తిరుపతిలో జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతిలో జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం

తిరుపతిలో జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

జెడ్ కేటగిరీ వ్యక్తి వాహనాన్ని వదిలి కాలక్షేపం చేసిన పోలీసులు 
పోలీసుల తీరుపై డీజీపీ, ఐజీకి ఫిర్యాదు

తిరుపతి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్‌కు భద్రత కల్పించే విషయం వదిలేసి వాహనాల్లోనే కూర్చుని కాలక్షేపం చేశారు. దీంతో జనం తోపులాటల వల్ల జగన్ రెండుసార్లు కింద పడబోయారు. ఈ సంఘటనల తర్వాతైనా పోలీసులు వాహనాలు దిగలేదు. 

అదేమిటని అడిగితే... మేం ఎంత భద్రత కల్పించాలనుకున్నామో అంత కల్పించామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో ఉప ఎన్నిక ప్రచారం కోసం వస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి మూడు రోజుల కిందట అర్బన్ ఎస్‌పీ ప్రభాకరరావుకు సమాచారం అందించారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటించే ప్రాంతాలు, సభలు జరిగే స్థలాల వివరాల షెడ్యూల్ అందించి తగిన భద్రత కల్పించాలని కోరారు. 

మైకుల ఏర్పాటు కోసం కూడా అనుమతి కూడా తీసుకున్నారు. మంగళవారం ఉదయం తిమ్మినాయుడు పాళెంలో జగన్‌మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది ఆయన భద్రతా వ్యవహారాలను వదిలేసి వాహనాల్లోనే కూర్చున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఉపయోగించిన వాహనం చుట్టూ నామమాత్రపు భద్రత కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన కారు దిగి జనం దగ్గరకు వెళ్లేప్పుడు, జనం ఆయన కారు దగ్గరకు వచ్చే సమయం, కారు దిగి ప్రచార వాహనంలోకి వెళ్లే సందర్భాల్లో ఆ చుట్టుపక్కల పోలీసు అనే వ్యక్తే కనిపించలేదు. 

దీనివల్ల రెండు, మూడు చోట్ల జనం జగన్‌మోహన్‌రెడ్డి మీద పడటంతో ఆయన కింద పడబోయారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాతనైనా పోలీసులు స్పందించలేదు. దీని గురించి పార్టీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా... ‘‘మేం ఎంత భద్రత కల్పించాలనుకున్నామో అంత కల్పించాం. షెడ్యూల్‌లో లేనిచోట సభలు పెడితే మేమేం చేయలేం’’ అని వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

షెడ్యూల్‌లో లేని ప్రాంతాల్లో ఒక్క సభ జరగకపోయినా పోలీసు అధికారులు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అడ్డగోలు సమాధానాలు చెప్పారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై పార్టీ రాష్ర్ట నాయకులు రాయలసీమ రేంజ్ ఐజీ, డీజీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులతో పాటు సభలకు హాజరైన ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

జగన్‌కు భద్రత లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారా?..
హైదరాబాద్: తిరుపతి శాసనసభా నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బందోబస్తు పెట్టకుండా, సెక్యూరిటీ లేకుండా గాలికొదిలేసిందని పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఎత్తున సెక్యూరిటీ కల్పిస్తూ... ఒక పార్టీకి అధ్యక్షుడైన జగన్‌కు సెక్యూరిటీ కల్పిం చకుండా నిర్లక్ష్యం చేయడంపై మండిపడ్డారు. భద్రతలేకుండా చేసి జగన్ పర్యటనను అడ్డుకోవాలని సర్కారు చూస్తోందా? అని ప్రశ్నించారు. ఈ వివక్షను తాము తీవ్రంగా ఖండిస్తున్నామనీ రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ఇంటెలిజెన్స్ వర్గాలు మేలుకొని జగన్ పర్యటన సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: