కొంపముంచుతున్న క్యుములోనింబస్ మేఘాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొంపముంచుతున్న క్యుములోనింబస్ మేఘాలు

కొంపముంచుతున్న క్యుములోనింబస్ మేఘాలు

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012


కొంపముంచుతున్న క్యుములోనింబస్ మేఘాలు
పిడుగుల తీవ్రత పెరగడానికి ఇవే కారణం 
మరో రెండ్రోజుల వరకూ అకాల వర్షాలు, పిడుగులకు అవకాశం
తిరుమలలో కుండపోత వర్షం
నేడు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు
తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం

విశాఖపట్నం, న్యూస్‌లైన్: భూమి బద్దలైనట్లుగా.. గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా.. నేలపైకిదూసుకొచ్చిన పిడుగులు రాష్ట్రంలో ఒకే రోజున 20 మందిని పొట్టనబెట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ విధ్వంసం వాతావరణ శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచే స్తోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజనుకు ముందు(ప్రీమాన్సూన్ సీజన్) ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తుంటాయి. అయితే, ఇప్పుడీ పిడుగులు తీవ్రత పెరగడానికి క్యూములోనింబస్ మేఘాలే(కారుమబ్బులు) ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘అప్పటిదాకా ఎక్కడుంటాయో తెలియని ఈ మేఘాలు ఉన్నట్టుండి ఊడిపడతాయి. అరగంట వ్యవధిలోనే కారు మబ్బులు కమ్ముకుంటాయి. గాలి వానతో పాటు పిడుగులతో నానా బీభత్సం సృష్టించి ఆ తర్వాత కనుమరుగవుతాయి’ అని పేర్కొంటున్నారు. 

క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటానికి అధికపీడనంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా కారణమవుతాయని, ఇవి భూమికి ఎంత ఎక్కువ ఎత్తులో ఉంటే అంత తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వారు చెబుతున్నారు. భూమికి 6-8 కి.మీల ఎత్తులో వుంటే ఓ మోస్తరు క్యుములోనింబస్ మేఘాలుగానూ.. 10-14 కి.మీల మధ్య ఎత్తులో ఏర్పడితే తీవ్రమైనవిగాను పరిగణిస్తారు. ‘ఆదివారం రాష్ట్రంలో ఒక్కసారిగా పిడుగులు మారణకాండ సృష్టించడానికి అధిక ఉష్ణోగ్రతలు, అధికపీడనం, అల్పపీడనద్రోణి కారణం. అయితే, క్యుములోనింబస్ మేఘాలు 12-14 కి.మీల ఎత్తులో ఏర్పడటంతో తీవ్రత అధికమై పెద్దసంఖ్యలో పిడుగులకు కారణమైంది’ అని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ డాక్టర్ వి.ఎల్ .ఎన్.ప్రసాదరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ‘ప్రస్తుతం తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన, ఉపరితల ద్రోణులు ఆవరించి ఉన్నాయి. అదే సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. కాబట్టి.. రెండ్రోజులవరకూ అకాల వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది’ అని తెలిపారు.

పిడుగు పడితే.. మాడిమసైపోవాల్సిందే.. 

సముద్ర ఉపరితలంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో నీటి ఆవిరి వల్ల మేఘాలేర్పడతాయి. ఆ మేఘాల్లో వుండే నీటిబిందువుల కదలిక వేగంతో రుణావేశ, ధనావేశిత ఎలక్ట్రాన్లు ఏర్పడి ఒకేసారి ఉరుములు, మెరుపులు సంభవిస్తాయి. వాటి తీవ్రత పెరిగి పిడుగులుగా మారి నేలపై దూసుకొస్తాయి. అలా పడే పిడుగుల్లో లక్షలాది సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, కోట్లాది వోల్టుల విద్యుత్ ప్రసరిస్తుంది. అందుకే పిడుగులు పడితే భారీ వృక్షాలు సైతం భగ్గున మండిపోతాయి. మనుషులయితే మాడిమసైపోతారు. పిడుగు ధాటికి సమీపంలో వున్న వారి గుండె ఆగిపోయే ప్రమాదముంది. అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, మనిషి బాగా నీరసపడటం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దు. 
విధిలేని పరిస్థితుల్లో పెద్ద చెట్లకు బదులు చిన్న చెట్లను ఆశ్రయించాలి. 
బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. 
తప్పించుకునే అవకాశం లేనివారు నేలపై వెల్లకిలా పడుకోవడం శ్రేయస్కరం. 
ఆ సమయంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను, ఫోన్లను వినియోగించకూడదు. 
కార్లలో వెళ్లే వారు ఆగిపోవడం మంచిది. 
సముద్రంలో బోట్లలో వున్న వారు డెక్‌లో ఉండిపోవాలి. ఇళ్లు, భవనాల్లో అద్దాల కిటికీల వద్ద ఉండటం శ్రేయస్కరం కాదు. 

తిరుమలలో కుండపోత

తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో సోమవారం సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం 4 నుంచి 5 గంటలవరకూ ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఆలయ ప్రాంతం మొత్తం జలమయమైంది. తిరుమలలో పలుచోట్ల వర్షం నీరు వరదలా ప్రవహించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో శ్రీవారి ఆలయం వద్ద పరిణయోత్సవ వివరాలు తెలిపే ఫ్లెక్సీలు, వాహన సేవలో ఉపయోగించే ఘఠాటోపం కూలిపోయాయి. నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షం వల్ల పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు పడిపోయింది. వేసవి తాపంతో తల్లడిల్లుతున్న భక్తులు వర్షంతో సేద తీరారు. తిరుపతితోపాటు జిల్లాలోని మదనపల్లె, రామసముద్రం, వాల్మీకిపురం, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరిల్లో మోస్తరుగా వర్షం కురిసింది.

నేడు కోస్తా, సీమల్లో జల్లులు.. 

విశాఖపట్నం, న్యూస్‌లైన్: రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు లేదా తేలికపాటి జల్లులు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో సోమవారం నమోదయిన వర్షపాత వివరాలివీ.. సత్యవేడు, రాజంపేటలలో 6 సెం.మీ, ఎస్.కోటలో 5 సెం.మీ, పాకాలలో 4 సెం.మీ, ఉయ్యూరు, గుడివాడ, బొబ్బిలి, సూర్యాపేటలలో 3 సెం.మీ, తడ, తిరువూరు, విజయవాడ, ఉదయగిరి, వెంకటగిరికోట, పుత్తూరు, పుంగనూరు, ఖమ్మం, మిర్యాలగూడలలో 2 సెం.మీ, వింజమూరు, సీతారామపురం, ఎర్రగొండపాలెం, పోరుమామిళ్ల, అశ్వారావుపేటలలో 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

13 వేల హెక్టార్లలో పంట నష్టం-ఉద్యాన పంటలకు అకాల వర్షాల దెబ్బ

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 13,987 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ నిర్ధారించింది. మొత్తం 18 జిల్లాల్లో పంటలు నష్టపోయాయి. వరంగల్ జిల్లాలో 4,871 హెక్టార్లలో, మహబూబ్‌నగర్ జిల్లాలో 2,120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలో-1,477, మెదక్-1,224, విజయనగరం-1,170, విశాఖపట్నం-1,025, కర్నూలు-737, కడప-333, నల్లగొండ-262, గుంటూరు-254, శ్రీకాకుళం-142, రంగారెడ్డి-184, చిత్తూరు-100, తూర్పుగోదావరి-31, అనంతపురం-30, ప్రకాశం-21 హెక్టార్లలో పంటలు పాడయ్యాయి.
Share this article :

0 comments: