జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వేకోడూరులో రోడ్‌షో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వేకోడూరులో రోడ్‌షో

జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వేకోడూరులో రోడ్‌షో

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వేకోడూరులో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆయన రాక పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపుతుండగా కాంగ్రెస్, టీడీపీలలో ఆందోళన రేకెత్తిస్తోంది. 

రైల్వేకోడూరు, (కడప), న్యూస్‌లైన్ : రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు ముఖ్యమైన గ్రామాలలో జగన్ పర్యటన ఉండేలా ఏర్పాట్లను చే శారు. 

వైఎస్ జగన్ రాక పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. బొత్స సత్యనారాయణ రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజాపథంలో భాగంగా ఓసారి, ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్వేలిలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మరోసారి పాల్గొన్నారు. 

ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే సీఎం సీటు ఊడిపోవడం ఖాయమని అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో ఎలాగైనా వైఎస్‌ఆర్ జిల్లాలో పాగా వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చిట్వేలి పర్యటనలో ఆయన ప్రసంగాలకు కనీస స్పందన కరువైంది. కార్యకర్తల్లో ఏ మాత్రం ఆత్మస్థైర్యం నింపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా రైల్వేకోడూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ప్రచారంలో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజ 
రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలందరూ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను మారుమూల గ్రామాలకు, ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం చేయడంలో అన్నింటికంటే వైఎస్సార్ సీపీ ముందుంది. . నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వైఎస్ కొండారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, రూపానందరెడ్డిలతో పాటు పార్టీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు ప్రచారానికి నేతృత్వం వహిస్తున్నారు. వీరికి తోడుగా నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాక పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యం నింపనుంది. 

టీడీపీలో సమసిపోని విభేదాలు 
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో బాగా వెనకపడింది. తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వనాధ నాయుడు, కట్టా బాలాజీలు ఒక్కటైనట్లు పత్రికా ఫోజులు ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం విభేదాలు సమసి పోలేదు. దీంతో నియోజకవర్గంలో కేవలం అభ్యర్థి అజయ్‌బాబు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు.

కుమ్ములాటలలో కాంగ్రెస్ 
కాంగ్రెస్ అగ్రనేతలు రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించినా పార్టీ శ్రేణులను ఏకతాటిపై తేవడంలో విఫలమయ్యారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు ప్రచార బాధ్యతలను భుజాలకు ఎత్తుకుని అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే మంత్రి సీఆర్‌సీ, ఎంపీ సాయి ప్రతాప్ వర్గీయుల నుంచి ఏ మాత్రం సహకారం అందడం లేదు. నియోజకవర్గ సమన్వయ కమిటీ బాధ్యురాలుగా నియమితులైన మంత్రి గల్లా అరుణ కుమారి ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. 


Share this article :

0 comments: