ఈ దశలో సీబీఐకి ఆ అధికారం ఎక్కడిది? బ్యాంకు ఖాతాల స్తంభనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ దశలో సీబీఐకి ఆ అధికారం ఎక్కడిది? బ్యాంకు ఖాతాల స్తంభనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు

ఈ దశలో సీబీఐకి ఆ అధికారం ఎక్కడిది? బ్యాంకు ఖాతాల స్తంభనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012


 ‘సాక్షి’ పత్రిక, చానల్‌ల బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేయటాన్ని వేధింపులకు పరాకాష్టగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ సంస్థలు అభివర్ణించాయి. ఇలా చేయటం చట్టాలను అపహాస్యం చేయటమే కాక.. 20వేల మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవటమేనని అభిప్రాయపడ్డాయి. సీబీఐ చర్యను సవాల్ చేస్తూ.. జనని ఇన్‌ఫ్రా సంస్థతో పాటు జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ సంస్థలు బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ‘‘సాక్షి మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అంతటి సంస్థల బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయటం వల్ల వారి జీవనోపాధికి విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది. రాజకీయ దురుద్దేశంతో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధించటంలో భాగంగానే సీబీఐ ఇదంతా చేసింది’’ అంటూ మూడు సంస్థల తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి పిటిషన్లను దాఖలు చేశారు.

ఈ దశలో సీబీఐకి ఆ అధికారం ఎక్కడిది?
‘‘క్విడ్ ప్రో కో’ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. అంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు అందుకు ప్రతిఫలంగా జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది. ఆ ఆరోపణలేవీ ఇంకా నిర్ధారణ కాలేదు. మరి అభియోగాలు నిరూపణ కాకుండా అక్రమ సంపద అని ఎలా నిర్ధారిస్తారు? ఇది చట్టాన్ని అపహాస్యం చేయటం కాదా?’’ అని పిటిషనర్లు ప్రశ్నించారు. కంపెనీలు, సంస్థలకు లబ్ధి చేకూర్చేలా జీవోలు జారీచేయటం ద్వారానే జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయన్నదే అసలు ఆరోపణ అంటూ.. ‘‘అలా లబ్ధి చేకూర్చారని చెప్తున్న జీవోలపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సంబంధిత జీవోలు జారీ చేసిన మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దాన్ని అసలు పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐ ఇలాంటి చర్యలకెలా దిగుతుంది?’’ అని ప్రశ్నించారు.


‘సాక్షి’ ఇన్వెస్టర్లను సీబీఐ వెంటాడి మరీ వేధిస్తోందని, దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు తీవ్రంగా భయపడుతున్నారని న్యాయవాది అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సీబీఐ గత మార్చి 31న కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని తెలియజేశారు. ‘‘ఆ చార్జిషీటు దాఖలు చేసి ఇప్పటికి 40 రోజులు దాటిపోతోంది. ఇటీవలే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుని జగన్‌మోహన్‌రెడ్డి సహా ఇతర నిందితులు తన ఎదుట హాజరుకావాలని సమన్లు కూడా జారీ చేసింది. మరి ఈ దశలో సీఆర్‌పీసీ సెక్షన్ 102 కింద బ్యాంకు ఖాతాల నిర్వహణను నిలిపివేసే అధికారం సీబీఐకి ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది?’’ అని ప్రశ్నించారాయన. సీబీఐ చర్యల ఫలితంగా పెట్టుబడిదారులు, ఉద్యోగులు, పాఠకులు, సరఫరాదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని నివేదించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభి రామారావు.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసేందుకు వీలుగా విచారణను గురువారానికి వాయిదా వేశారు.


పిటిషన్‌లోని ముఖ్యాంశాలివీ...
‘సాక్షి’ పత్రికకు 14 లక్షల సర్క్యులేషన్ ఉంది. కోటీ నలభై లక్షల మంది పాఠకులు సగటున రోజూ దీన్ని చదువుతున్నారు. అలాగే సాక్షి చానల్‌కు దాదాపు 4 కోట్ల వ్యూయర్‌షిప్ ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన రెండో పత్రికగా ‘సాక్షి’కి గుర్తింపు ఉంది.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే పత్రిక, చానల్‌కు సంబంధించిన ఆర్థిక వనరులపై గురిపెట్టారు.

‘సాక్షి’ సంస్థలో 20 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఖాతాలు నిలిపివేయటంతో వీరి జీవనోపాధికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది.

పత్రిక, చానల్ నిర్వహణకు నెలకు రూ. 35 కోట్లు ఖర్చు ఉంటుంది. ఇందులో న్యూస్‌ప్రింట్‌కు రూ. 20 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 8 కోట్లు, ఇతర ఖర్చులు రూ. 7 కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకు ఖాతాల లావాదేవీల నిర్వహణ నిలిపివేయటంతో ఈ రెండు సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుంది.

ఈ రెండు సంస్థల నిర్వహణలో భాగంగా వ్యాపారులకు, ఇతర సేవలు అందించే వారికి ఇప్పటికే రూ. 3.13 కోట్ల చెక్కులు ఇచ్చింది. బ్యాంకు ఖాతాల నిర్వహణ నిలిపివేయటంతో ఆ చెక్కులు బౌన్స్ అవుతాయి. దీంతో ‘సాక్షి’ ప్రతిష్టకు విఘాతం కలగటంతోపాటు చెక్కులు పొందిన సంస్థలు ‘సాక్షి’ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

‘సాక్షి’ సంస్థల నిర్వహణకు ఇబ్బంది లేకుండా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేలా ఆదేశాలు జారీచేయాలి. జగన్ సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంలో నమోదైన కేసు తుది విచారణ ముగిసే వరకూ ఆస్తులను బదిలీ చేయటం కానీ, క్రమ విక్రయాలు చేయటం కానీ చేయబోమని స్పష్టమైన హామీ ఇస్తున్నాం.

రూ. 1,600 కోట్ల నష్టాలు, 11 లక్షల సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ పత్రిక విలువను రూ. 7 వేల కోట్లకు లెక్కగట్టి షేర్‌ను రూ. 5,28,630 రూపాయలకు విక్రయించారు. అయినా ‘ఈనాడు’ సంస్థలపై ఎటువంటి చర్యలు చేపట్టరు. 14 లక్షల సర్క్యులేషన్, రూ. 3,500 కోట్ల విలువైన సాక్షి రూ. 350 రూపాయలకు షేర్‌ను విక్రయించటం తప్పెలా అవుతుంది?

‘సాక్షి’ మీడియా సంస్థలతో పాటు, జనని ఇన్‌ఫ్రాలకు చెందిన రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించకుండా ఎస్‌బీఐ, ఓబీసీ బ్యాంకు ఖాతాల నిర్వహణకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయండి.

సీబీఐ చర్య రాజ్యాంగ విరుద్ధం
‘సాక్షి’ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలను సీబీఐ ఫ్రీజ్ చేయటం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. దర్యాప్తు పూర్తి చేసి మూడు చార్జిషీట్‌లు దాఖలు చేసిన తర్వాత సీఆర్‌పీసీ సెక్షన్ 102 కింద బ్యాంకు ఖాతాలను నిలిపివేయటం చట్టవిరుద్ధం. పేపర్ విక్రయం, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని వేసుకున్న ఖాతాలను నిలిపివేయటం సీబీఐ అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సీబీఐని, కోర్టులను వేదికగా వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంపైనే దాడిగా భావించాలి. - శంకర్‌రావు తరఫు న్యాయవాది మల్లేశ్వర్‌రావు


అనుమానాస్పదమైనప్పుడే సీజ్ చేయాలి
సీఆర్‌పీసీ సెక్షన్ 102 కింద అనుమానాస్పద డబ్బు, ఇతర విలువైన వస్తువులను మాత్రమే సీజ్ చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయి చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాల నిర్వహణను నిలిపివేసే అవకాశం ఉంటుంది. సీబీఐ చర్య పత్రికా ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. సీబీఐ చర్య ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వేలాది మందిపై ప్రభావం పడుతుంది.
- న్యాయవాది వి.సురేందర్‌రావు


ఫ్రీజ్ చేసేసి.. తీరిగ్గా చెప్పారు!
‘సాక్షి’కి ఒక రోజు ఆలస్యంగా సీబీఐ సమాచారం
సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ ఛానల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసిన సీబీఐ ఒక రోజు ఆలస్యంగా ఆ సమాచారాన్ని ‘సాక్షి’ యాజమాన్యానికి తెలియజేసింది. ముందస్తు సమాచారం లేకుండానే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ బ్యాంక్ ఖాతాలను మంగళవారం నాడే సీబీఐ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఖాతాలను నిలుపుదల చేయాలంటూ నేరుగా బ్యాంకర్లకు నోటీసులు ఇచ్చిన విషయమూ విదితమే. 


సమన్లు అందుకున్న సీబీఐ
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీచేసిన సమన్లను సీబీఐ అధికారులు బుధవారం అందుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డితోపాటు హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, అరబిందో ఫార్మ ఎండీ కె.నిత్యానందరెడ్డి, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ పూర్వ ఎండీ పి.శరత్‌చంద్రారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌గా పనిచేసిన యద్దనపూడి విజయలక్ష్మీ ప్రసాద్, అరబిందో ఫార్మా కంపెనీ సెక్రటరీ, పీఏసీ చంద్రమౌళిలతోపాటు అరబిందో, హెటిరో, ట్రిడెంట్, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా కంపెనీలకు కోర్టు వేర్వేరుగా సమన్లు జారీచేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాదితో కలిసి కోర్టులో హాజరుకావాలని సమన్లలో స్పష్టం చేసింది.

Share this article :

0 comments: