చెడిపోయిన రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చేందుకు ఉప ఎన్నికల్లో మీ ఓటే పునాది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెడిపోయిన రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చేందుకు ఉప ఎన్నికల్లో మీ ఓటే పునాది

చెడిపోయిన రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చేందుకు ఉప ఎన్నికల్లో మీ ఓటే పునాది

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

* కాంగ్రెస్‌తో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9ల కుమ్మక్కు
* రాష్ట్రంలో మూడో వ్యక్తి.. మూడో పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు
* రాజకీయంగా నన్ను అణగదొక్కడానికి వారంతా ఏకమై సీబీఐని ప్రయోగిస్తున్నారు
* చెడిపోయిన రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చేందుకు ఉప ఎన్నికల్లో మీ ఓటే పునాది

అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్రంలో మూడో పార్టీ.. మూడో వ్యక్తి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తా లేక.. నన్ను అణగదొక్కడానికి సీబీఐని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. నిజాలను సమాధి చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ టీవీలను మూసేయించాలని సీబీఐని ఎగదోస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రోజు రోజుకు దిగజారుతోన్న రాజకీయ విలువలను కాపాడటానికి.. విలువలతో కూడిన రాజకీయాలను వెనక్కి తేవడానికి ఉప ఎన్నికల్లో మీ ఓటే పునాది కావాలని ఆయన పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటే రాబోయే మహా సంగ్రామానికి నాంది అవుతుందన్నారు. 

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరఫున వైఎస్ జగన్ బుధవారం ప్రచారం నిర్వహించారు. బొమ్మనహాళ్, డీహీరేహాళ్ మండలాల్లో పర్యటించారు. గోనేహాళ్, సింగేపల్లి, శ్రీధరగట్ట, ఉప్పరహాళ్, శ్రీరంగాపురం, ఉద్దేహాళ్, ఉంతకల్లు, బొమ్మనహాళ్, కురవళ్లి, చంద్రగిరి, సిద్ధరాంపురం, నేమకల్లు, డీహీరేహాళ్‌లో రోడ్‌షోలు నిర్వహించి.. ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

సీబీఐని అస్త్రంగా చేసుకుని..
ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు దిగజారిపోయాయి. ఎంతగా దిగజారాయీ అంటే.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో అధికారపక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై పాలన సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి కోర్టులకు వెళుతున్నారు.. వెళ్లి కలిసి కేసులు వేస్తున్నారు. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఐని వాడుకుంటున్నారు. వారి కుమ్మక్కు ఎంతలా ఉందో ఓ ఉదాహరణ చెప్తాను. రాష్ట్రంలో రెండు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి.. వేలాది మందికి ఉపాధి కల్పించడానికి రెండు పెద్ద సంస్థలకు వైఎస్ 75 ఎకరాల చొప్పున భూమిని లీజుకు ఇచ్చారు. ఆయన ఎకరం రూ.15 లక్షల విలువైన భూమిని రూ.8 లక్షలకే ఇచ్చారని వైఎస్‌ను సీబీఐ తప్పుపడుతోంది. కానీ.. గుజరాత్, తమిళనాడుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూములు ఇస్తామంటున్నాయి. 

ఇది సీబీఐకి కన్పించదు. రాష్ట్రంలో ఎమ్మార్ కేసును కూడా సీబీఐ విచారిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున విలాసవంతమైన బంగ్లాలు, గోల్ఫ్‌కోర్సు, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించడానికి 535 ఎకరాల భూమిని ఎమ్మార్‌కు చంద్రబాబు ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4 కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.29 లక్షలకే అప్పగించేశారు. అదీ పరిశ్రమలు స్థాపించడానికీ కాదు.. వేలాది మందికి ఉపాధి కల్పించడానికీ కాదు.. కానీ.. సీబీఐకి ఇది తప్పుగా కన్పించదు. ఎందుకయ్యా ఇలా చేశావూ అని చంద్రబాబును సీబీఐ అడగనైనా అడగదు.

మూడో వ్యక్తి ఉండకూడదా?
చంద్రబాబు, కాంగ్రెస్‌ల కుమ్మక్కు రాజకీయాలు ఎంతలా ఉన్నాయంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే ఉండాలట. మూడో వ్యక్తి గానీ.. మూడో పార్టీగానీ ఉండనే కూడదట. కాంగ్రెస్‌పై ప్రజలకు విసుగొస్తే టీడీపీకి.. టీడీపీపై విసుగొస్తే కాంగ్రెస్‌కు మాత్రమే ఓటేయాలట. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తా లేక.. ఎలాగైనా అణగదొక్కడానికి సీబీఐని అస్త్రంగా వాడుకుంటున్నారు. ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ టీవీ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.. సాక్షి పత్రికను, సాక్షి టీవీని మూసివేయిస్తారట.. అలా మూసివేయిస్తే.. అప్పుడు ‘ఈనాడు’ రాసిందే రాత.. ఆంధ్రజ్యోతి గీసిందే గీత.. టీవీ9 చూపించిందే నిజం అని ప్రజలను నమ్మించేందుకు వీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు. 

‘సాక్షి’ని మూసేయిస్తే వేరే మాటే జనానికి తెలియదు.. వేరే ఆలోచనే రాదు... ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియకుండా చేయాలని పన్నాగం పన్నుతున్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా లేని విధంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె ఏకమై తుపాన్‌గా మారుతుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్, టీడీపీలు డిపాజిట్లు కూడా రాకుండా కొట్టుకుపోతాయి.

వరి వేయడం కంటే ఉరే మేలంటున్నారు..
వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో ఏ రైతు కంట కూడా కన్నీరు కన్పించేది కాదు.. కానీ.. ఇప్పుడు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయం చేయడంకన్నా ఉరి వేసుకోవడం మేలు అని రైతులు భావించే స్థితికి పరిస్థితులు దిగజారాయి. గతేడాది రాష్ట్రంలో 858 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడిచిపోయినా ఇప్పటీకీ రైతన్నకు దమ్మిడీ కూడా పరిహారం అందించిన పాపాన పోలేదు. కష్టాల్లో ఉన్న రైతులు.. అక్కా చెల్లెళ్లకు గిట్టుబాటయ్యేలా కూలీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. అక్కా చెల్లెళ్లకు కనీస వేతనం రూ.137 ఇవ్వాలని చెబుతోన్న ప్రభుత్వమే.. క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్టు పనులిచ్చి రూ.60 నుంచి రూ.70 కూడా కూలిగా ఇవ్వడం లేదు.

ఆరోగ్యశ్రీని కుదించారు
పేద ప్రజలకు ఆరోగ్యంపై భరోసా ఇచ్చేలా వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోంది. దాదాపు 135 రోగాలను ఆ పథకం నుంచి తొలగించారు. మూగ, చెవిటి పిల్లలకు సంజీవని వంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్‌సర్జరీకి దాదాపు రూ.6 లక్షలవుతుంది. పిల్లలకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ సర్జరీ ఉచితంగా చేయించుకునే అవకాశం వైఎస్ కల్పించారు. కానీ.. ఇప్పుడు రెండేళ్లు దాటితే ఆ ఆపరేషన్ చెయ్యం పో.. అంటోందీ ప్రభుత్వం. యాక్సిడెంట్ అయినా గుండెపోటు వచ్చినా 108 నంబర్‌కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోపే అంబులెన్స్ వచ్చి ఆ పేద రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఉచితంగా వైద్యం చేయించి, చిరునవ్వుతో ఆ రోగిని ఇంటికి తిరిగి పంపాలని వైఎస్ ఓ స్వప్నం చూశారు. కానీ.. ఇప్పుడు 108 అంబులెన్స్‌లు సగానికి సగం రిపేరు షెడ్లలో ఉన్నాయి. 

ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారపక్షం పట్టించుకోదు. పోనీ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందేమోనని ప్రజలు ఆశతో ప్రధాన ప్రతిపక్షం వైపు చూస్తే.. చంద్రబాబు అధికారపక్షంతో కుమ్మక్కై ప్రజలను గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసి ఎమ్మెల్యే పదవులను సైతం త్యాగం చేసిన ఆ 17 మందికీ నేను సెల్యూట్ చేస్తున్నా.

మా ఊరికి రావాల్సిందే...
రాయదుర్గం నియోజకవర్గంలో గోనేహాళ్ నుంచి రెండో రోజు ప్రచారం ప్రారంభించిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా అభిమానం అడ్డుతగిలింది. తమ గ్రామాలకు రావాలని, లేదంటే కదలనీయబోమంటూ సీతారామ క్యాంప్, సింగేపల్లి, శ్రీధరగట్ట, ఉప్పరహాళ్ ప్రజలు జగన్ కాన్వాయ్‌ను గోనేహాళ్‌లో అడ్డగించారు. ఆ అభిమానుల అనురాగానికి తలొగ్గిన జగన్.. ప్రచార షెడ్యూలులో లేకున్నా ఆ గ్రామాలకు వెళ్లారు. దాంతో.. ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

అనంతరం ఉద్దేహాళ్‌లో ప్రచారం పూర్తిచేసుకుని బొమ్మనహాళ్‌కు వెళ్తున్న జగన్ కాన్వాయ్‌ని టీడీపీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి సొంతూరైన ఉంతకల్లు ప్రజలు తమ గ్రామానికి రావాలని అడ్డగించారు. వారి కోరిక మేరకు ఆయన ఉంతకల్లుకు వెళ్లడంతో ప్రజల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. బొమ్మనహాళ్ ప్రచారం పూర్తిచేసుకుని.. నేమకల్లు వెళ్లడానికి సిద్ధమైన జగన్ కాన్వాయ్‌ను కురవళ్లి, చంద్రగిరి, సిద్ధరాంపురం ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఆయన షెడ్యూల్‌లో లేకున్నా ఆ గ్రామాలకు వెళ్లారు.
Share this article :

0 comments: