ఇలాగైతే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓట్లేయరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇలాగైతే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓట్లేయరు

ఇలాగైతే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓట్లేయరు

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012



* ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి
* వైఎస్ అంటే ముస్లింలకు ఇప్పటికీ గౌరవమే
* కోర్టు అభ్యంతరం చెప్పినా ముస్లింల కోసం పోరాడిన వ్యక్తి ఆయన
* జగన్ కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు.. ఆయనకు మంచి జరగాలి
* ఉప ఎన్నికల ఫలితాలే అందరికీ కనువిప్పు కలిగిస్తాయి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడం దురదృష్టకరమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించలేకపోవడం శోచనీయమన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ముస్లింలెవరూ కాంగ్రెస్‌కు ఓట్లేసే పరిస్థితే ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు.

‘‘ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తున్నారని హైకోర్టు చెప్పడం బాధాకరం. బీసీ వర్గాలకు ఏమి చూసి రిజర్వేషన్ కల్పిస్తున్నారు? బీసీలతో పోలిస్తే వెనుకబడిన మైనార్టీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించరాదు? హైకోర్టు తీర్పు వల్ల మైనార్టీలు రిజర్వేషన్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయే దుస్థితి ఏర్పడింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంక్షేమం గురించి పట్టించుకోని పార్టీలను ముస్లింలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును వాదించేందుకు సొలిసిటర్ జనరల్‌ను కాకుండా అదనపు సొలిసిటర్ జనరల్‌ను పంపడమే ఇందుకు నిదర్శనమన్నారు. తక్షణమే హైకోర్టు తీర్పుపై స్పందించి సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తన వైఖరేమిటో వెల్లడించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పిన వైఎస్... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడారని గుర్తు చేశారు. అందుకే ముస్లింలు ఇప్పటికీ వైఎస్‌ను ఎంతో అభిమానిస్తున్నారన్నారు.

జగన్ జైల్లో ఉన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ‘‘జగన్ అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నా (ఐ విష్ హిం ఆల్ ద బెస్ట్). జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున జగన్ గురించి ఇంతకంటే మాట్లాడటం సరికాదు. ఉప ఎన్నికల ఫలితాలే అందరికీ కనువిప్పు కల్గిస్తాయి..’’ అని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీకి ఓటేయాలని చెబుతారని ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2014లో కాంగ్రెస్‌కు ఓటేయాలని చెబుతారా ఓటేయొద్దని పిలుపునిస్తారా అన్న ప్రశ్నకు... పరిస్థితి ఇలాగే కొనసాగితే ముస్లింలెవరూ కాంగ్రెస్‌కు ఓట్లేసే పరిస్థితే ఉండదన్నారు. కాంగ్రెస్‌తో మీ పార్టీకున్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లేనా అని అడగ్గా... నవ్వుతూ ‘‘అనుబంధమా..?’’అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: