బాధతో, భయంతో దేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడ కూర్చున్నాం. మేమున్నది ఐదుగురమే. మీరంతా ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇక్కడ నిర్మానుష్యంగా మారుతుంది. అంతా కలిసి అన్యాయం చేస్తున్నారు. వైఎస్ చేసిన దానికి మంచి బహుమానమే ఇస్తున్నారు. మేమేమీ మాట్లాడడం లేదు. మీరే వచ్చి మాట్లాడుతున్నారు. మీరెళితే ప్రశాంతంగా ఉంటుంది. మేం మౌనంగా కూర్చున్నాం. దయచేసి మేం నమస్కరించి అడుగుతున్నాం. మాకు ఇక్కడ కూర్చునే అవకాశం ఇవ్వండి.’ అని విజయమ్మ, భారతి, స్వర్ణలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

సబ్బం కంటతడి
విజయమ్మ ధర్నా అనకాపల్లి ఎంపీ సబ్బం హరిని తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయనుకోలేదని విచారం వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి రోడ్డుపై బైఠాయించాల్సి రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ ఇంటి వద్ద కరెంటు కోత
అయినా కొనసాగుతున్న విజయమ్మ దీక్ష

విజయమ్మ తదితరులు దీక్ష కొనసాగిస్తున్న లోటస్‌పాండ్ నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక కరెంటు పోయి ఒక్కసారిగా గాఢాంధకారం అలముకుంది. అర్ధరాత్రి 12.30 సమయంలో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలు వచ్చాయి. వీఐపీ జోన్ అయిన జగన్ నివాసంతో పాటు పరిసర ప్రాంతమంతటా ఆ వెంటనే కరెంటు పోయింది. దీక్షను భ గ్నం చేసేందుకు పోలీసులే సమీపంలోని రెండు ట్రాన్స్‌ఫార్మర్లను పేల్చేశారని తెలిసింది. అయినా విజయమ్మ అంధకారంలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు మాత్రం దీక్షను నిలిపేసి ఇంట్లోకి వెళ్లాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు.
Share this article :

0 comments: