కుట్ర జరుగుతోందన్న జగన్ ఆందోళనలను నిరూపించే దిశగానే సాగుతున్న తాజా చర్యలు.. భయానక పరిస్థితులు సృష్టించేందుకు పక్కా వ్యూహం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్ర జరుగుతోందన్న జగన్ ఆందోళనలను నిరూపించే దిశగానే సాగుతున్న తాజా చర్యలు.. భయానక పరిస్థితులు సృష్టించేందుకు పక్కా వ్యూహం..

కుట్ర జరుగుతోందన్న జగన్ ఆందోళనలను నిరూపించే దిశగానే సాగుతున్న తాజా చర్యలు.. భయానక పరిస్థితులు సృష్టించేందుకు పక్కా వ్యూహం..

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012


కుట్ర జరుగుతోందన్న జగన్ ఆందోళనలను నిరూపించే దిశగానే సాగుతున్న తాజా చర్యలు.. భయానక పరిస్థితులు సృష్టించేందుకు పక్కా వ్యూహం..
రేపు తమ ఎదుట హాజరు కావాలంటూ వైఎస్ జగన్‌కు సీబీఐ సమన్లు 
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునే లక్ష్యం.. హింస సాకుతో ఎన్నికల వాయిదాకు కుట్ర
20 రోజులు గడువివ్వాలని కోరిన జగన్.. జూన్ 15 తర్వాత ఎప్పుడు 
పిలిచినా హాజరవుతానన్నా తిరస్కరించిన సీబీఐ
9 నెలలుగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఇప్పుడు అకస్మాత్తుగా సీబీఐ హడావుడి
హైదరాబాద్‌లో నేటి నుంచి 29 దాకా 144 సెక్షన్..
అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కూడా.. కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు?
వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతల బైండోవర్‌కు సన్నాహాలు..
రాయలసీమ పోలీసు పెద్దతో సీబీఐ అధికారుల ‘చర్చలు’

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అనుమానాలే నిజమయ్యాయి. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జైత్రయాత్రను అడ్డదారిలోనైనా సరే అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు పన్నిన కుట్ర బట్టబయలైంది. తనను అరెస్టు చేసి.. ఆ సందర్భంగా పాలక, ప్రతిపక్షాలు కలసికట్టుగా రాష్ట్రంలో విధ్వంసానికి, అల్లర్లకు పాల్పడి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టేలా నీతిమాలిన రాజకీయ కుట్రకు కాంగ్రెస్, విపక్ష టీడీపీ, సీబీఐ కలసికట్టుగా పథక రచన చేశాయంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళన అక్షరసత్యమని రుజువైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల బరిలో నేరుగా ఎదుర్కోలేక, ఆయనను ఉప ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకు హస్తిన స్థాయిలో పక్కాగా పథక రచన జరిగిన వైనం సీబీఐ తాజా చర్యలతో తేటతెల్లమైంది. మొదటినుంచీ అడుగడుగునా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న సీబీఐ, ఇప్పుడు వారి తాజా ప్రణాళికను అక్షరాలా అమలు చేసేందుకు మరింతగా బరితెగించింది. ఉప ఎన్నికల నాటికి రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పూర్తిగా రంగం సిద్ధం చేసింది. 

25న శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలంటూ జగన్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడం అందులో భాగమేనని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే, ఆస్తుల కేసు విచారణ మొదలై 9 నెలలు గడుస్తున్నా సీబీఐ ఇప్పటిదాకా జగన్‌కు నోటీసులివ్వడం గానీ, విచారణకు పిలవడం గానీ జరగనే లేదు. పైగా మే 28న స్వయంగా గానీ, లాయరు ద్వారా గానీ హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు జగన్‌కు ఇప్పటికే సమన్లు పంపింది. అలాంటిది.. ఉప ఎన్నికల ప్రక్రియ మొదలై, నామినేషన్ల ఘట్టం కూడా ముగుస్తున్న ఈ దశలో ఇంత హఠాత్తుగా, ఇంత హడావుడిగా జగన్‌కు నోటీసులివ్వడం.. తాను ప్రచారంలో ఉన్నందున కనీసం ఓ 20 రోజుల గడువివ్వాలని, జూన్ 15 తర్వాత ఎప్పుడు కోరినా విచారణకు హాజరవుతానని ఆయన చేసిన విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంలోనే దర్యాప్తు సంస్థ దురుద్దేశాలన్నీ బయటపడ్డాయి. జగన్‌ను అరెస్టు చేసి.. ఆ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ సృష్టించే హింసాకాండను సాకుగా చూపి వీలైతే ఉప ఎన్నికలను వాయిదా వేయించడం, లేదంటే కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేస్తున్న విసృ్తత ప్రచారాన్ని పూర్తిగా అడ్డుకోవడం అసలు లక్ష్యమని కూడా తేటతెల్లమవుతోంది. ఇలాంటి కుట్ర జరుగుతున్నట్టుగా తనకు పక్కా సమాచారముందని చెబుతూ, ఈ నీతిమాలిన ఎత్తుగడలను అడ్డుకోవాలని కోరుతూ ప్రధానికి, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌కు మంగళవారమే జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 24 గంటల్లోపే శరవేగంగా జరిగిన ఈ పరిణామం.. జగన్ ఆందోళన, కుట్ర కోణం పూర్తిగా వాస్తవాలేనని నిరూపించింది. ఇదొక్కటే కాదు.. గురువారం నుంచి హైదరాబాద్‌లో 144వ సెక్షన్ విధించడం, అన్ని జిల్లా, మండల కేంద్రాలకూ దాన్ని వర్తింపజేయాలంటూ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిందన్న సమాచారం, రాయలసీమ ప్రాంతానికి చెందిన పోలీసు ఉన్నతాధికారిని సీబీఐ స్వయంగా పిలిపించుకుని మరీ ‘చర్చలు’ జరపడం.. ఇలా బుధవారం జరిగిన పరిణామాలన్నీ కుట్ర కోణాన్నే మరింతగా బలపరుస్తున్నాయి. 

రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఇంతే కాదు.. గవర్నర్‌తో అన్ని విషయాల గురించీ మాట్లాడానని, ఉత్కంఠకు 25న తెర పడుతుందని స్వయంగా డీజీపీయే వ్యాఖ్యానించడం.. అదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలపై బైండోవర్ కేసులకు కూడా రంగం సిద్ధమవుతోందన్న విశ్వసనీయ సమాచారం.. ఇవన్నీ జరగబోయే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పకనే చెబుతున్నాయి. సాక్షి మీడియా నోరు నొక్కడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు దాని కనుసన్నల్లో సీబీఐ వేధింపులకు తెర తీయడం తెలిసిందే.

సీబీఐ అడ్డదారులు

తనకు సంక్రమించిన అధికారాలను అడ్డుపెట్టుకుని అధికార పార్టీకి సహకరించేందుకు సీబీఐ అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ఒకవైపు సాక్షి మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. ఆస్తుల కేసులో దాదాపుగా తొమ్మిది నెలలుగా విచారణ సాగిస్తున్నా, ఆయనను సీబీఐ ఇప్పటిదాకా విచారించలేదు. మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేసినా జగన్‌కు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. తీరా ఉప ఎన్నికల వేళ, సీబీఐ కోర్టులో హాజరు కావడానికి రెండు రోజుల ముందు తమ ముందుకు రావాలంటూ రాత్రికి రాత్రే హఠాత్తుగా, హడావుడిగా ఆయనకు నోటీసులివ్వడం మహా కుట్రకు నిదర్శనమేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం తాను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున 20 రోజులు ఆగాలని, జూన్ 15 తరువాత ఎప్పుడైనా సరే విచారణకు హాజరవుతానని న్యాయవాదుల ద్వారా జగన్ పంపిన విన్నపాన్ని సీబీఐ తిరస్కరించడం అందుకు మరింత బలం చేకూరుస్తోంది. 9 నెలలు ఆగిన సీబీఐ, మరో 20 రోజులు ఆగితే జరిగే నష్టమేమున్నట్టు? ఆలోపు అది దర్యాప్తును పూర్తి చేసే అవకాశం గానీ, సాక్ష్యాల తారుమారు వంటివి జరిగే ఆస్కారం గానీ లేనే లేవు. అయినా సరే.. ఉప ఎన్నికల వేళ, అన్ని పక్షాలూ ప్రచారాన్ని ఉధృతం చేసే సమయంలో.. పార్టీ అధ్యక్షునిగా ప్రచారం చేసేందుకు జగన్‌కున్న ప్రజాస్వామిక హక్కును కాలరాయాల్సినంతటి ‘అత్యవసర’ పరిస్థితి ఏమొచ్చినట్టు? సహజ న్యాయసూత్రాలను కూడా తుంగలో తొక్కడం వెనక లోగుట్టేమిటి? పైగా ఈ విషయంలో ఇన్ని రోజులుగా లేని ఆతృత ఇప్పుడే ఎందుకు ముంచుకొచ్చినట్టు? వీటిలో దేనికీ సమాధానం చెప్పే పరిస్థితిలో సీబీఐ లేదు. కానీ ఈ వైనాన్ని గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలేమిటో అర్థమవుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ, అది కూడా ప్రచార ఘట్టం పూర్తిస్థాయిలో కొనసాగుతున్న సమయంలో, ఒక పార్టీ అధ్యక్షున్ని ఇలా ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులపాలు చేయజూడటం అత్యంత అప్రజాస్వామికమని ప్రముఖ న్యాయవాదులు బుధవారం టీవీ చానళ్ల చర్చలో అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల ద్వారా లబ్ధి పొందజూస్తున్నదెవరో, వారు ఏం సాధించదలిచారో కూడా అందరికీ స్పష్టంగా అర్థమవుతూనే ఉందని పేర్కొన్నారు.

‘ముందస్తు’ వ్యూహంలో భాగమేనా..?

కాంగ్రెస్ ప్రతిష్ట దేశవ్యాప్తంగా నానాటికి దిగజారుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు లోక్‌సభకు, ఇటు రాష్ట్రంలో శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 2014 దాకా ఆగితే వంద సీట్లు కూడా వచ్చేలా లేవని నిర్ధారణకు వచ్చిందని, ఆరు మాసాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలంటూ మిత్రపక్షాలకు కూడా సూచించిందనిజాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు జగన్‌ను అరెస్టు చేసి, ముందస్తు ఎన్నికలు పూర్తయ్యేదాకా ఎలాగోలా జైల్లోనే ఉంచేలా పన్నాగం పన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా తాను గెలుచుకునే పరిస్థితి లేకపోగా అనేక చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయే ప్రమాదముందని పసిగట్టే.. జగన్‌ను అరెస్టు చేయాలని సీబీఐని కాంగ్రెస్ ఆదేశించినట్టు చెబుతున్నారు. జగన్‌ను ఆరెస్టు చేస్తే పరిస్థితి ఎలా ఉండొచ్చంటూ రాష్ట్రానికి చెందిన ఎంపీలను సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ ఆరా తీస్తున్నారు కూడా. మొత్తంమీద ఢిల్లీ బాసుల ఆదేశాలను సీబీఐ తూచా తప్పకుండా పాటిస్తూ, ఈ విషయంలో ఆ సంస్థ మాజీ డెరైక్టర్ జోగిందర్‌సింగ్ చెప్పిదంతా అక్షరసత్యమేనని కూడా రుజువు చేస్తోంది. పైగా విచారణ పేరుతో ఓ వర్గం మీడియాకు అడ్డగోలుగా లీకులు ఇస్తోంది. ఫలానా వారిని అరెస్టు చేస్తామంటూ కూడా ముందుగానే సమాచారం చేరవేస్తోంది. 

పోలీసులే భయానక వాతావరణం సృష్టిస్తున్నారా?

హైదరాబాద్ నగరంలో హఠాత్తుగా 144వ సెక్షన్ విధించడం చూస్తే పోలీసులు కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారేమోనన్న అనుమయానం కలుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ మంగళవారం ఉదయం ఆరింటి దాకా 144వ సెక్షన్ విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఉప ఎన్నికల నేపథ్యంలో నగరంలో భారీగా క్యాడర్‌ను మోహరించడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు, స్థానికంగా జరుగనున్న కొన్ని పరిణామాలను అవకాశంగా తీసుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించే అవకాశమున్నట్టు అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడో జరగబోయే ఉప ఎన్నికలకు, రాజధానికి ఏం సంబంధముందని ఇంత హడావుడి చేస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఏ సమాధానమూ లేదు. మరోవైపు.. జిల్లా, తాలూకా కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ విధించాల్సిందిగా కలెక్టర్లందరికీ ప్రభుత్వం ఆదేశాలు పంపినట్టు కూడా విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ కావచ్చని సమాచారం. పోలీసులు ఇంతటి హడావుడి, హంగామా సృష్టించడం వెనక కారణమేమిటన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ గతంలోనూ ఓఎంసీ కేసు విచారణలో ఓ సాక్షిగా సీబీఐ ముందు హాజరయ్యారు. ఆ సమయంలో లేని హడావుడిని ఇప్పుడే చేస్తుండటం, హఠాత్తుగా 144వ సెక్షన్ ఎందుకు విధించడం.. జగన్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెర వెనుక ఏదో జరుగుతుందనేందుకు ఇవన్నీ సూచికలుగానే కన్పిస్తున్నాయి. మరోవైపు రాయలసీమకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు బుధవారం ఇక్కడ సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు! సీబీఐ తన పని తాను చేయదలచుకుంటే, చట్టం ప్రకారం నడుచుకోవాలనుకుంటే ఇంత హంగామా ఎందుకు చేస్తున్నట్టంటూ న్యాయ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడంలేదు

జగన్ కేసులను సీబీఐ న్యాయ పద్ధతిలో దర్యాప్తు చేయడంలేదు. సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. కోర్టు న్యాయపరంగా దర్యాప్తు చేయమని సీబీఐని ఆదేశించిందే తప్ప.. ఎన్నికలకు ముందు ఒక వ్యక్తిని జైల్లో పెట్టమనో, అతన్ని చెడ్డవాడిగా చూపమనో చెప్పలేదు. సెక్షన్ 41 ఎ(1) కింద సమన్లు జారీ చేయడమంటే వాటిని అందుకున్న వ్యక్తిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అప్పటికే దర్యాప్తు సంస్థ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలు చూపాలి. ఒకటి ఫిర్యాదు ఉండటం, రెండోది దర్యాప్తు సంస్థ వద్ద కచ్చితమైన సమాచారం ఉండటం, మూడోది దర్యాప్తు చేయడానికి అరెస్టు అవసరమై ఉండటం. ఈ మూడు కారణాలూ జగన్ కేసులో ఇప్పుడు వర్తించేవి కావు. ఎందుకంటే అవన్నీ పాతవే. అందువల్ల జగన్‌ను అరెస్టు చేయడానికి ఇక్కడ కారణాలేమీ కనిపించడంలేదు. 

-రవిచంద్ర, సీనియర్ న్యాయవాది 

సీబీఐ తీరుపై అనుమానాలొస్తున్నాయి

జగన్ కేసులో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న తీరుపై అందరికీ అనుమానాలున్నాయి. ఈ నెల 28వ తేదీన హాజరు కావాలని కోర్టు జగన్‌ను ఆదేశించింది. ఈలోపే సీబీఐ సమన్లు జారీ చేయాల్సిన అవసరమేమొచ్చింది? కోర్టుకు హాజరయ్యేందుకు మూడు రోజుల ముందే వారి ఎదుట హాజరు కావాలని ఎందుకు కోరింది? సెక్షన్ 41 ఎ(1) కింద సమన్లు జారీ చేయడమంటే అరెస్టు చేయటం కాదు. కానీ, విచారణకు రమ్మని పిలిచి అరెస్టు చేస్తున్న సంఘటనలూ ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి రాజాను కూడా ఇదే తీరులో అరెస్టు చేశారు. ఇలాగే జగన్‌నూ అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలున్నాయి. 

-రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది 

శుభవార్త.. ‘సాక్షి’ని 24 గంటల్లో మూసేస్తున్నాం!

ఎల్లో మీడియా పెద్దకు ఇటీవల సీబీఐ అధికారి ఫోను

‘‘మీరు కోరుకున్నట్టే జరగబోతోంది. మరో 24 గంటల్లో సాక్షి దినపత్రిక, టీవీలను మూసేయబోతున్నాం’’ - హైదరాబాద్‌కు చెందిన సీబీఐ సీనియర్ అధికారి ఒకరు ఓ వర్గానికి చెందిన మీడియా అధిపతికి ఇటీవల ఫోన్ చేసి మరీ చెప్పిన ‘శుభవార్త’ ఇది! జగన్ కేసు విచారణ సాకుతో సీబీఐ ఎంత క్రూరంగా ఆలోచిస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. జగన్‌ను జైలుకు పంపడం, సాక్షి మీడియాను మూసేయడం.. ఈ రెండే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ, సీబీఐ, ఎల్లో మీడియా కలసికట్టుగా.. దుష్ట చతుష్టయంలా వ్యవహరిస్తున్న తీరు పట్ల న్యాయ నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎక్కడైనా మానవ హక్కులకు భంగం వాటిల్లినా, కార్మికులకు అన్యాయం జరుగుతున్నా, పాలకపక్షం ఉద్దేశపూర్వకంగా విపక్షాలను అణగదొక్కజూస్తున్నా.. వాటిపై జరిగే పోరాటానికి ప్రతిపక్షం, మీడియా మద్దతివ్వడం పరిపాటి. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వీరి బండారం బయటపడే రోజు దగ్గర్లోనే ఉంది’’ అని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: