సీబీఐకి కోర్టు షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐకి కోర్టు షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు జగన్

సీబీఐకి కోర్టు షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు జగన్

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* జగన్‌ను వేధించాలన్న వ్యూహానికి చెక్
* కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
* సెక్షన్ 167 కింద కస్టడీకిచ్చే సమస్యే లేదన్న కోర్టు
* అరెస్టు అక్రమమని పరోక్షంగా చెప్పిన న్యాయమూర్తి
* ఇప్పటికే చార్జిషీట్ దాఖలైంది.. దాన్ని కోర్టు స్వీకరించింది.. చార్జిషీట్ దాఖలుతో దర్యాప్తు పూర్తయినట్టే భావించాలి
* కాబట్టి కస్టడీ కోరే హక్కును సీబీఐ కోల్పోయింది
* తేల్చి చెప్పిన సీబీఐ ప్రిన్సిపల్ జడ్జి పుల్లయ్య
* జగన్‌కు జూన్ 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్
* భారీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యుత్సాహానికి అడ్డుకట్ట పడింది. వేధింపుల వ్యూహానికి కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన సీబీఐకి ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. మే 25 నుంచి మూడు రోజుల పాటు, దాదాపు పాతిక గంటలకు పైగా జగన్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులకు ఊహించని విధంగా పెద్ద ఝలకిచ్చింది. జగన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో వేధింపులకు గురి చేయాలన్న సీబీఐ ఆశలపై నీళ్లు చల్లింది. నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్ 167 కింద జగన్‌ను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ ఎస్పీ హెచ్ వెంకటేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. 

జగన్‌కు వ్యతిరేకంగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినందున ఆయనను కస్టడీకి కోరే హక్కును కోల్పోయిందని స్పష్టం చేసింది. జూన్ 11 వరకు జగన్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎ.పుల్లయ్య సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగన్ అరెస్ట్ అక్రమమని సీబీఐ కోర్టు పరోక్షంగా చెప్పినట్లయింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడం ద్వారా, న్యాయమూర్తి తన విచక్షణాధికారం ఆధారంగా జగన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టయింది. అనంతరం జగన్‌ను భారీ భద్రత నడుమ సోమవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

అంతకుముందు ఆదివారం రాత్రంతా జగన్‌ను సీబీఐ అధికారులు దిల్‌కుశ అతిథి గృహంలోనే ఉంచారు. సోమవారం ఉదయం 7.45 సమయంలో సతీమణి భారతి, సోదరి షర్మిల, ఆడిటర్ విజయసాయిరెడ్డి దిల్‌కుశకు వచ్చి ఆయనతో కాసేపు మాట్లాడారు. అనంతరం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ వైఎస్‌ఎన్ రాజు, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ దక్షిణామూర్తిలతో కూడిన నిమ్స్ వైద్యుల బృందం దిల్‌కుశలోనే జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది. తర్వాత జగన్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లారు. 

సుప్రీం తీర్పులను ఉటంకించిన జడ్జి
జగన్ కేసులో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించడం, నిందితునికి సమన్లు జారీ చేయడం, ఆయన కోర్టు ముందు హాజరవడం జరిగిందని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎ.పుల్లయ్య గుర్తు చేశారు. దీంతో దర్యాప్తు పూర్తయిందని భావించాలని స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయింది కాబట్టి, సెక్షన్ 167 కింద నిందితుడిని కస్టడీకి ఇవ్వడం కుదరదని సీబీఐకి తేల్చిచెప్పారు. ‘‘సీబీఐ పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేసింది. దర్యాప్తు పూర్తయింది కాబట్టి, ఒకవేళ రిమాండ్ ఏదైనా ఉంటే అది సెక్షన్ 309 కింద మాత్రమే సాధ్యం. కాబట్టి సెక్షన్ 167 కింద రిమాండ్ ప్రశ్నే తలెత్తదు. పైగా చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించి, జగన్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలు ప్రారంభించడం జరిగింది గనుక ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతున్నా. కాబట్టి సీబీఐ అధికారులు జగన్‌ను తమ కస్టడీకి కోరజాలరు’’ అని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

జగన్ అరెస్టు అక్రమమని, అందువల్ల ఆయనను సీబీఐ కస్టడీకి ఇవ్వరాదన్న జగన్ తరఫు న్యాయవాదుల వాదనలను, ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పులను ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తమ ముందున్నది బెయిల్ పిటిషన్ కాదు గనుక కేసు లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడానికి కారణాలను వివరించారు. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం, దానిని కోర్టు విచారణకు స్వీకరించడం జరిగినందున, కస్టడీ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

జగన్‌కు జైలులో ప్రత్యేక హోదా
సోమవారం సాయంత్రం 5.35కు జగన్‌ను పటిష్ట భద్రత మధ్య నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలు వద్దకు తీసుకొచ్చారు. ఆవరణ ఎదురుగా ఉన్నవారికి నమస్కరిస్తూ ఆయన జైలు లోపలికి వెళ్లారు. స్పెషల్ కేటగిరీ కింద సౌకర్యాలు కల్పించాలన్న ఆదేశాల నేపథ్యంలో జగన్‌ను ప్రత్యేక సదుపాయాలున్న బ్యారక్‌లో ఉంచారు. పార్లమెంట్ సభ్యుడినైన తనకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి ఎ.పుల్లయ్య సోమవారం విచారించారు. 

జైలు నిబంధనల మేరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు. దాని ప్రకారం ఇతర ఖైదీలతో సంబంధం లేకుండా బాత్‌రూమ్‌తో కూడిన ప్రత్యేక గది కేటాయిస్తారు. బెడ్, పరుపు, దిండు, దోమతెర అందిస్తారు. ఒక టేబుల్, కుర్చీ ఏర్పాటు చేస్తారు. దినపత్రికలు, మేగజీన్లు, పుస్తకాలు తెప్పించుకోవచ్చు. టీవీ కూడా ఉంటుంది. వంట మనిషిని నియమించుకుని సొంతంగా వంట చేయించుకునే సౌకర్యం కల్పిస్తారు. కుటుంబ సభ్యులు పళ్లు, బిస్కెట్ల వంటివాటిని తీసుకొచ్చేందుకు కూడా అనుమతిస్తారు.

భద్రత ఏర్పాట్లను సమీక్షించిన జైళ్ల డీజీ
చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో భద్రత ఏర్పాట్లను జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టీపీ దాస్ స్వయంగా సమీక్షించారు. జైలుకు వచ్చి ఐజీ అనిల్‌కుమార్, డీఐజీ శామ్యూల్ జాన్సన్, జైలు సూపరింటెండెంట్ నాయుడులతో సమావేశమై చర్చించారు. జైల్లో ఇప్పటికే వీఐపీ ఖైదీలుండటం, జగన్‌ను కూడా తరలిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టంచేశారు. 

నిరసనతో జగన్ సంతకం
వైఎస్ భారతి కూడా


సీబీఐ అధికారులు తన అరెస్టుకు చెప్పిన కారణాల పట్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అరెస్టయిన వ్యక్తికి అందుకు దారి తీసిన కారణాలను వివరిస్తూ సీబీఐ అధికారులు అరెస్టు మెమో ఇవ్వాలన్నది నిబంధన. దాని ప్రకారం ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారులు జగన్‌కు అరెస్టు మెమోను అందజేశారు. దాన్ని చదివి, సంతకం చేయాల్సిందిగా కోరారు. మెమోను చదివిన జగన్, తన నిరసనను దానిపై రాతపూర్వకంగా వ్యక్తం చేస్తూ సంతకం చేశారు. 

‘‘రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, నేర శిక్షా స్మృతిని ఉల్లంఘించే విధంగా నా అరెస్టు ఉంది. నన్ను అరెస్టు చేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే నా అరెస్టుకు సంబంధించిన వ్యవహారం కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. కోర్టు ఆదేశాల తరువాతే మీకు అధికారముంటుంది. వాస్తవానికి, ‘ఇప్పటికే సమన్లు జారీ చేసినందున, పోలీసులు అరెస్టు చేయబోరు’ అని ముందస్తు బెయిల్ మధ్యంతర ఉత్తర్వుల్లో కోర్టు స్పష్టంగా పేర్కొంది. నిరసనతో నేనిక్కడ సంతకం చేస్తున్నా’’ అంటూ స్వదస్తూరితో రాసి సంతకం చేశారు. జగన్ సతీమణి భారతి కూడా ఇదే మాదిరిగా నిరసన తెలిపారు. అరెస్టు సమాచారమిస్తూ సీబీఐ తనకు అందజేసిన డాక్యుమెంట్‌లో, ‘అరెస్టు రాజ్యాంగ, సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధం’ అంటూ ఆమె రాతపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తూ దానిపై సంతకం చేశారు.

కిక్కిరిసిన కోర్టు హాలు
జగన్‌ను కోర్టుకు తీసుకొస్తున్న సందర్భంగా ఉదయం 10 గంటలకే ఆయన అభిమాన న్యాయవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు. దాదాపు 200 మంది న్యాయవాదులు, జర్నలిస్టులు తదితరులతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. దాంతో.. కేసుకు సంబంధం లేని న్యాయవాదులు బయటకు వెళ్లాలని న్యాయమూర్తి పుల్లయ్య సూచించారు. ఎవరూ స్పందించకపోవడంతో ఆయన తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, నాంపల్లి సీఐ శ్రీధర్ వెళ్లి ఆయనకు పరిస్థితిని వివరించారు. కొందరినే బయటకు పంపడమంటే కష్టమని తెలిపారు. దాంతో న్యాయమూర్తి విచారణను ప్రారంభించారు. తీవ్రమైన ఉక్కపోత మధ్యే దాదాపు 3 గంటల పాటు వాదనలు విన్నారు.
Share this article :

0 comments: