ఆద్యంతం కక్ష సాధింపులే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆద్యంతం కక్ష సాధింపులే

ఆద్యంతం కక్ష సాధింపులే

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012


ఆరోపణలు మొదలుకుని అరెస్టు దాకా.. ఆది నుంచీ అంతులేని కుట్రలు. జగన్‌మోహన్‌రెడ్డిని ఏదోలా అప్రతిష్టపాలు చేసే కుటిల యత్నాలు. అధిష్టానం సారథ్యంలో అధికార పార్టీ, పచ్చ పార్టీ, పైత్యపు పచ్చ మీడియా.. మూడూ ఒక్కటై.. సీబీఐని ముందుంచుకుని సాగిస్తున్న ముప్పేట దాడి. తేదీ, సంతకం కూడా లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా విచారణలు. అక్కడి నుంచి పూర్తిస్థాయి దర్యాప్తు ముసుగులో సీబీఐ సోదాలు, విచారణలు మొదలు తాజా వేధింపుల దాకా కనీవినీ ఎరగని వేగంతో చోటుచేసుకుంటున్న పరిణామాలు. కాంగ్రెస్ ప్రాయోజిత లేఖలోని అంశాలే మక్కికి మక్కి టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్‌లో ప్రత్యక్షం. ఆనక సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లోనూ అవే, అనంతరం వాయిదాల పద్ధతిన దర్యాప్తు సంస్థ దాఖలు చేస్తున్న చార్జిషీట్లలోనూ అవే! అంతేకాదు.. వార్తల ముసుగులో పచ్చ మీడియా అనునిత్యం వండి వడ్డిస్తున్న కథనాల్లోనూ.. ఆద్యంతం అవే అంశాలు! అడుగడుగునా అధిష్టానం స్థాయిలో రూపకల్పన చేసిన ‘డిజైన్’కు అనుగుణంగానే జరుగుతూ వచ్చిన ఈ పరిణామాల క్రమం... 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

వేదనపైనా రాజకీయమే..
కాంగ్రెస్‌ను వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ విషాదాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబాలను ఓదార్చేందుకు మాట ప్రకారం జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఇది కాంగ్రెస్‌కు కంటగింపుగా మారింది. పార్టీ అధిష్టానం కూడా దానిపై ఆంక్షలు పెట్టింది. అయినా జగన్ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం వల్లే పలు సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ 2010 అక్టోబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్రావు హైకోర్టుకు కనీసం తేదీ గానీ, సంతకం గానీ లేకుండా ఒక లేఖ రాశారు. 

కాంగ్రెస్‌లో అంతర్గతంగా తనపై విమర్శలు, దాడులు పెరగటంతో 2010 నవంబర్ 29న పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. తర్వాత 3 రోజులకే, అంటే 2010 డిసెంబరు 2న.. జగతి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ, దానిపై పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చిన నెలన్నరకు, 2011 జనవరి 24న శంకర్రావు లేఖను హైకోర్టు తనంతట తానుగా విచారణకు తీసుకుంటూ జగన్, జగతి సంస్థ తదితరులకు నోటీసులిచ్చింది. ఈ మధ్యలోనే శంకర్రావుకు మంత్రి పదవి దక్కింది! తర్వాత నెల రోజులకే, మార్చి 14న టీడీపీ నేతలు కె.ఎర్రన్నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఈ కేసులో ఇంప్లీడయ్యారు. పేజీ నంబర్లు, వాటిపై రాసుకున్న రఫ్ రాతలతో సహా శంకర్రావు దాఖలు చేసిన పత్రాలనే వీరూ దాఖలు చేశారు. శంకర్రావు లేఖపై ప్రాథమిక విచారణ నుంచి.. ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశం, అది పూర్తవడం, మళ్లీ విచారణ, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశం, ఆలోపే సాక్షి పిటిషన్లను సుప్రీంకోర్టు రెండుసార్లు కొట్టేయడం.. ఇవన్నీ టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్ వేసిన ఐదు నెలల్లోనే అన్ని పరిణామాలూ శరవేగంగా జరిగిపోయాయి.

నాయకునిగా జగన్ ఎదుగుదలను సహించలేక, ఆయన్ను అణచేందుకు అధిష్టానం సాయంతో కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన యత్నాలకు ఈ మొత్తం ఉదంతం అడుగడుగునా అద్దం పడుతూ వచ్చింది. ఇంతా చేస్తే, ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటి? తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చడమేనా? ఆ మేరకు ఇచ్చిన మాటపై నిలబడటమేనా? పార్టీకి రాజీనామా చేసిన 3 రోజులకే ఐటీ దాడుల వంటివి మొదలవడం, జగన్‌ను నయానో భయానో దారికి తెచ్చుకునే అధిష్టానం ప్రయత్నాల్లో భాగమే కాదా? జగన్‌ను వేధించేందుకు కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని చెప్పేందుకు కోర్టులో అవి దాఖలు చేసిన పత్రాల కంటే ఆధారాలు కావాలా? శంకర్రావు పిటిషన్ కూడా టీడీపీ కార్యాలయంలో తయారవడం అందుకు తిరుగు లేని నిదర్శనం కాదా?

కనీవినీ ఎరగని సీబీఐ ‘దాడి’..
జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తూ 2011 ఆగస్టు 10న హైకోర్టు తీర్పు వెలువడితే, ఆగమేఘాలపై మూడు రోజుల్లో సీబీఐకి ఆ ఉత్తర్వులు అధికారికంగా అందాయి. మధ్యలో రెండు రోజులు సెలవులొచ్చినా సీబీఐ ఈలోపే సిబ్బందిని సమీకరించి పెట్టుకుంది. వైఎస్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే సాక్షి, భారతీ సిమెంట్స్, సాక్షి పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో మూకుమ్మడి దాడులకు తెర తీసి.. రికార్డులను, కంప్యూటర్లను, పత్రాలను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుని.. పలువురిని పిలిచి, ప్రశ్నించి.. భయోత్పాతాన్ని సృష్టించింది. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ప్రవర్తించింది.

కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ఇన్వెస్టర్లను, అధికారులు తదితరులను పలుమార్లు పిలిచి ప్రశ్నించింది. సీబీఐ చేస్తున్నది, చేయబోయేది, ఏం చేయాలనేది రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన మీడియాలో ఎప్పటికప్పుడు ముందుగానే ప్రత్యక్షమవుతూ వస్తోంది. సాక్షుల్ని పిలిచి రహస్యంగా జరిపిన విచారణ వివరాలు కూడా ఆ మీడియాలో పూసగుచ్చినట్టుగా వెలువడుతూ వచ్చాయి. 2012 జనవరి 2న విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. మార్చి 31న చార్జిషీటు దాఖలు చేసింది. అంటే అక్కడితో విచారణ పూర్తయినట్టే. కానీ సీబీఐ మరోసారి తనదైన శైలిలో ప్రవర్తించింది. ఆ తరవాత రెండో చార్జిషీటు దాఖలు చేసింది. తరవాత మూడోది కూడా వేసింది. ఇంకా వేస్తూనే ఉంటానని స్పష్టం చేసింది.

ఇక్కడా అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అప్పటికే కొన్ని పదులసార్లు పిలిచి.. వందల గంటల పాటు విచారించిన విజయసాయిరెడ్డిని మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సాధారణంగా దర్యాప్తు పూర్తయ్యాక చార్జిషీటు వేస్తారు. కానీ సీబీఐ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూనే చార్జిషీట్లు వేస్తుండటంలో మతలబేంటి? ఎన్నాళ్లీ దర్యాపు సాగుతుంది? ఇంకెన్ని చార్జిషీట్లు దాఖలవుతాయి? ఎన్నాళ్ల పాటు ఎంతమందిని అరెస్టు చేస్తూ పోతుంది? దీనికి అంతూ పొంతూ ఉండదా?

ఇదీ చార్జిషీట్ల మర్మం..
తొలి చార్జిషీటులో ఇలా..
రూ.19 కోట్ల లబ్ధికి 30 కోట్ల పెట్టుబడులా?
తొలి చార్జిషీట్లో సీబీఐ చెప్పిందల్లా ఒక్కటే. హెటెరో, అరబిందో ఫార్మాలకు వైఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలేపల్లి సెజ్‌లో భూములు ఎకరా రూ.15 లక్షల విలువ చేస్తాయని అధికారులు చెప్పినా రూ.7 లక్షలకే ఎకరా చొప్పున కేటాయించారని! అలా ఈ రెండు సంస్థలకూ భూ కేటాయింపులపై ప్రభుత్వానికి రూ.19 కోట్ల నష్టం వచ్చిందని!! అందుకు ప్రతిగా ఆ సంస్థలు జగన్ కంపెనీల్లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాయని!!!

19 కోట్ల లబ్ధికి ప్రతిగా ఎవరైనా రూ.30 కోట్లు పెట్టుబడి పెడతారా? అలా పెట్టారంటే, ఆ కంపెనీల్లో వారు ఇన్వెస్ట్ చేశారనే కదా? వెనకబడిన జిల్లాలో పరిశ్రమల రాకకు తక్కువ ధరకు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదా? వందల ఎకరాలు కేటాయించేటప్పుడు కూడా విడిగా ఎకరం రేటునే చూస్తారా? అభివృద్ధి చెందిన భూమికి ఎకరా రూ.15 లక్షలుంటే, ఖాళీ భూమిని తక్కువకు కేటాయించరా? తీసుకున్న సంస్థ దాన్ని అభివృద్ధి చేశాక రేట్లు పెరగవా? ఇలాంటి అతి సాధారణ అనుమానాలు కూడా సీబీఐకి రానే లేదు. ఎందుకో ఎవరికీ తెలియదు.

రెండో చార్జిషీటులో అలా..
ఇన్వెస్టర్లు మోసపోయారట!
తొలి చార్జిషీట్లో ‘క్విడ్ ప్రొ కొ’ అన్న సీబీఐ, రెండో చార్జిషీట్లో మరో రూట్లో వచ్చింది. విజయసాయిరెడ్డి కోరిక మేరకే జగతి పబ్లికేషన్స్‌కు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లుగా డెలాయిట్ విలువ కట్టిందని, ఆ నివేదికను చూపి పెట్టుబడులు రాబట్టడం ద్వారా ఇన్వెస్టర్లను ఒకరకంగా మోసగించారని, వారికి లాభాలెలా వస్తాయో చెప్పలేదని, లాభాలతో కంపెనీ నుంచి బయటపడే మార్గాన్ని చూపించలేదని.. ఇలా మొత్తమ్మీద చార్జిషీటంతా దీని చుట్టే తిరిగింది. 

ఇదెక్కడి విచారణ?
రెండో చార్జిషీటు ప్రహసనంలో మరెన్నో కీలకమైన ప్రశ్నలు దాగున్నాయి. అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రొ కొ పెట్టుబడులనా, లేక పెట్టుబడిదారులు మోసపోయారా అనే అంశాన్నా? అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల తాము మోసపోయామని ఇన్వెస్టర్లెవరైనా ఫిర్యాదు చేశారా? పైగా, ‘ఈ నివేదిక సదరు యజమానులిచ్చిన సమాచారం ఆధారంగా తయారు చేసిందే. భౌతికంగా ఆస్తుల్ని తనిఖీ చేయలేదు’ అనే గమనిక డెలాయిట్ నివేదికలోనే ఉందిగా!! మరి ఆ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టడమంటే, గమనికను చూడనట్టా? షేర్ మార్కెట్లో షేర్లు కొన్నవారు నష్టపోతే అందుకు సీబీఐ జవాబుదారీ వ్యవహరిస్తుందా? ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లాభనష్టాలు రెండూ ఉంటాయని సీబీఐకి తెలియదా? ‘సాక్షి’ షేరును రూ.350 చొప్పున అధిక విలువకు విక్రయించారన్న సీబీఐకి, ‘ఈనాడు’ తన ఒక్కో షేరును ఏకంగా రూ.5.28,630 చొప్పున అమ్ముకోవడం అక్రమమని అనిపించలేదా? ‘ఈనాడు’ తన విలువను రూ.9,000 కోట్లుగా అంచనా కట్టినపుడు, సాక్షి విలువ అందులో సగం కూడా చెయ్యదా?

ముచ్చటగా మూడో చార్జిషీటు..
రాంకీ చుట్టే గిరికీలు
విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటుకు రాంకీ ఇన్‌ఫ్రా సంస్థకు అనుమతులివ్వడమే గాక, అక్కడ గ్రీన్‌బెల్ట్ కోసం వదలాల్సిన స్థలాన్ని తగ్గించటం ద్వారా సంస్థకు 150 ఎకరాలు మిగిలేలా చేశారని, అందుకే జగన్ కంపెనీల్లో ఆ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు.

నిమ్మగడ్డ అరెస్టు ఆంతర్యమేమిటి?
వాన్‌పిక్ ఉదంతంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేయడాన్ని సీబీఐ మతి లేని దూకుడు చర్యలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. వాన్‌పిక్ ప్రతిపాదన తొలుత వచ్చింది 1999-2000లో. ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ముందుగా ఈ మేరకు ప్రతిపాదన చేసి విరమించుకుంది. తర్వాత చెక్ సంస్థ స్కోడాతో సర్కారుకు ఎంవోయూ కుదిరినా, అది ఎంతకూ ప్రాజెక్టును చేపట్టకపోవడంతో రద్దయింది. ఆ తర్వాత రస్ అల్ ఖైమా వచ్చింది. ప్రభుత్వంతో ఎంవోయూ కుదిరాక తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డను చేర్చుకుంది. గంగవరం పోర్టును కూడా చంద్రబాబు హయాంలోనే జీ2జీ పేరిట దుబాయ్ ప్రభుత్వానికి అప్పగించగా, అది స్థానిక భాగస్వామిగా డీవీఎస్ రాజును ఎంచుకుంది. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల్ని కూడా ఇలాగే అప్పగించారు బాబు. 

నిజానికి స్కోడాతో ఒప్పందం రద్దయింది 2007 సెప్టెంబర్‌లో కాగా, జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడి పెట్టిందేమో 2007 ఆగస్టులో! అప్పటికి కనీసం రస్ అల్ ఖైమా అనే పేరైనా తెర మీదికి రాలేదు. పైగా నిమ్మగడ్డ తాను భారతి సిమెంట్స్‌లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపుకు పైగా లాభాలను వాటా విక్రయం ద్వారా కళ్లజూశారు. ఆ పెట్టుబడులు ముడుపులే అయితే వాటికి లాభాలెలా వస్తాయి? ఇలాంటి పెట్టుబడులపైనా క్విడ్ ప్రొ కొ ముద్ర వేసేది?! ఇలా వచ్చిన రూ.308 కోట్ల లాభాన్ని కలిపి రూ.350 కోట్లను 2010 ఏప్రిల్‌లో జగతి పబ్లికేషన్స్‌లో ప్రసాద్ ఇన్వెస్ట్ చేశారు. పైగా అప్పటికి వైఎస్ మరణించి 8 నెలలు గడిచాయి. అయినా సరే, నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రొ కొ గానే సీబీఐ కంటికి కన్పిస్తున్నాయి! ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తను ఇంత అన్యాయంగా అరెస్టు చేయడం ద్వారా ప్రపంచానికి ఏం సందేశమివ్వదలచుకున్నారో పాలకులకే తెలియాలి. జగన్‌పై కక్షసాధించే ప్రయత్నంలో రాష్ట్ర పారిశ్రామిక భవితవ్యాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పకనే చెప్పారు ఢిల్లీ పెద్దలు! 

వీటికి బదులేదీ..?
ఈ మొత్తం ఉదంతంలో ఎవరికైనా సహజంగా తలెత్తే ప్రశ్నలు కొన్నున్నాయి. సాధారణంగా లోకాయుక్త, కాగ్, విజిలెన్స్, ఏసీబీ.. ఇలా ఏదో ఓ సంస్థ సాక్ష్యాధారాలతో నివేదికలిస్తేనే ఏ కేసులోనైనా సీబీఐ విచారణకు ఆదేశిస్తారు. మరి ఈ ఉదంతంలో ఏ నివేదిక ఆధారంగా అలా ఆదేశించారు? ఇంతకూ సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికలో ఏముంది? దాన్ని జగన్ సంస్థలు కోరినా హైకోర్టు ఎందుకివ్వలేదు? సుప్రీంకోర్టు చెప్పినా అందుకు నిరాకరించారేం? పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది ప్రాథమిక నివేదిక ఆధారంగా కాదన్నారు.. మరి దేని ఆధారంగా ఆదేశించినట్టు? ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొందరికి లబ్ధి కలిగిందని, అందుకు ప్రతిగా వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కోర్టే పేర్కొంది. 

అంటే ప్రభుత్వ నిర్ణయాలు తప్పని కోర్టు భావించినట్టే కదా! అలాంటప్పుడు దానిపై హైకోర్టు సూచించినా ప్రభుత్వం తన వాదనను కౌంటర్ రూపంలో విన్పించలేదెందుకు? ప్రభుత్వ వాదన వినకుండానే తీర్పెలా వెలువడింది? సీబీఐ కూడా దర్యాప్తునకు పాటించాల్సిన పద్ధతులను ఎందుకు పాటించలేదు? దర్యాప్తునకు నిర్దిష్ట గడువెందుకు విధించలేదు? ఇలా.. అన్నీ ప్రశ్నలే. కానీ వీటిలో దేనికీ సమాధానం లేదు! 

మరి బాబుకు ముట్టిందెంతో..?
విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామంటూ 2000 జూలై 18న నాటి సీఎం చంద్రబాబు జీవో (381) ఇచ్చారు. దానిప్రకారం తానే చైర్మన్‌గా ఓ ఫార్మా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అది ఫార్మా సిటీకి భూమి కోసం కాకినాడ నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న కోస్తా ప్రాంతమంతటినీ పరిశీలించి, చివరికి పరవాడ ఐడీఏను ఎంపిక చేసింది. పరవాడలో పారిశ్రామికవాడ ఏర్పాటు సరికాదని 1997లోనే జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా జరిపిన సర్వేలో తేలింది. 

దాంతో ఆ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కార్యకలాపాలకే పరిమితం చేశారు. అయినా బాబు ప్రభుత్వం వీటిని బేఖాతరు చేసింది. పీపీఏ ద్వారా ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ 2001 సెప్టెంబర్ 24న జీవో 501ను విడుదల చేసింది. ఆ వెంటనే ఏపీఐఐసీ అక్కడ సూత్రప్రాయంగా భూములు సేకరించి డెవలపర్‌కు అందజేసేందుకు సమ్మతిస్తూ 2002 సెప్టెంబర్ 3న లేఖ రాసింది. డెవలపర్‌గా ఎల్ అండ్ టీని ఎంపిక చేశారు. ఫార్మా సెజ్‌ల అభివృద్ధిలో ఏ అనుభవమూ లేని ఎల్ అండ్ టీ ఎంపికపై విమర్శలు రావడంతో రాంకీ సంస్థను బాబు సర్కారే ఎంపిక చేసింది. 2002లో దానికి 2,143 ఎకరాలు అప్పగించింది. తరవాత, వైఎస్ అధికారంలోకి రావడానికి కేవలం నెల ముందు, అంటే 2004 ఏప్రిల్‌లో రాంకీ-ఏపీఐఐసీ జాయింట్ వెంచర్ కంపెనీ హడావుడిగా ఏర్పాటైంది!

వైఎస్ ప్రభుత్వం గ్రీన్‌బెల్డ్ మినహాయింపులు ఇచ్చిందంటూ జగన్‌ను టార్గెట్ చేస్తున్న సీబీఐ.. రాంకీకి 2,143 ఎకరాలు అప్పగించిన బాబును ఎందుకు పట్టించుకోవటం లేదు? 150 ఎకరాల లబ్ధికే జగన్ కంపెనీల్లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే, 2,143 ఎకరాలు కేటాయించిన బాబుకు ఇంకెంత ప్రయోజనం చేకూర్చి ఉండాలి? ఆయన సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టి ఉండాలి? వీటిపై సీబీఐ కన్ను పడదేం? కేవలం ‘సాక్షి’లోని పెట్టుబడులకు మాత్రమే ఇలాంటి పస లేని లింకుల్ని వెదకటమే సీబీఐ పనిగా పెట్టుకుందని దీన్ని బట్టే అర్థం కావడం లేదా?

ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లోనూ జగనే లక్ష్యం..
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంతో పాటే ఎమ్మార్ కేసులో కూడా శంకర్రావు లేఖ ఆధారంగానే సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలోనూ సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ రెండు కేసుల విచారణా జగనే కేంద్రంగా సాగుతున్న వైనం కూడా బహిరంగ రహస్యమే.
Share this article :

0 comments: