హత్య అవసరం ఎవరికుంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్య అవసరం ఎవరికుంది?

హత్య అవసరం ఎవరికుంది?

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012


ఆద్యంతం అనుమానాస్పదంగా సూరి హత్య కేసు దర్యాప్తు
చంపే అవసరం ఎవరికుందన్న కీలక కోణాన్ని అసలే పట్టించుకోని సీఐడీ
సెటిల్మెంట్లే హత్యకు దారి తీశాయని ఇప్పటికే ధ్రువీకరించిన దర్యాప్తు సంస్థ
అయినా వాటి లబ్ధిదారులపై దృష్టే పెట్టకపోవడంపై సర్వత్రా అనుమానాలు
సూరి పేరు చెప్పి భానుతో సెటిల్మెంట్లకు పాల్పడ్డ సింగనమల, కల్యాణ్
‘జయభేరి’ మురళీమోహన్‌తో వారిద్దరిదీ విడదీయరాని బంధం
కలసికట్టుగా భూ లావాదేవీలు,పలు రియల్టీ వెంచర్లు చేసిన త్రయం
చంద్రబాబుకు మురళీమోహన్ ‘రియల్’ బినామీ అన్నది బహిరంగ రహస్యమే

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మద్దెలచెర్వు సూరి హత్య కేసును విచారిస్తున్న సీఐడీ కూడా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ దార్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సూరిని తానే హతమార్చినట్లు నిందితుడు భాను కిరణ్ అంగీకరించాడని ధ్రువీకరిస్తున్న సీఐడీ.. ఆ హత్య వల్ల ఎవరికి లాభం, అసలు భాను ద్వారా ఈ హత్య చేయించాల్సిన అవసరం ఎవరికుంది, ఇన్నాళ్లూ అతను పోలీసులకు దొరక్కపోవడం వెనక ఎవరి సహకారముందన్న కీలకమైన అంశాలను పట్టించుకోవటం లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే సూరి జైల్లో ఉండగా అతని పేరు చెప్పుకుని, భాను ద్వారా పలువురిని బెదిరించి, సెటిల్‌మెంట్లు చేయించి, రియల్ ఎస్టేట్‌దందాలు నడిపించారని ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై.. వారి వెనకుండి ఈ సెటిల్‌మెంట్ల ద్వారా బాగా లబ్ధి పొందిన వారిపై సీఐడీ దృష్టి పెట్టిన దాఖలాలే కన్పించటం లేదు. భాను అరెస్టయినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఎంతసేపూ భానుతో కలిసి సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలెదుర్కొన్న దంతులూరి కృష్ణ పేరు వినిపిస్తోందే తప్ప, సూరి హత్య జరిగిన వెంటనే వినపడ్డ పేర్లు ఇప్పుడు తెర వెనక్కు వెళ్లిపోవటం పలు అనుమానాలకు ఆస్కారమిస్తోంది. 

సినీ నిర్మాతలు సింగనమల రమేశ్, చిల్లర కల్యాణ్ భాను ద్వారా సూరి పేరు చెప్పుకుని పలు సెటిల్‌మెంట్లు చేయించారని, చివరికి ఫైనాన్స్ చేసిన వారిని కూడా బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆరోపణలతో సింగనమలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. అరెస్టు కూడా చేసి బెయిలుపై విడిచిపెట్టారు. భాను సెటిల్‌మెంట్లకు సంబంధించిన ఆరోపణల్లో కల్యాణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ చిత్రంగా భాను అరెస్టయిన దగ్గర్నుంచి మాత్రం ఒక్క కృష్ణ పేరు తప్ప మరెవరి పేరూ బయటికే రాని వైనంపై పోలీసు వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు చంద్రబాబు సహా కాంగ్రెస్‌కు చెందిన వి.హన్మంతరావు వంటి జగన్ వ్యతిరేకులంతా దంతలూరి కృష్ణ పేరు పట్టుకుని జగన్‌నే టార్గెట్ చేస్తుండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరుగుతున్నట్టు స్వయానా పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం!

జయభేరితో కల్యాణ్, రమేష్ లావాదేవీలు?

జైల్లో ఉన్న సూరి పేరు చెప్పుకుని భాను ద్వారా సెటిల్‌మెంట్లు చేయించినట్టు ఆరోపణలెదుర్కొన్న వారిలో ముఖ్యుడు సింగనమల రమేశ్. తర్వాతి స్థానం చిల్లర కల్యాణ్‌ది. వీళ్లిద్దరికీ జయభేరి ప్రాపర్టీస్, దాని అధిపతి మురళీమోహన్‌తో విడదీయరాని సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే. పలు సందర్భాల్లో జయభేరి ఏజెంటుగా కూడా సింగనమల వ్యవహరించారు. తన భార్యతో కలిసి ఆ సంస్థలో భాగస్వామిగా కొన్ని వెంచర్లనూ చేపట్టారు. వీళ్లు కలిసికట్టుగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందారు! కల్యాణ్ కూడా జయభేరితో పలు ఒప్పందాలు చేసుకున్నారు. అంతేగాక తన సోదరుడు వెంకటేశ్వరరావునూ ఈ చక్రంలోకి దించారు. వీటన్నిటికీ తోడు.. సింగనమల, కల్యాణ్ ప్రభృతులు తొలుత వివాదాస్పద భూముల్ని కొనేవారని, వాటిపై గొడవలొస్తే భాను ద్వారా సెటిల్ చేసుకునేవారని, తరవాత వాటిని జయభేరికి విక్రయించేవారని కూడా ఆరోపణలొచ్చాయి. భానును వీటన్నింటిపైనా సీఐడీ గట్టిగా విచారిస్తే సూరి హత్యకు కారణాలు కూడా వెలుగులోకి వస్తాయనే వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దాని ద్వారా ఎవరెంత లబ్ధి పొందారనేది తేలితేనే హత్యకు కారణాలు కూడా వెల్లడవుతాయన్నది వారి వాదన.

హత్య అవసరం ఎవరికుంది?

సూరిని చంపానని భాను అంగీకరించాడని సీఐడీ ధ్రువీకరిస్తోంది. మరి ఆ అవసరం భానుకు ఎందుకొచ్చింది? అందుకతన్ని ఎవరు ప్రేరేపించి ఉండొచ్చు? ఈ అంశాల్ని లోతుగా పరిశీలిస్తే సూరి పేరు చెప్పుకొని సెటిల్‌మెంట్ల ద్వారా లబ్ధి పొందిన వారు అతను జైలు నుంచి విడుదలయ్యాక, అతనికివ్వాల్సిన వాటాను ఎగ్గొట్టడానికి ఇలా చేసి ఉండొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ‘‘సూరి జైల్లో ఉన్నపుడు ఆయన పేరు చెప్పుకొని అప్పులిచ్చిన వాళ్లని బెదిరించటం, భూముల్ని సెటిల్ చేయటం వంటివాటిని కొందరు భాను ద్వారా చేయించుకున్నారు. జైల్లో ఉన్న సూరికి ఈ సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలిసేది. దాంతో తన వాటాపై సూరి లెక్కలు సూరికి ఉన్నాయి. జైల్లోంచి వచ్చాక అతను దాన్ని డిమాండ్ చేసి ఉండొచ్చు. దాంతో లబ్ధి పొందినవారు భానును ఆయుధంగా వాడుకుని, సూరిని చంపించి ఉండొచ్చు. ఇలాంటి అవకాశాల్ని కొట్టిపారేయలేం’’ అన్నది సీఐడీలోని కొన్ని వర్గాల వాదన. దీనికి తోడు సూరి హత్య తర్వాత ఏడాదికి పైగా భాను ఆచూకీ కూడా పోలీసులకు చిక్కని వైనమూ పలు అనుమానాలకు ఊతమిస్తోంది. ఎందుకంటే సూరిని చంపినప్పటి నుంచీ అజ్ఞాతంలో భాను విలాస జీవితమే గడిపాడు. 

పోలీసులు ఎంత ‘ముమ్మరంగా’ గాలించినా కనీసం ఆచూకీ కూడా చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఇలా పొరుగు రాష్ట్రాలన్నీ కలియదిరగాలంటే ఆర్థిక సాయం అత్యవసరం. అందుకు భాను సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాడనుకున్నా.. దాన్ని అతనికి చేరవేసేందుకు పెద్ద నెట్‌వర్కే ఉండాలి. ఇవన్నీ ఏవో ఆషామాషీ వ్యక్తులు చేయగలిగేవి కానే కావు. ధనబలం, నెట్‌వర్క్ ఉన్నవారే చేసుండాలి. పైగా ఇలా సాయం చేసినట్టు ఎప్పుడు బయటపడ్డా వాళ్లూ అడ్డంగా ఇరుక్కునే ప్రమాదం నిత్యం పొంచే ఉంటుంది. ఇవన్నీ చూస్తే.. భాను ద్వారా భారీగా లబ్ధి పొందిన వారు, సెటిల్‌మెంట్లు చేయించుకున్న వారు, మున్ముందు అతని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఆశించే వారు మాత్రమే ‘ఇంతటి’ సాయం చేయగలరు. కానీ అతి ముఖ్యమైన ఇలాంటి కీలక కోణాలను సీఐడీ ఏమాత్రం పట్టించుకోకపోవటమే ఇక్కడ వైచిత్రి!

బాబుపై నాడే భానుమతి ఆరోపణలు..

సూరి హత్య జరిగిన రోజు ఆయన భార్య గంగుల భానుమతి హైదరాబాద్ వచ్చారు. ఓ పక్క భర్తను కోల్పోయిన దుఃఖం, మరోపక్క పోస్టుమార్టం హడావుడిలో ఉన్న ఆమె నుంచి పోలీసులు హడావుడిగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. దాంతో తన సందేహాలు, అనుమానాలను ఆమె పూర్తిగా పోలీసులకు వెల్లడించలేకపోయారు. అయితే 10 రోజుల తరవాత సూరి స్వగ్రామం మద్దెలచెర్వులో భానుమతి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు సహకారంతో ఆయన మనుషులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని ఆరోపించారు. పోలీసులు మాత్రం వీటిని పరిగణనలోకే తీసుకోలేదు. ఇలా హతుని కుటుంబీకుల ఆరోపణలు పరిగణనలోకి తీసుకోకపోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని కొందరు పోలీసులే వ్యాఖ్యానించారు కూడా! సూరి హత్య కేసులో దాదాపు 30 మందికి పైగా వ్యక్తుల్ని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు... భానుమతి ఆరోపణలపై కనీసం దృష్టి కూడా సారించకపోవటం చిత్రమే. బాబును, ఆయన మనుషుల్ని కూడా నిందితులుగా భావించి ప్రశ్నించి ఉంటే, ఈ కేసును అడ్డం పెట్టుకుని జగన్‌పై బాబు చెలరేగిపోయే ఆస్కారం ఉండేది కాదు కూడా.

సింగనమల.. మురళీమోహన్ భాగస్వామి

జయభేరితో సింగనమల రమేశ్ భాగస్వామ్యం చాలా గట్టిది. బ్యాంకుల నుంచి ఉమ్మడిగా లోన్లు తీసుకుని వీళ్లు జాయింట్ వెంచర్లు కూడా వేశారు. అసలు సింగనమల షేక్‌పేట, నానక్‌రామ్‌గూడల్లో భూ లావాదేవీలు 1996 నుంచే మొదలయ్యాయి. తరవాత కల్యాణ్ కొనుగోలు చేసిన పక్కనే, అంటే నానక్‌రామ్‌గూడలో సర్వే నంబర్లు 119, 128, 129బీ, 116, 117ల్లో ఎకరా భూమిని వెంకటేశ్వరరావు కొన్న స్థానికుల నుంచే ఆయన కూడా కొనుగోలు చేశారు. తర్వాత మదీనగూడ, పుప్పాలగూడ, దొమ్మర పోచంపల్లి, గచ్చిబౌలి, ఖాజాగూడ, గోపన్‌పల్లి, మాదాపూర్, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతాల్లో సింగనమల తన పేరిట, భార్య విద్యాధరి పేరిట భూములు కొనుగోలు చేస్తూ పోయారు. 2002కు ముందే మురళీమోహన్‌తో బంధాన్ని దృఢం చేసుకున్న ఆయన.. అప్పట్లోనే జయభేరి నిర్మించిన సిలికాన్ కౌంటీలో రూ.7 లక్షలకు 1,915 చదరపు అడుగుల ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తరవాత భూముల కొనుగోళ్లను కొనసాగించి, వాటిని జయభేరికి డెవలప్‌మెంట్ నిమిత్తం ఇవ్వటం, మురళీమోహన్‌తో కలిసి జాయింట్ వెంచర్లు వేయటం మొదలుపెట్టారు. అలాంటి కొన్ని ఉదాహరణలు చూస్తే..

-గచ్చిబౌలి సర్వే నంబరు 47లో 5,445 గజాల స్థలాన్ని దుగ్గిరాల రవికిరణ్ (మురళీమోహన్ బంధువు), సెరెండిపిటీ కన్సల్టెన్సీతో కలిసి 2006లో జయభేరి ప్రాపర్టీస్‌కు డెవలప్‌మెంట్ నిమిత్తం ఇచ్చి భారీ భవంతిని నిర్మించారు సింగనమల. అంతకుముందు గోపన్‌పల్లిలో సర్వే నంబర్లు 44, 45లలో రెండు 450 గజాల ప్లాట్లను (నెంబరు 3, 38) కొనుగోలు చేసి జయభేరికి డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్లు 128/ఎఎ, 129ల్లోని రెండెకరాల స్థలంలో సింగనమల, విద్యాధరి కలిసి జయభేరి ప్రాపర్టీస్‌తో జాయింట్ వెంచర్ చేశారు. ఆరెంజ్ కౌంటీ నిర్మించారు. దీనికోసం అంతా కలిసి బ్యాంకు రుణాలు సైతం తెచ్చుకున్నారు. గచ్చిబౌలిలోని సర్వే నంబర్లు 60, 61, 62, 63ల్లోని 4,450 గజాల స్థలాన్ని సైతం సింగనమల మరికొందరితో కలిసి జయభేరికి డెవలప్‌మెంట్‌కు ఇచ్చి భారీ భవంతిని నిర్మించారు.

బాబుతో బంధమిదిగో...!

మరో ఆసక్తికరమైన అంశమేమంటే.. చంద్రబాబు అధికారంలో ఉండి హైటెక్ సిటీకి అంకురార్పణ చేసే ముందు తనవారికి ఆ చుట్టుపక్కల అడ్డగోలుగా భూములు కేటాయించారని, తద్వారా బాబు ‘రియల్’ బినామీ మురళీమోహన్ భారీగా లబ్ధి పొందారని వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఇప్పటికే కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. వి.సునీల్ అనే వ్యక్తి అర్జున్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ద్వారా రెండు మూడు కేటాయింపులు పొందారని కూడా అందులో పేర్కొన్నారు. చిత్రంగా.. సునీల్, అర్జున్ సొల్యూషన్స్ కలిసి కొన్న భూమిని ఆ తరవాత మురళీమోహన్‌కు చెందిన ఎం.ఎం.ఫైనాన్షియర్స్, సింగనమల కలిసి కొనుగోలు చేశారు. ఈ రకంగా మాదాపూర్‌లోని సర్వే నంబర్ 64లో ప్లాట్ నంబరు 21ని (2,028 గజాలు) కొన్నారు.

జయభేరి చుట్టూ ‘చిల్లర’ బ్రదర్స్..

నానక్‌రామ్‌గూడ సర్వే నంబర్ 117, 119, 129ల్లో ఎకరం స్థలాన్ని తమ్మారెడ్డి వాణికుమారి, చిల్లర కల్యాణ్ కలిసి జయభేరికి 2005లో విక్రయించారు.

ఇక్కడే సర్వే నంబరు 119లో 11 గుంటల భూమిని 2006లో కల్యాణ్ నుంచి జయభేరి కొనుగోలు చేసింది.

ఇదో చిత్రమైన లావాదేవీ. నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్లు 116, 117ల్లో 2,420 చదరపు గజాలను, 2006లో కల్యాణ్ తన సోదరుడు వెంకటేశ్వరరావుకు బహుమతిగా రిజిస్టర్ చేశాడు. అంతకు ముందే అక్కడ 1.75 ఎకరాలను స్థానికుల నుంచి కొన్న వెంకటేశ్వరరావు, సోదరుడి బహుమతి తర్వాత స్థానికుల నుంచి మరో 13 గుంటలు కొన్నాడు. కల్యాణ్‌లానే జయభేరితో ‘దృఢమైన’ బంధం కొనసాగించాడు. అక్కడ తన భూమిలో దాదాపు ఎకరాన్ని తొలుత జయభేరికి అమ్మాడు. తర్వాత కోళ్ల అశోక్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి 3,509 గజాల స్థలంలో భారీ భవంతి నిర్మాణానికి జయభేరితో ‘డెవలప్‌మెంట్’ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Share this article :

0 comments: