అడుగడుగునా నిర్బంధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా నిర్బంధం

అడుగడుగునా నిర్బంధం

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధం
హైదరాబాద్‌కు రానివ్వకుండా పోలీసుల అడ్డంకులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్‌కు సంఘీభావంగా జిల్లాల నుంచి హైదరాబాద్ బయలుదేరిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అడుగడుగునా అడ్డంకులు సృ ష్టించి వారిని అరెస్టు చేశారు. చెక్‌పోస్టుల్లో వాహనాలు తనిఖీ చేసి ఆ పార్టీకి చెందిన వారు లేరని ధ్రువీకరించుకున్నాకే వదులుతున్నారు. పలువురిని గృహనిర్బంధం చేశారు. కార్యకర్తలకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నాయకుల ఇళ్ల వద్ద గస్తీ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వద్దకు జగన్‌ను కలిసేందుకు పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌గౌడ్, సిటీ అధ్యక్షుడు ఠాకూర్ అమీత్‌సింగ్, రాష్ట్ర యువజన నాయకుడు బి.శ్రీకాంత్, రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో వస్తున్న 27 మందిని సోమాజిగూడలో పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్య వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చితకబాదారు. అలాగే వైఎస్‌ఆర్ సీపీ సేవాదళం సిటీ కన్వీనర్ వెల్లెల రాంమోహన్, ఐటీ విభాగం స్టేట్ బాడీ మెంబర్ దేవేందర్‌రెడ్డిలను కూడా పంజగుట్ట పోలీసులు గోల్కొండ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు మహ్మద్‌ఖాజా, గులాంసాజీద్‌లను గురువారం అర్ధరాత్రే అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ చౌరస్తాలో నిలబడి ఉన్న వైఎస్‌ఆర్ జిల్లావాసి రాహుల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 

జగన్ ప్రైవేటు భద్రత సిబ్బందీ అరెస్టు 
జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సీబీఐ విచారణ కోసం గురువారం రాత్రి మాచర్ల నుంచి జగన్ వెంట 34 మంది సెక్యూరిటీ గార్డులు నగరానికి వచ్చారు. వారంతా పంజగుట్టలోని విష్ణుప్రియ లాడ్జిలో బస చేసేందుకు వెళ్లారు. కాగా పోలీసులు అత్యుత్సాహంతో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ లాడ్జిపై దాడి చేశా రు. తామంతా వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిమని వారు చెప్పినా వినకుండా బ్యాగ్‌లు తనిఖీలు చేసి, వారందరినీ అరెస్ట్ చేసి గోషామహాల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. సాయంత్రం 6.30 గంటల వరకు వారిని విడిచిపెట్టలేదు.


జిల్లాల్లోనూ అదే తంతు 
వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎమ్మెల్సీ కొండా మురళిని జనగామ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విడిచిపెట్టారు. కరీంనగర్ జిల్లాలో ముందు జాగ్రత్త పేరుతో 113 మందిని అరెస్ట్ చేసి సాయంత్రం వరకు స్టేషన్లలో నిర్బంధించారు. వేములవాడలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఆది శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అదుపులో తీసుకొని సాయంత్రం వదిలిపెట్టారు. విజయవాడలో పార్టీ నాయకులకు షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. నాయకుల ఇళ్ల వద్ద గట్టి నిఘా పెట్టారు. మెదక్ జిల్లాలో మండలాల వారీగా తమ జాబితాలో ఉన్న నేతలను స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. పెద్దశంకరంపేట, బుధేరాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి, సాయంత్రానికి వదిలేశారు.

నెల్లూరులో ఎక్కడ చూసినా పోలీసులు గుంపులు గుంపులుగా కనిపించారు. లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆలంపూర్, షాద్‌నగర్ చెక్‌పోస్టుల వద్ద హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు వాహనాలను ఆపి తనిఖీలు చేసిన పోలీసులు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు లేరని రూఢీ చేసుకున్న తరువాతే పంపుతున్నారు. ఇదే పరిస్థితి శ్రీశైలం హైవేపై కూడా కొనసాగింది. నల్లగొండ జిల్లాలో పోలీసు అధికారులు పార్టీ నాయకులకు ఫోన్లు చేసి, తమకు తెలియకుండా ఎటూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. రెండు వాహనాల్లో కోదాడ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎర్నేని బాబు, కెఎల్‌ఎన్‌ప్రసాద్, మరో ఇరవై మంది కార్యకర్తలను సూర్యాపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లోని వాడపల్లి బ్రిడ్జి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆందోళనలు
సీబీఐ విచారణ పేరుతో ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తోందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జగన్‌పై కాంగ్రెస్, సీబీఐ చేస్తున్న కుట్రలు ఆపాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ సీపీకి చెందిన నలుగురు మహిళా నాయకురాళ్లు హైదరాబాద్‌లో ఓ కాంప్లెక్స్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కి రోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కిందకి దించారు. నల్లగొండ జిల్లా కోదాడలో సైతం కార్యకర్తలు ఓ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కారు. నేరేడుచర్లలో మరో నలుగురు యువకులు సెల్‌టవర్ ఎక్కారు. కడపలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేయగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మౌన ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. విజయవాడలో పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల నిరసన ప్రదర్శన చేశారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌కు చెందిన వరలక్ష్మీ, వాజ్‌పేయినగర్‌కు చెందిన శారద నేరేడ్‌మెట్ చౌరస్తాలోని మార్షల్ హోటల్‌పై ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. రంగారెడ్డిజిల్లా పార్టీ కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి ఫోన్ చేసి జగన్‌కు మంచి జరగాలంటే ఆత్మహత్యలు మానుకోవాలని సూచించడంతో వారు కిందికి దిగివచ్చారు.
Share this article :

0 comments: