రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నాయకుల విగ్రహాలకు జల, క్షీరాభిషేకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నాయకుల విగ్రహాలకు జల, క్షీరాభిషేకాలు

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నాయకుల విగ్రహాలకు జల, క్షీరాభిషేకాలు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012



న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పత్రికాస్వేచ్ఛను హరించేలా సాక్షి పత్రిక, టెలివిజన్‌లపై సీబీఐ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగుతున్న నిరసనలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. పాలకుల కళ్లు తెరిపించి పత్రికాస్వేచ్ఛను బతికించాలని కోరుతూ జిల్లాల్లో మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు ఫూలే ఇతర జాతీయ నాయకుల విగ్రహాలకు నీళ్లు, పాలతో అభిషేకాలు నిర్వహించారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. 

అలాగే, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు పోస్టుకార్డులు, టెలిగ్రామ్‌లు పంపారు. కృష్ణాజిల్లా మైలవరం మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు జర్నలిస్టులు గాంధీగిరీ పద్ధతిలో నిరసన తెలిపి వినతిపత్రాన్ని ఇచ్చారు. 

అలాగే, నిజామాబాద్ జిల్లాకు వచ్చిన దామోదరకు గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా సర్కారు చేపట్టిన దుశ్చర్యలకు స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా తగరపువలసలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో 24గంటల నిరాహార దీక్షను చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ సిబ్బంది ఆర్టీసీ బస్సులను శుభ్రపరిచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రి, నెల్లూరుల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అనంతపురంలో పాత్రికేయులు మౌన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన పెరుమాళ్ల ఆంథోనీ అనే వ్యక్తి ‘సాక్షి’పై జరుగుతున్న దాడులకు నిరసనగా శిరోముండనం చేయించుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరులో బోయ మశయ్య, నవనీతం అనే ఇద్దరు యువకులు బీఎస్‌ఎన్‌ఎల్ టవరెక్కారు. 

జగన్‌పై కోపంతో ‘సాక్షి’పై వేధింపులు :హరీశ్వర్‌రెడ్డి 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న కోపంతో సీబీఐని అడ్డుపెట్టుకుని, లక్షల మంది అభిమాన పత్రికగా ఉన్న సాక్షిని వేధించటం ఏంటని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాక్షిపై సర్కారు తీరుకు వ్యతిరేకంగా పరిగిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ తప్పుపడుతున్న జీవోలను విడుదల చేసిన మంత్రులను ఎందుకు అరెస్టు చేయటం లేదని నిలదీశారు. ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సాక్షిపై కిరణ్ సర్కారు వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని దాదాపు రూఢీ కావటంతో కాంగ్రెస్ పెద ్దలు ఇలాంటి దమనకాండకు పాల్పడుతున్నారన్నారు. గతంలో పత్రికల గొంతునొక్కినందుకు ఇందిరాగాంధీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో సాక్షి విషయంలో కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందన్నారు. 

సీఎం రోడ్‌షోలో పాత్రికేయుల నిరసన 

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనంతపురంలో నిర్వహించిన రోడ్‌షోలో పాత్రికేయులు తమ నిరసన తెలిపారు. ‘సాక్షి’ పట్ల ప్రభుత్వం, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ పలువురు పాత్రికేయులు ప్లకార్డులు చేతపట్టి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిరసన గళం వినిపించారు. ఇందులో ‘సాక్షి’ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 
Share this article :

0 comments: