భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం .‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం .‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదల

భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం .‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదల

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012


‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్ ఆస్తులు కూడా అటాచ్‌మెంట్ 
శుక్రవారం సాయంత్రం మూడు రహస్య జీవోలు విడుదల 
ఉత్తర్వుల తయారీ నుంచి సంతకాల దాకా అంతా గోప్యమే 
జీవోల్లోని సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
హోంమంత్రి ఇంటికెళ్లి సంతకం పెట్టించిన ప్రిన్సిపల్ సెక్రటరీ 
అంతా స్వయంగా దగ్గరుండి చూసుకున్న ముఖ్యమంత్రి 
‘సాక్షి’కి సత్వర న్యాయం అందకూడదనే వారాంతంలో విడుదల 
జీవోల ఆధారంగా అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి కోరనున్న సీబీఐ 
సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులనుబట్టి తదుపరి చర్యలు 
కోర్టు అనుమతించినా ‘సాక్షి’ రోజువారీ కార్యకలాపాలు యథాతథం
ఆస్తుల క్రయవిక్రయాలు, బదలాయింపులు మాత్రమే నిషేధం 
భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం 
{బిటిష్ పాలనలోనూ లేని నిర్ణయాలకు కిరణ్ సర్కారు ఓకే 
{పకటనల నుంచి అటాచ్‌మెంట్ వరకూ అన్నీ అర్ధరాత్రి చర్యలే

హైదరాబాద్, న్యూస్‌లైన్: కుట్రలు పదునెక్కుతున్నాయి. కుయుక్తులు తీవ్రమవుతున్నాయి. ‘సాక్షి’ గొంతులో కత్తులు దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్వతంత్ర భారత చరిత్రలోనే కాదు.. బ్రిటిష్ వారి హయాంలో సైతం జరగని ఘోరాలకు రాష్ట్రం వేదికవుతోంది. అర్ధరాత్రి జీవోలు, చీకటి జీవోల పంచన రహస్య జీవోలూ వచ్చి చేరుతున్నాయి. నల్ల జీవోతో ‘సాక్షి’కి ప్రకటనలివ్వటాన్ని నిషేధించి ఆర్థికంగా దెబ్బకొట్టాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. 24 గంటలు కూడా తిరక్కముందే మరో చీకటి జీవోను విడుదల చేసింది. ‘సాక్షి’ పత్రిక, టెలివిజన్ చానల్ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి సీబీఐకి అనుమతినిస్తూ శుక్రవారం రహస్య జీవోను విడుదల చేసింది. అంతే రహస్యంగా ప్రత్యేక దూత ద్వారా దీన్ని సీబీఐకి అందజేసింది. సీబీఐ ఇప్పుడు ఈ జీవో ఆధారంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (తన కస్టడీలోకి తీసుకోవటానికి) అనుమతివ్వాలని కోర్టును కోరుతుంది. అనుమతి ఇవ్వటమా.. నిరాకరించటమా.. అన్నది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు గనక అనుమతిస్తే.. ఆ తరవాత సీబీఐ తాను పేర్కొన్న ఈ మూడు సంస్థల ఆస్తుల్ని తన కస్టడీలోకి తీసుకుంటుంది. అంటే అప్పటి నుంచి వీటిని విక్రయించటం కానీ, వేరొకరికి బదలాయించటం కానీ వీలుపడదన్న మాట. అయితే ఇవి ఉద్యోగులతో, రోజువారీ కార్యకలాపాలతో నడిచే సంస్థలు కాబట్టి ఆ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నది న్యాయ నిపుణుల మాట. ‘‘అటాచ్‌మెంట్ అంటే.. ఆస్తుల బదిలీ, విక్రయాల నిషేధం మాత్రమే. సంస్థల రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

ఇప్పుడంత అవసరం ఉందా? 

నిజానికి ప్రభుత్వాధికారులు, పబ్లిక్ సర్వెంట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని విక్రయించేస్తారనో వేరొకరికి బదలాయిస్తారనో భయపడినప్పుడు.. ఒకరకమైన అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు మాత్రమే దర్యాప్తు సంస్థలు ఆ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (కస్టడీలోకి తీసుకోవటానికి) ప్రభుత్వం అనుమతిస్తూ ఉంటుంది. ‘సాక్షి’ విషయంలో అలాంటి పరిస్థితులేవీ లేవు. ‘సాక్షి’ ఆస్తుల్ని వేరొకరికి బదలాయిస్తారన్న భయాలూ లేవు. కానీ మీడియా గొంతు నొక్కాలనే ఏకైక ఉద్దేశంతో ఈ జీవోను జారీ చేశారన్నది సుస్పష్టం. ఎందుకంటే సీబీఐ కస్టడీకి ప్రభుత్వం అనుమతించిన మూడు సంస్థలూ మీడియాతో ముడిపడినవే. జగతి పబ్లికేషన్స్ సంస్థ ‘సాక్షి’ని ప్రచురించేది కాగా.. ఇందిరా టెలివిజన్ సంస్థ ‘సాక్షి’ చానల్‌ను నడుపుతోంది. ఇక ‘సాక్షి’ భవనాల యాజమాన్యం జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేతిలోనే ఉంది. అందుకే ఈ మూడు సంస్థల్నీ టార్గెట్ చేశారన్నది ఇక్కడ సుస్పష్టం. దీంతో పాటు ఎమ్మార్ కేసులో అరెస్టయిన సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌ల ఆస్తుల్ని కూడా సీబీఐ అటాచ్ చేసుకోవటానికి ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు సీబీఐ ఎస్‌పీ సి.హెచ్.వెంకటేష్‌కు అనుమతిస్తూ జీవో నంబర్లు 87, 88, 89 లతో విడుదల చేసిన ఈ ఉత్తర్వుల్ని ప్రభుత్వం తన వెబ్‌సైట్లో పెట్టింది కానీ.. వాటిని ‘కాన్ఫిడెన్షియల్’ అన్న కేటగిరీలో ఉంచింది. అంటే రహస్య జీవోలన్న మాట. వాటిలోని వివరాలు బయటకు చెప్పరు.

అన్నీ చీకటి చర్యలే... 
ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదలవుతున్నాయి. ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను ఈ నెల 8న సీబీఐ స్తంభింపజేయగా.. ఆ మర్నాడు అర్ధరాత్రి ‘సాక్షి’కి ప్రభుత్వం తరఫున ప్రకటనలన్నిటినీ నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మరుసటి రోజు ఉదయానికి ఈ విషయం బయటపడింది. ఇపుడు ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి త్వరలో జీవో రాబోతోందంటూ రెండు రోజులుగా రామోజీ పుత్రిక ‘ఈనాడు’, దాని తోకపత్రిక, తోక చానెల్ ఊదరగొట్టేస్తున్నాయి. మరో గంటలో జీవో.. మరికొద్ది నిమిషాల్లో జీవో అంటూ రెండ్రోజులుగా రాత్రీపగలూ ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ జీవోల నంబర్లను వెబ్‌సైట్లో పెట్టారు. జీవోల్లో ఏముందో మాత్రం తెలియనివ్వలేదు. ‘కాన్ఫిడెన్షియల్’ అని పెట్టేశారు. అసలు ఒక మీడియా సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి దర్యాప్తు సంస్థకు అనుమతివ్వటమనేది భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. మామూలుగా ఏసీబీ అవినీతి కేసుల్లో పట్టుబడిన అధికారుల ఆస్తుల విషయంలో ఇలాంటి అనుమతులిస్తూ ఉంటారు. ఆ అనుమతులిస్తూ విడుదల చేసే జీవోలను ఎన్నడూ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచరు. అంతా బహిరంగమే. కానీ ‘సాక్షి’ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముందెన్నడూ లేని సంప్రదాయాలకు తెర తీశారు. అత్యంత రహస్యంగా.. మంత్రులకు సైతం తెలియకుండా అత్యంత గోప్యంగా వ్యవహరించారు. హైడ్రామా నడిపించారు. అదెలాగంటే...

హోంమంత్రి ఇంటికి ప్రిన్సిపల్ సెక్రటరీ...

‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి కిరణ్‌తో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయేంద్ర పాల్ గురువారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమయ్యారు. అక్కడే ఈ జీవోలు ప్రాణం పోసుకున్నాయి. విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో కిందిస్థాయి ఉద్యోగుల జోక్యం ఏమాత్రం లేకుండా పాల్ స్వయంగా ఈ జీవో బాధ్యతలు చూశారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో అజయేంద్ర నేరుగా హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి నివాసానికి ఫైలు తీసుకుని వెళ్లారు. అప్పటికే డ్రాఫ్ట్ జీవోను తయారుచేసి, ఆ ఫైలుపై హోంమంత్రి సంతకం తీసుకున్నారు. తరవాత దానిపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కావాలంటే అదే రోజు రాత్రి జీవోలను విడుదల చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇక్కడ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించింది. గురువారం రాత్రి గనక జీవో వెలువడితే శుక్రవారం కోర్టులు పనిచేస్తాయి. ‘సాక్షి’ సంస్థలు న్యాయం కోసం తక్షణం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అందుకే శుక్రవారం సాయంత్రం కోర్టు సమయం పూర్తయ్యేవరకూ వేచి చూసి.. సాయంత్రం 7-8 గంటల మధ్యలో ఈ జీవోను విడుదల చేశారు. ప్రత్యేక దూత చేతికిచ్చి సీబీఐకి పంపించారు. శనివారం సీబీఐ దర్యాప్తు అధికారులు ఈ జీవోను కోర్టులో దాఖలు చేసి.. అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతారు. మర్నాడు ఆదివారం కనుక ‘సాక్షి’కి అప్పటికప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉండదు. ఇదీ... కిరణ్ కుట్ర. 

అధికారులంతా గప్‌చుప్... 

జీవోలు వెల్లడైనట్లు తెలిసినా.. అవి రహస్యం కేటగిరీలో ఉండటంతో వాటిలో ఏముందనేది వెల్లడించటానికి అధికారులు సైతం ఇష్టపడలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము వీటిపై మాట్లాడకూడదని కూడా కొందరు అధికారులు చెప్పారంటే పరిస్థితి తెలియకమానదు. నిజానికి సత్యం కంప్యూటర్స్ వ్యవహారం తీసుకున్నా.. కృషి బ్యాంక్ తదితర ఆర్ధిక నేరాలను చూసినా ఆయా కేసుల్లో సైతం అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోల పూర్తి వివరాలను వెబ్ సైట్లో పెట్టారు. కానీ.. సాక్షి మీడియా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించటం గమనార్హం. నిజానికి జీవోల వివరాలను బయటపెట్టకుండా జాగ్రత్త వహించిన ప్రభుత్వం వాటిని రామోజీ తోక పత్రికకు మాత్రం తెలియజేసింది. ఈ వార్తను లీక్ చేయటం ద్వారా సాక్షి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటమనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తున్నట్లు న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. 
Share this article :

0 comments: