రిలయన్స్‌కు నిజంగా షాకేనా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిలయన్స్‌కు నిజంగా షాకేనా!

రిలయన్స్‌కు నిజంగా షాకేనా!

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012



నాలుగేళ్ల క్రితం కృష్ణా-గోదావరి బేసిన్‌లో రిలయన్స్ సంస్థ చమురు ఉత్పత్తి ప్రారంభించినప్పుడు దేశమంతటా హర్షాతిరేకాలు మిన్నంటాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంకింద మొదలైన ఆ సాగరమథనం మన తూర్పు వాకిటనే ఉండటం తెలుగువారందరినీ పులకింపజేసింది. మూడేళ్లనాడు అక్కడినుంచే సహజవాయు ఉత్పత్తి కూడా మొదలైనప్పుడు దేశ ఇంధన భద్రతకు అది భరోసాగా నిలుస్తుందని, మన రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలను విరగడ చేస్తుందని అందరూ ఆశించారు. అక్షయ పాత్రలాంటి ఆ ఇంధన క్షేత్రంలో అపారమైన గ్యాస్ నిక్షేపాలున్నాయని దశాబ్దం కిందట నిపుణులు తేల్చారు. వాటి విలువ 36 లక్షల కోట్ల రూపాయలుంటుందని ఒక అంచనా. ఇక్కడ రోజుకు 200 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల సహజవాయువు లభ్యమవుతుందని లెక్కలేశారు. అందరి ఆశలనూ, ఆకాంక్షలనూ రిలయన్స్ తల్లకిందులు చేసింది.

తవ్వకాలు మొదలుపెట్టిననాటి నుంచీ రిలయన్స్ పేచీ పెడుతూనే ఉంది. అక్కడ అనుకున్న స్థాయిలో గ్యాస్ లభ్యత లేదని, నష్టాలొస్తున్నాయని గొణుగుతూనే ఉంది. గ్యాస్ అమ్మకాలనుంచి వచ్చే లాభాల్లో తమ వాటా శాతాన్ని పెంచాలని కూడా కోరుతోంది. సహజవాయు ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గిస్తూ, బావుల్ని మూసేస్తూ ఆ సంస్థ ఒకరకంగా సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈపాటికి డీ-6 క్షేత్రంలో రోజుకు 70.39 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని 2006 నాటి క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అంచనావేయగా ఇప్పుడు అందులో సగం కూడా ఉత్పత్తి కావడం లేదు. గత నెలలో రోజుకి 33.89 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు మాత్రమే వెలికితీశారు.

సహజవాయు ఉత్పత్తిలో రిలయన్స్ చేస్తున్న ఈ మాయాజాలమంతా గ్యాస్ ధరను పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసమే. రిలయన్స్ అనుసరిస్తున్న ఈ వైఖరి వల్ల మన రాష్ట్రం బాగా నష్టపోతున్నది. మన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 2,495 మెగావాట్లు కాగా, రిలయన్స్ గ్యాస్ అందక 1,197 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విద్యుదుత్పత్తి అనుకున్నట్టుగా జరిగితే యూనిట్ రూ.1.85కే మనకు లభ్యమయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడది రూ.4.17 చొప్పున డిస్కంలు బయట కొనుగోలు చేయాల్సివస్తోంది. ఇందువల్ల అయ్యే రూ.1,630 కోట్ల అదనపు భారాన్ని జనంపైనే మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రిలయన్స్‌తో ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా గట్టిగా ప్రశ్నించినవారు లేరు. ఉత్పత్తి పెంచాలంటూ ఒత్తిడి చేసినవారు లేరు. అసలు గ్యాస్ అన్వేషణ కోసం ఆ సంస్థకు అప్పగించిన 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దశలవారీగా 3,827 కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా మొత్తం ప్రాంతాన్ని రిలయన్స్ తన అధీనంలోనే ఉంచుకుని తవ్వకాలు కానిస్తోందని గత ఏడాది కాగ్ బయటపెట్టింది. కేంద్ర చమురు శాఖ, హైడ్రోకార్బన్స్ డెరైక్టరేట్ జనరల్ ఆ సంస్థకు వంతపాడి ప్రభుత్వాదాయానికి లక్షల కోట్ల మేర గండికొట్టారని కుండబద్దలు కొట్టింది. రిలయన్స్ సేవ చేసి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక విసుగెత్తిపోయిందో ఏమో... తొలిసారి ఆ సంస్థకు గురువారంనాడు నోటీసులు జారీచేసింది. సహజ వాయు ఉత్పత్తి గణనీయంగా పడిపోవడానికి మీదే బాధ్యతని, అందువల్ల రూ.6,500 కోట్ల మేర రికవరీ చేసుకోవడానికి కంపెనీని అనుమతించబోమని చమురు మంత్రిత్వ శాఖ అందులో స్పష్టంచేసింది. ఒప్పందం ప్రకారం రిలయన్స్ తగినన్ని బావులు తవ్వకపోవడమే ఈ స్థితికి కారణమని చెప్పింది. ఇన్నేళ్లుగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని కేంద్రం ఇప్పటికైనా గ్రహించిందో లేదో అనుమానమే.

గ్యాస్ రేటుపై 2009లో కుదిరిన ఒప్పందం మేరకు ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర 4.2 డాలర్లు ఉంది. దీన్ని మళ్లీ అయిదేళ్ల తర్వాత... అంటే, 2014లో సవరించాలని ఆ ఒప్పందం నిర్దేశించింది. అయితే, ఈలోగా అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌కు డిమాండ్ పెరిగి ఒక ఎంబీటీయూకి 14 డాలర్ల వరకూ పెరిగింది. గెయిల్ తదితర సంస్థలు ఈ రేటు చెల్లించే గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. తాను సైతం ఇదే ధరను రాబట్టుకోవడం కోసమే రిలయన్స్ ఈ నాటకాలు ఆడుతోందన్నది బహిరంగ రహస్యం! దేశ ప్రజలందరికీ చెందవలసిన ఇంధన సంపదను ఇప్పటికే రకరకాల మార్గాలద్వారా కైంకర్యం చేసిన రిలయన్స్ ఇప్పుడు ధర పెంచుకోవడం ద్వారా మరింత పోగేసుకోవాలని చూస్తున్నదని స్పష్టంగానే అర్థమవుతోంది. ఆ ఒప్పందాన్ని సవరించేది లేదని ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న కేంద్రం... తన తిరస్కరణకూ, కేజీ బేసిన్‌లో ఉత్పత్తి మందగించడానికీ మధ్య సంబంధం ఉందని గ్రహించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

నేలతల్లి అందించిన అపురూపమైన నిక్షేపాలు దేశ సంపదగా ప్రజలందరికీ చెందవలసివుండగా, వారి తరఫున కేంద్ర ప్రభుత్వం దాని కేటాయింపులను నిర్దేశించ వలసివుండగా రిలయన్స్ అది తన సొంత జాగీరన్నట్టు వ్యవహరించడమేమిటని చనిపోయేవరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ సంపదంతటికీ యాజమాన్యం ప్రభుత్వానిదేనని, రిలయన్స్ కాంట్రాక్టరు మాత్రమేనని ఆయన పలు లేఖల్లో స్పష్టం చేశారు. అంబానీ సోదరులు గ్యాస్ సరఫరా విషయంలో సుప్రీంకోర్టు గడప తొక్కినప్పుడు ఆ సర్వోన్నత న్యాయస్థానం సైతం తన తీర్పులో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. రిలయన్స్‌పై వైఎస్ అప్రమత్తం చేసినప్పుడే కేంద్రం సక్రమంగా వ్యవహరించి ఉంటే ఖజానా కళకళలాడటంతోపాటు మన రాష్ట్రానికీ, మొత్తం దేశ ప్రజలకూ మేలు కలిగేది. పెట్టుబడుల రికవరీకి తమను అనుమతించకపోవడం ద్వారా ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని రిలయన్స్ ఆర్బిట్రేషన్ నోటీసు ఇచ్చిన ఆర్నెల్లకు మేల్కొన్న కేంద్రం చర్యలో చిత్తశుద్ధి పాలెంతో రాగల రోజులు రుజువు చేస్తాయి.
Share this article :

0 comments: