ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు!

ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు!

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012


ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా వెబ్‌కాస్టింగ్
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీకి రాష్ట్రం ప్రసిద్ధి చెందిందంటూ వ్యాఖ్య
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్

హైదరాబాద్, న్యూస్‌లైన్: నెల్లూరు లోక్‌సభతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డు లేదా బూత్ స్థాయి ఆఫీసర్లు పంపిణీ చేసిన ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్ ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హరిశంకర బ్రహ్మ తెలిపారు. ఇకపై పాన్‌కార్డు, రేషన్‌కార్డు వంటి ఇతర గుర్తింపు కార్డులు చెల్లవని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డుల పంపిణీ నూరు శాతం పూర్తయినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫొటో ఓటర్ స్లిప్‌తో పాటు గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లాలని, గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్ స్లిప్‌తోనైనా ఓటు వేయవచ్చునని వివరించారు.

పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున గుర్తింపు కార్డు లేనివారు బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేస్తే మంజూరు చేస్తారని తెలిపారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పోలింగ్ తేదీకి ముందుగానే బూత్‌స్థాయి ఆఫీసర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయిస్తామన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేయడమంటే ఓటర్లు అందరూ తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానించడమేనని విశ్లేషించారు. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్, డీజీపీ దినేశ్‌రెడ్డిలతో కలిసి బ్రహ్మ శుక్రవారం సచివాలయం నుంచి 12 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మతం, కులం పేరుతో ఎవరు ఎన్నికల ప్రచారం నిర్వహించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఫలానా మతానికి, కులానికి ఓటు వేయమని అడిగినా నేరమేనన్నారు. ఇలాంటి వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి ఈసీకి పంపించిన కేసులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియంతా వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు వేసినా బోగస్ ఓట్లు వేసినా వెబ్ కాస్టింగ్ ద్వారా కనుగొని అరెస్టు చేస్తామన్నారు. అలాంటి చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధికెక్కిందని బ్రహ్మ వ్యాఖ్యానించారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నవారి గురించి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రూ.15.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారని, మరో గంట అయితే అది రూ.16 కోట్లకు చేరవచ్చంటూ వాఖ్యానించారు.

రాష్ట్రంలో పెయిడ్ న్యూస్ ఎక్కువగా ఉందన్నారు. అభ్యర్థి వ్యయంలో 30 శాతం మీడియాకే వెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలోని చానల్స్ అన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్నాయన్నారు. సాధారణంగా మీడియాలో ఇస్తున్న ప్రకటనలను, చేస్తున్న ప్రసారాలను అంచనా వేస్తామని, ఏదో ఒక అభ్యర్థికి అనుకూలంగా ఎక్కువగా ప్రసారం చేస్తే ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో చేస్తామని బ్రహ్మ వివరించారు. మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
రెడీ అవుతున్న భావితరం ఈవీఎంలు: భావితరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) ఈసీఐఎల్‌లో తయారు చేస్తున్నారని బ్రహ్మ చెప్పారు. ఆ ఈవీఎంల తయారీ ప్రక్రియను శనివారం పరిశీలించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఈవీఎంల ద్వారా ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి వేస్తున్నామని, అయితే ఆ ఓటు తాము వేసిన వారికి పడిందో లేదో అనే అనుమానం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఓటు ఎవరికి పడిందో కూడా కనిపించే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారు చేస్తున్నారన్నారు. మనం ఎవరికి ఓటు వేశామో ఆ పార్టీ గుర్తు ఓటింగ్ యంత్రంపై డిస్‌ప్లే అవుతుందని, ఆ మేరకు స్లిప్ కూడా వస్తుందన్నారు. అయితే ఆ స్లిప్ ఓటర్‌కు అందుబాటులో ఉండదన్నారు. అన్నివిధాలుగా పరీక్షించాకే వీటిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు.

జీవోలు కాన్ఫిడెన్షియలా?: జీవో అంటేనే పబ్లిక్ డాక్యుమెంట్ అని అలాంటి వాటిని కాన్ఫిడెన్షియల్ అని ఎలా అంటారని బ్రహ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలను కాన్ఫిడెన్షియల్ పేరుతో బయటకు తెలియనివ్వడం లేదన్న ఒక విలేకరి ప్రశ్నకు బ్రహ్మ స్పందించారు. బదిలీలు చేయడం, పోస్టింగ్స్ ఇవ్వడం, కొత్త పథకాలు, నిధుల మంజూరులాంటివి చేస్తూ జీవోలు ఇస్తే కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. అలాంటి కాన్ఫిడెన్షియల్ జీవోలను మీడియా వెలుగులోకి తెస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Share this article :

0 comments: