జగన్ అరెస్టుపై మధ్యాహ్నమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సీబీఐ సమాచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టుపై మధ్యాహ్నమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సీబీఐ సమాచారం

జగన్ అరెస్టుపై మధ్యాహ్నమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సీబీఐ సమాచారం

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్నీ పోలీసులు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించడంతోపాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, 144 సెక్షన్‌లతో ప్రజలను బెంబేలెత్తించారు. ఓ రకంగా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేశారు. పై నుంచి అందిన ఆదేశాల మేరకు సమయానుకూలంగా కరెంటు కోతలు, కేబుల్ ప్రసారాల నిలిపివేతతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. జగన్‌ను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సీబీఐ ముందస్తు సమాచారాన్ని అందజేసింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్వయంగా నగర జాయింట్ కమిషనర్ మహేష్ భగవత్‌ను దిల్‌కుశ అతిథి గృహానికి రప్పించి ఈ సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే జిల్లాల్లో ఎక్కడా కూడా ఆందోళనలు జరగకుండా నిరోధించాలని, నేతలు, కార్యకర్తలను అరెస్టుచేయాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలు జారీచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు విషయం బయటకు పొక్కకముందే అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ అరెస్టుపై ఏవిధమైన నిరసనలు జరిగినా ఉపేక్షించవద్దని ఆదేశాలలో స్పష్టంచేశారు.
హై అలర్ట్: ఈ నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నతాధికారులు ‘హై అలర్ట్’ను ప్రకటించారు. ఎందుకు హైఅలర్ట్‌ను చేసిందీ బహిర్గతం చేయకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని మాత్రం పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు అందాయి. 

దీంతో రాష్ట్రంలోని జాతీయరహదారులపై సాయుధ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయడమేగాక అన్ని జిల్లాల ప్రధాన కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల సోదాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా జగన్ అరెస్ట్ వార్తను సీబీఐ అధికారికంగా ప్రకటించేలోగా స్థానిక పోలీసులే గాక సాయుధ పోలీసులను ప్రధాన కూడళ్లలో బందోబస్తుకు దింపారు.
ఆర్టీసీ బస్సులను వెనక్కు పంపి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో లాడ్జీలు, హోటళ్లలో ఉన్న వారిని కూడా పోలీసులు ఖాళీ చేయించారు. మరోవైపు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కార్యకర్తలను కూడా బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. కడప, కర్నూలు, గుంటూరు, వరంగల్, మహబూబ్‌నగర్, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పలు ఆర్టీసీ బస్సులను రద్దు చేసి.. అవి డిపోలకు పంపేయాలంటూ ఆర్టీసీకి పోలీసు అధికారులు సూచించారు.

ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు..: జగన్‌ను విచారణకు పిలిచిన 25వ తేదీ నుంచే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, క్రియాశీల కార్యకర్తలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఆయా జిల్లాల స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కన్నేసి ఉంచేలా ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ అరెస్టు గురించి సీబీఐ రాత్రి 7.20 గంటలకు ప్రకటించేలోపే హన్మకొండలో ఎమ్మెల్సీ కొండా మురళితోపాటు వివిధ జిల్లాల్లో ఉన్న పలువురు నాయకులను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. 

పకాశం జిల్లా చీరాల, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు, యర్రగొండపాలెం మండలాల్లోని పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలను ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా మొత్తం మీద 260 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గిర్రాజు నగేష్‌లను ముందస్తుగా అరెస్టు చేశారు. కల్యాణదుర్గంలో ఎల్‌ఎం మోహన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్యతోపాటు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు మదన్‌లాల్ సహా జిల్లావ్యాప్తంగా 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. విజయవాడలో పార్టీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకులు పి. గౌతంరెడ్డి, మాజీ మేయర్ తాడి శకుంతల, వంగవీటి శంతన్‌కుమార్, ఉయ్యూరులో వంగవీటి శ్రీనివాస ప్రసాద్‌ను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలో సుమారు 90 మంది నాయకులను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి చెందిన సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీల ఇళ్ల చుట్టూ బలగాలను మోహరించారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వందలాది మందిని పోలీసుస్టేషన్లలో బంధించారు. 

జగన్ అరెస్టుకు గంట ముందు కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలను ఫోన్లలో, స్వయంగా కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని.. ఇళ్ల నుంచి బయటికొచ్చి నిరసన కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 

తూర్పు గోదావరి జిల్లాలో మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే వందలాదిగా పోలీసులు కాకినాడ, రాజమండ్రిలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో మోహరించారు. షాపులను, మద్యం షాపులను, పెట్రోల్ బంక్‌లను దగ్గరుండి మూయించి వేశారు. ఎక్కడికక్కడ జిల్లా, రాష్ర్ట నాయకులను గృహనిర్బంధం చేశారు. వందల సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు. రాజమండ్రిలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మి, నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, జక్కంపూడి రాజాలను గృహనిర్బంధం చేశారు. సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి గుర్రం గౌతమ్, పార్టీ నాయకులు చోడిశెట్టి రాఘవబాబులను అరెస్టు చేశారు. పి.గన్నవరంలో పార్టీ సీజీసీ సభ్యుడు కొండేటి చిట్టిబాబు సహా 30 మందిని అరెస్టు చేశారు. 

రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి, జిల్లా యూత్ కన్వీనర్ జి. సురేశ్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, సుండుపల్లె మండలంలో రాజంపేట అభ్యర్థి ప్రచారంలో ఉంటూ కడపకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వేకోడూరులో వైఎస్ కొండారెడ్డిని, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు మరో 40 మంది ముఖ్య కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో నిండిపోయాయి. కాగా, సీబీఐ 7.20 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టును ధ్రువీకరించగా, 7.30 నుంచి జిల్లా కేంద్రంలో అన్ని దుకాణాలను పోలీసులు దగ్గరుండి మూసివేయించారు. మెదక్ జిల్లా రాజీవ్ రహదారితో పాటు, ఏడు, తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డిలోని డిప్యూటీ సీఎం దామోదర ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కఠినంగా వ్యవహరించండి..

జగన్ అరెస్టు నేపథ్యంలో డీజీపీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. సోమవారం రాష్ట్ర బంద్ నేపథ్యంలో రాయలసీమలో పట్టణాలతోపాటు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కూడా అదనపు బలగాలను పం పారు. సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దిం చారు. సాయుధ బలగాల బూట్ల కవాతుద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే లక్ష్యంతోనే పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. రానున్న వారంరోజులపాటు శాంతిభద్రతల అంశంపై మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారంరోజులపాటు ఏకంగా హై అలర్ట్ ప్రకటించడం, జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీచేయడం చాలా అరుదు.

చానళ్లకు హెచ్చరికలు 

ప్రభుత్వం, పోలీసుశాఖ మరో అడుగు ముందుకు వేసింది. జగన్ అరెస్టు, తదనంతర పరిణామాలను న్యూస్ చానళ్లలో చూపించరాదంటూ ఆదివారం రాత్రి మౌఖికంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకేవార్తను పదేపదే చూపడం ద్వారా ఏమైనా అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకుంటే న్యూస్ చానళ్లదే బాధ్యతని ఆ హెచ్చరికల సారాంశం. పరిస్థితి చేయిదాటితే దానికి ఆయా మీడియా చానళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీచేశారు.
Share this article :

0 comments: