రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయండి

రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయండి

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

* ఎంపీగా సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ కోర్టు అంటోంది
* ఎంపీగా ఉన్నాను కాబట్టి ఎప్పటికీ రిమాండ్‌లో ఉండాలనడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం 
* సీబీఐ ఇప్పటికే 3చార్జిషీట్లు దాఖలు చేసింది
* ఆధారాలన్నీ వారి వద్ద భద్రంగా ఉన్నాయి
* సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదు
* నేను ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.. వెంటనే విడుదల చేయండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనకు జూన్ 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి, వెంటనే తనను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27న తనను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారని, ఈ సందర్భంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, ఆ హోదాతో సాక్షులను ప్రభావితం చేయవచ్చునని, అందువల్ల రిమాండ్‌కు పంపుతున్నట్లు సీబీఐ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొందని, అయితే తనను రిమాండ్‌లో ఉంచేందుకు ఇది ఎంతమాత్రం సహేతుకమైన కారణం కాదని ఆయన వివరించారు. ఒక వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపేందుకు కోర్టు చెప్పిన కారణం సరైంది కాదని పేర్కొన్నారు. తనకున్న హోదాతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తే తప్ప... ఆ వ్యక్తికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడం సరికాదన్నారు. 

తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యానని, తరువాత కూడా గెలుస్తానన్న విశ్వాసం ఉందని, ఎంపీగా ఉన్నాను కాబట్టి ఎప్పటికీ రిమాండ్‌లో ఉండాలనడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని వివరించారు. ఎంపీ హోదాలో సాక్ష్యాలను తారుమారు చేస్తానని సీబీఐ కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘సీబీఐ ఇప్పటికే ఈ కేసులో మొత్తం మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం ఆధారాలన్నీ వారి వద్దే పదిలంగా ఉన్నాయి. అలాంటప్పుడు నేను సాక్ష్యాలను ఎలా తారుమారు చేయగలను’’ అని జగన్ తన పిటిషన్‌లో ప్రశ్నించారు. సాక్ష్యాల తారుమారు ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందని, అందువల్ల తనను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విచారణ పేరుతో సమన్లు జారీ చేసి, తరువాత అరెస్ట్ చేసిన విధానాన్ని గమనిస్తే... సీబీఐ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, తనను నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్‌కు పంపిందని, అందువల్ల సీబీఐ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసి వెంటనే విడుదల చేయాలని కోర్టును కోరారు. 

సీబీఐ కూడా ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసింది. జగన్‌ను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒకటి, జగన్‌ను సెక్షన్ 309 కింద జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ మరొక పిటిషన్ దాఖలు చేసింది. జగన్ పిటిషన్‌తోపాటు ఈ రెండు పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించనుంది.
Share this article :

0 comments: