జగన్ ప్రచారానికి అభ్యంతరమేంటి? సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రచారానికి అభ్యంతరమేంటి? సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు

జగన్ ప్రచారానికి అభ్యంతరమేంటి? సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

* మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యంలో భాగం
* ఎన్నికల్లో ప్రతి వ్యక్తికీ తన భావాలను ప్రజలకు చెప్పుకునే హక్కు ఉంది 
* జగన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు ఏం చెప్తున్నాయో చెప్పండి 
* జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులకు సూచించిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ 
* సీబీఐ కోర్టు రిమాండ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ 
* జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ అదే కోర్టులో సీబీఐ పిటిషన్లు 
* రెండింటినీ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి 
* కస్టడీ ఎన్ని రోజులు కావాలి.. ఎన్నికల షెడ్యూలు గురించి ఆరా తీసిన హైకోర్టు 
* జూన్ 10వ తేదీ వరకూ ప్రచారానికి అవకాశం ఉందన్న జగన్ తరఫు న్యాయవాది 
* జగన్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని, ప్రచారానికి అనుమతి అవసరం లేదన్న సీబీఐ
* జగన్ ఎంపీ అని, ఒక పార్టీకి అధ్యక్షుడని.. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవద్దనటం సరికాదన్న నిరంజన్‌రెడ్డి
* ఇరుపక్షాల పిటిషన్లలోని పూర్వాపరాల్లోకి వెళ్లబోనని న్యాయమూర్తి స్పష్టీకరణ 
* చట్ట నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలపాలని సూచన.. నేటి మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతినిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు మంగళవారం సీబీఐని ప్రశ్నించింది. ‘‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యంలో భాగం.. ఎన్నికల్లో ప్రతి వ్యక్తికీ తన భావాలను ప్రజలకు చెప్పుకునే హక్కు ఉంది’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇచ్చి, షరతులు విధించే విషయంలో చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరించాలని అటు సీబీఐ, ఇటు జగన్ తరఫు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం విచారణ చేపడతానని పేర్కొంది.

సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద తనకు రిమాండ్ విధిస్తూ సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వకపోవటాన్ని, సెక్షన్ 309 కింద రిమాండ్ విధించటాన్ని సవాల్ చేస్తూ సీబీఐ వేర్వేరుగా రెండు పిటిషన్లు వేసింది. వెకేషన్ కోర్టు కావటంతో పిటిషన్లు దాఖలు చేసేందుకు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో పిటిషన్ల దాఖలుకు ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టు అనుమతిని కోరారు. 

వీరి వినతిని పరిశీలించిన జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్.. అనుమతి ఇవ్వటంతో ఇరుపక్షాల వారూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఏ సమయంలో విచారించాలనే విషయం చర్చకు వచ్చింది. తాము బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం లేదని, సెక్షన్ 309 కింద జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని మాత్రమే కోరుతున్నామని జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ జోక్యం చేసుకుంటూ.. తాము కూడా పిటిషన్లు దాఖలు చేశామని, జగన్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 

దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఎన్నిరోజులు కస్టడీకి కావాలి.. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కస్టడీకి కావాలి.. 15 రోజులు సరిపోతుందా..?’ అని ప్రశ్నించారు. ఇంతేకాక ఉప ఎన్నికల షెడ్యూల్ గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. జూన్ 10వ తేదీ వరకు ప్రచారం చేసుకోవచ్చునని, 12వ తేదీ ఎన్నికలని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అయితే జగన్ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇస్తే అభ్యంతరం ఏమిటని న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చి, తరువాత కస్టడీకి ఇచ్చే విషయం ఆలోచిస్తానని పేర్కొన్నారు. దీనికి అశోక్‌భాన్ స్పందిస్తూ.. జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, ప్రచారానికి అనుమతించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

దీనిపై నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జగన్ పార్లమెంటు సభ్యుడని, ఓ పార్టీకి అధ్యక్షుడని, పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల్లో ప్రచారం చేసుకోరాదని చెప్పటం సరికాదని తేల్చి చెప్పారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని తాను సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై ఇరుపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లలోని పూర్వాపరాల జోలికి వెళ్లటం లేదని.. జగన్‌కు ఎన్నికల ప్రచారానికి అనుమతిస్తే ఉన్న అభ్యంతరం ఏమిటో, అందుకు సంబంధించి చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయో మాత్రమే చెప్పాలని ఇరు పక్షాల న్యాయవాదులను ఆదేశించారు. కేవలం ఈ ఒక్క అంశంపై మాత్రమే బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటానని తేల్చి చెప్పారు.
Share this article :

0 comments: