అడుగడుగునా టీటీడీ వివక్ష.అయినా భక్తిప్రపత్తులతో దర్శించుకున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా టీటీడీ వివక్ష.అయినా భక్తిప్రపత్తులతో దర్శించుకున్న జగన్

అడుగడుగునా టీటీడీ వివక్ష.అయినా భక్తిప్రపత్తులతో దర్శించుకున్న జగన్

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012



తిరుమల, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అడుగడుగునా వివక్ష ప్రదర్శించినా, భక్తి విశ్వాసాలతో సుమారు గంటన్నరకుపైగా వేచి ఉండి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7.20 గంటలకు ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. అక్కడి అధికారులు వీఐపీలను అనుమతించే 17వ కంపార్ట్‌మెంట్‌కు తాళం వేశారు. పక్కనే మరో కంపార్ట్‌మెంట్‌లో ఇతర భక్తులతో కలసి జగన్ అరగంటపాటు వేచి ఉన్నాక ఆలయంలోకి వె ళ్లారు. సహస్త్రకలశాభిషేకం, ఇతర మఠాధిపతుల దర్శనం కారణంగా రంగనాయక మంటపంలోనే మరో గంటన్నరపాటు వేచి చూశారు. 

ఆర్జిత సేవ భక్తులు, టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు రౌతు సూర్యప్రకాశ్‌రావు, పి.రాజేశ్వరిలతో సుమారు మరో 200 మంది భక్తులు దర్శనం చేసుకున్నాక 9 గంటలకు జగన్ లోనికి వెళ్లారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా తదితరులతో కలసి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి గరుడాళ్వార్ సన్నిధికి చేరుకున్నారు. అప్పటికే వీఐపీ దర్శనానికి రద్దీ ఉండటంతో అక్కడ మరో 15 నిమిషాలు వేచి ఉన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. 

భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఆశీస్సులందుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం భాష్యకార్లవారు, యోగనరసింహస్వామిలను దర్శించుకున్నారు. ఆ తర్వాత అద్దాల మంటపం వద్ద జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టువస్త్రం, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వాటిని స్వీకరించి, ఆలయాధికారులు, అర్చకులకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు రౌతు సూర్యప్రకాశరావు, పి.రాజేశ్వరి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అడుగడుగునా టీటీడీ వివక్ష
భక్తి విశ్వాసాలతో శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్ పట్ల టీటీడీ అడుగడుగునా వివక్ష చూపింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు వారి భార్యలకు కూడా టీటీడీ పాలక వర్గం, అధికారులు సాగిలపడి మరీ దగ్గరుండి దర్శనాలు చేయించడం బహిరంగ రహస్యమే. కానీ రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించి, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి క్రమం తప్పకుండా భక్తిపూర్వకంగా పట్టువస్త్రాలు సమర్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడైన జగన్‌కు మాత్రం వివక్ష ఎదురైంది. ప్రొటోకాల్ హోదాలోనే తిరుమలకు వచ్చినా, ఆయనకు కనీసం ఆహ్వానం పలికే అధికారి కూడా కరువయ్యారు! దర్శనానికి సంబంధించి సమాచారం అందించే అధికారిని కూడా నియమించలేదు. దర్శనంపై అధికారుల నుంచి కచ్చితమైన సమాచారం లేకపోయింది. 

దాంతో, ఉదయం 8.30 తర్వాత శ్రీవారి దర్శనం మొదలైతే, జగన్ 7.20కే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. అక్కడ వీఐపీలు వెళ్లే 17వ కంపార్ట్‌మెంట్‌కు అధికారులు ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఆయన ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దాంతో పక్క కంపార్ట్‌మెంట్‌లో ఇతర భక్తులతో కలసి జగన్ అరగంట పాటు వేచి ఉన్నారు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అధికారులకు ప్రొటోకాల్ నిబంధనలను గుర్తు చేయడంతో అరగంట తర్వాత 17వ కంపార్ట్‌మెంట్ తాళం తెరిచారు. లోనికి వెళ్లిన జగన్, ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి ఇతర భక్తులతో కలసి గంటన్నర పాటు అక్కడే వేచి ఉన్నారు. 

తర్వాత ప్రొటోకాల్ పరిధిలో లేని వందలాది మందిని దర్శనానికి అనుమతించాక, ఎట్టకేలకు ఉదయం 9 గంటలకు జగన్‌కు అవకాశం కల్పించారు. ఇదంతా అధికార పక్షం ఆదేశాల మేరకే టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. అడుగడుగునా ఇలా వివక్షే ఎదురైన జగన్ మోముపై భక్తిపూర్వక చిరునవ్వే కనిపించింది.

భక్తుడిని వారించిన జగన్
శ్రీవారిని దర్శించుకుని వెలుపల వచ్చిన జగన్‌ను సమీపంగా చూసిన బయటి క్యూలోని ఓ భక్తుడు అభిమానాన్ని అణచుకోలేక ‘జై జగన్’ అంటూ అరిచాడు. దాంతో ‘వద్ద’ంటూ ఆయన్ను వారించారు.
Share this article :

0 comments: