ప్రకటనలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే: మాజీ ఎంపీ కె.కేశవరావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రకటనలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే: మాజీ ఎంపీ కె.కేశవరావు

ప్రకటనలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే: మాజీ ఎంపీ కె.కేశవరావు

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

* ఇది ముమ్మాటికీ సర్కారు తొందరపాటు చర్య
* జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రిక, టీవీ చానల్‌కు ప్రకటనలు నిలిపివేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఖండించారు. ఇది భావప్రకటన హక్కును అడ్డుకోవడమేనని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం జారీచేసిన జీఓపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘ప్రజాస్వామ్య వాదిగా ఈ జీఓను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకొనో, సర్దుబాటుచేసుకొనే వెళ్లిందే తప్ప... ఏనాడూ పత్రికలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా మారింది. ప్రభుత్వ చర్యలపై ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ కూడా స్పందించాయి. సోనియాను, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాయి. జీఓను వెంటనే ఉపసంహరించుకోండి. సాక్షి పత్రికైనా... ఇంకేదైనా సరే ఆ పేపర్ జగన్‌దా? కేకేదా? కిరణ్‌దా? అనేదిచూడొద్దు. సాక్షి ఎన్నో తప్పులు రాసి ఉండొచ్చు. ఈనాడూ, ఆంధ్రజ్యోతి కూడా ఇలాగే రాసి ఉండవచ్చు. ఆ సంస్థలను రాజ్యాధికారంతో ఆపేయాలని చూస్తే ప్రజలు సహించరు. వాటి స్వేచ్ఛను అడ్డుకోరాదు’’ అని అన్నారు. 

వాటితో ముడిపెట్టడం సరికాదు
జగన్‌పై ఉన్న కేసులకు, సాక్షి పత్రికకు ముడిపెట్టి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం సరికాదని కేకే అన్నారు. జగన్‌పై కేసుల్ని సీబీఐ, కోర్టు చూసుకుంటుందన్నారు. ‘‘సీబీఐ విచారణ, ఖాతాల నిలిపివేత తప్పా ఒప్పా అనే వాటితో మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేస్తూ వచ్చిన జీఓ మాత్రం దురదృష్టకరం. సీబీఐ కేసు పెట్టింది కనుక ప్రకటనలు నిలిపివేస్తామనడమేమిటి? ప్రకటనలు నిలిపివేయాలని సీబీఐ, కోర్టు చెప్పలేదు కదా? అయినా జీఓ ఎలా ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు. జీఓ ఇవ్వడానికి కారణాలనూ వివరించలేకపోయారని చెప్పారు. ప్రజాప్రయోజనాల గురించే జీఓను ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇందులో ప్రజాప్రయోజనమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం అత్యుత్సాహంతో తీసుకున్న చర్యేనని కేకే తప్పుబట్టారు.
Share this article :

0 comments: