సాక్షి మీద కుట్రపై పాత్రికేయ ప్రపంచం నిప్పులు.రాష్ట్రమంతటా జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి మీద కుట్రపై పాత్రికేయ ప్రపంచం నిప్పులు.రాష్ట్రమంతటా జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు

సాక్షి మీద కుట్రపై పాత్రికేయ ప్రపంచం నిప్పులు.రాష్ట్రమంతటా జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012


* నిరసనలతో కదం తొక్కిన జర్నలిస్టు లోకం-ర్యాలీలు, ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం
* సీబీఐ దుశ్చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు
* హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ ర్యాలీ, రాజ్‌భవన్ వద్ద ధర్నా
* సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు.. నల్ల బ్యాడ్జీలు, సంకెళ్లతో నిరసన
* ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం
* రాష్ట్రమంతటా జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు
* సీబీఐ దిష్టిబొమ్మలు దగ్ధం, కలెక్టర్లు, ఆర్‌డీఓలు, డీఆర్‌ఓలకు విజ్ఞప్తులు
* గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి వినూత్న నిరసనలు
* ‘సాక్షి’కి ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్,
* తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సంఘీభావం

హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్రికా స్వేచ్ఛను హరిస్తూ సీబీఐ చేపట్టిన దుశ్చర్యకు నిరసనగా రాజధాని హైదరాబాద్‌లో పాత్రికేయులు కదం తొక్కారు. జగన్ ఆస్తుల కేసుపై విచారణ సాకుతో ‘సాక్షి’ మీడియా గ్రూపునకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను సీబీఐ నిలిపివేయటాన్ని నిరసిస్తూ జర్నలిస్టు లోకం నిరసన గళం విప్పింది. సీబీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మిట్టమధ్యాహ్నం నిప్పులు చెరుగుతున్న మండుటెండను సైతం లెక్కచేయకుండా సాగిన ఈ ర్యాలీలో ‘సాక్షి’ మీడియా గ్రూపు ఉద్యోగులతో పాటు పలు జర్నలిస్టు సంఘాలకు చెందిన నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

‘విధేయత చూపలేదని విషం కుమ్మరిస్తారా?, కలంపై జులుం - సహించం సహించం, పత్రికలను అణగదొక్కటం - ప్రజల గొంతు నొక్కటమే, సాక్షి అంటే వ్యక్తి కాదు - కోటిన్నర మంది పాఠకుల మహాశక్తి, పగబట్టిన అధికారం - పత్రికా స్వేచ్ఛకు అపకారం, హద్దుమీరిన కుతంత్రాలు - అక్షరాలపై అంకుశాలు, అరచేతిని అడ్డుబెట్టి మనస్సాక్షిని అడ్డుకోలేరు’ అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులు చేబూని జర్నలిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేసిన సీబీఐ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీబీఐ డౌన్‌డౌన్ అంటూ మీడియా ప్రతినిధులు చేసిన నినాదాలు మిన్నంటాయి. ర్యాలీలో పాల్గొన్న వారంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీబీఐ నిర్ణయం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉందంటూ చేతుళ్లకు సంకెళ్లు వేసుకుని తమ నిరసన తెలియజేశారు.

అయితే.. జర్నలిస్టులను రాజ్‌భవన్ వరకు పోలీసులు అనుమతించకుండా లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద బ్యారికేడ్లు కట్టి నిలిపివేశారు. దీంతో జర్నలిస్టులు అక్కడే ఆందోళనకు దిగారు. దాదాపు గంటసేపు ధర్నా చేశారు. సీబీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి, ‘సాక్షి’ టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు జి.ఆంజనేయులు, హష్మి, సి.హెచ్.క్రాంతికిరణ్, పి.వి.శ్రీనివాస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, హైదరాబాద్ జర్నలిస్టు అసోసియేషన్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి, ‘సాక్షి’ టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ఎ.బి.కె.ప్రసాద్, హనుమంతరావు, జీ 24 గంటలు హెడ్ ఆర్.శైలేష్‌రెడ్డి తదితరులు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’ మీడియా విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, అబిడ్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎల్.బి.నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సన త్‌నగర్‌లలోనూ జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

రాష్ట్రమంతటా పాత్రికేయుల నిరసన
విశాఖలో ఏపీయూడబ్ల్యూజే, జాప్, ఏపీడబ్ల్యూజేఎఫ్‌లతోపాటు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీబీఐ డీఐజీ నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. విజయనగరంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో పాత్రికేయులు ధర్నాలు నిర్వహించాయి. కృష్ణా జిల్లా విజయవాడలో సాక్షి ఉద్యోగులు సిటీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అటు తెలంగాణవ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే, తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ ప్రెస్ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొండలో తెలంగాణ చౌక్ (పెద్ద గడియారం చౌరస్తా) వద్ద వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు చేతులకు సంకెళ్లతో అర్థనగ్నంగా నిరసన తెలిపారు.

వైఎస్‌ఆర్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఆజాద్ మైదానంలో సాక్షికి మద్దతుగా సభ నిర్వహించారు. సాక్షి అకౌంట్లను సీబీఐ స్తంభింపచేయటం తప్పని బాంబే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్బీర్‌సింగ్ ఖండించారు. రాజకీయాలకు, మీడియాకు ముడిపెట్టకూడదంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యక్తిగత కార్యదర్శి సురేష్ పాటోరే అన్నారు.

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆందోళనలు
సాక్షి పత్రిక, సాక్షి టివీల బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తూ సీబీఐ చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో రాజ్‌భవన్, అబిడ్స్ సర్కిల్, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, చార్మినార్, ఎల్.బి.నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.హాష్మి, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయు లు, ఉపాధ్యక్షులు ఎం.కోటేశ్వరరావు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె.మంజరి, అమరయ్య, మామిడి సోమయ్య, కరుణాకర్, ఎం.ఎ.రవూఫ్, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ (హెచ్‌యూజే) అధ్యక్షుడు పి.ఆనందం, కార్యదర్శి ఎ.నర్సింగరావు, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share this article :

0 comments: