పోలీస్ ఓవరాక్షన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీస్ ఓవరాక్షన్!

పోలీస్ ఓవరాక్షన్!

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి నగర పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నగర జీవికి నరకయాతన చూపారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆటంకాలు కల్పించి నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. ఇదే సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుల్ని, కార్యకర్తలను వేధింపులకు గురిచేశారు. ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడ్డారు.

సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రాజ్‌భవన్ సమీపంలో ఉన్న దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సీబీఐ విచారణకు జగన్ హాజరవుతున్న నేపథ్యంలో మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ స్టాట్యూ మధ్య శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పరిమిత ట్రాఫిక్‌కు అనుమతిస్తామంటూ గురువారం రాత్రి పోలీసులు ప్రకటించారు. అయితే తెల్లారేసరికి ఖైరతాబాద్ చౌరస్తా, నెక్లెస్‌రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద బారికేడ్లు, మధ్యలో బార్డ్బ్‌వైర్ ఏర్పాటు చేసి ఆ మార్గాలను పూర్తిగా మూసేశారు. దీంతో ఆ రూట్‌లో ప్రయాణించాల్సిన వాహనాలు ఇతర రోడ్లలోకి మళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. విశాలమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనచోదకులు నరకం చవిచూశారు. పాదచారులను సైతం అనుమతించకపోవడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆస్పత్రులకు వెళ్తున్న వాహనాలను సైతం అడ్డుకోవడంతో రోగులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.

క్యాడర్‌కు బెదిరింపులు..
పోలీసులు సృష్టించిన ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలో కొన్ని అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు బస్సుల దహనాలకు పాల్పడిన నేపథ్యంలో... ఈ ఘటనలకు కారకుల్ని గుర్తించే నెపంతో పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్నే టార్గెట్‌గా చేసుకున్నారు. స్థానికంగా ఉన్నవారికి, సంబంధీకులకు ఫోన్లు చేస్తూ, ఇళ్లకు వెళ్తూ పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా వేధిస్తున్నారు. రాజ్‌భవన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం కార్యకర్తలతోపాటు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ పోలీసులు విడిచిపెట్టకుండా తమ ప్రతాపం చూపారు. శనివారం సైతం జగన్ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు వస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహంపై నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

గోల్కొండ ఠాణాకు వైఎస్సార్ సీపీ నాయకులు
గోల్కొండ, న్యూస్‌లైన్: శుక్రవారం సాయంత్రం గోల్కొండ పోలీస్‌స్టేషన్ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. విద్యార్థులైన తమను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి విచక్షణా రహితంగా కొట్టడం, బూతులు తిట్టడం అమానుషమని అసలు తమను అరెస్ట్ చేయడమే అక్రమమని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ నేమూరి నవీన్‌గౌడ్ అన్నారు. ఓ ప్రమాదంలో గాయపడి తన తొడలో రాడ్డు ఉన్న తనను పంజగుట్ట ఏసీపీ తన తొడపై బూటుకాలుతో తన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టకపోయినా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు ఠాకూర్ అమిత్‌సింగ్, నగర స్టీరింగ్ కమిటీ సభ్యుడు తైక్వాండో రమేశ్‌లతోపాటు మరో 28 మంది ఉన్నారు.
Share this article :

0 comments: